17, అక్టోబర్ 2020, శనివారం

మాటతీరు

 మాటతీరు ఎలా ఉండాలి🙏


ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం. మాట ఓ అద్వితీయ శక్తి. దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకొనేందుకు- మాటే ఓ అద్భుత సాధనం.


లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు, అసమర్థంగా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా, అనాగరికంగా మాట్లాడేవారూ ఉన్నారు. ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే. మాటతోనే మనిషి వ్యాప్తిచెందాడు. మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు. ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు.


మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది. అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది. అదుపులేకుండా వాగడం మహాతప్ఫు మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు. కటువుగా, అతిగా మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్త్వవేత్తలు. ‘ఎదుటివారు మనల్ని అర్థం చేసుకొనేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అధిక ప్రసంగం తగదు’ అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు.


మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది. సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది.


మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ. మాట ప్రభావం అద్భుతం. అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు. అడ్డంగా నిలువగలదు. కొంపలు కూల్చగలదు. కుటుంబాలను రక్షించగలదు. శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు. పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని- పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు. సందర్భశుద్ధి కలిగిన మాటకే విలువ, మన్నన ఉంటుంది. మాట, దాని అర్థం ఎలా పెనవేసుకొని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపకంగా వివరించి చెప్పాడు. ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి చేకూరదు.


రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు. తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు.


మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక. కార్యసాధనకు పనిముట్టు. ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి మంచి మాటతీరును అలవరచుకోవాలి. మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్ఛు అప్పుడే మాటతీరుకు మంచి ఆకర్షణ, స్పష్టత, పటిష్ఠత సమకూరుతుంది.


కొందరి సంభాషణల్లో అబద్ధాలు, అపశబ్దాలు, అసభ్య పదాలు, అహంకారపు కథలు దొర్లుతుంటాయి. మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు. 

మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి. 

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. 

మంచి మాటకు మన్నన ఉంటుంది!🙏

కామెంట్‌లు లేవు: