17, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్ 95

 రామాయణమ్ 95

..

 తన తదుపరి కర్తవ్యము

 శ్రీ రాముని మరల అయోధ్యకు రప్పించి పట్టాభిషిక్తుడిని చేయటమే ! అని మనసులో దృఢపరచుకొన్న భరతునికి వశిష్ఠుల వారు రాజసభలో ఉన్నారు మిమ్ములను రమ్మనమని అన్నారు అనే కబురు వచ్చింది.

.

రాజసభాప్రాంగణంలో సకలసంభారాలతో సిద్ధంగా ఉన్నారు మహర్షి ! భరతుని చూడగనే "నాయనా ! నీతండ్రీ ,అన్నగారు ఇచ్చిన ఈ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు "అని పలికి భరతుడి ఆమోదం కోసం ఎదురు చూశాడు.

.

కనుల నీరునింపుకొని దోసిలి ఒగ్గి మహాత్మా రాముని రాజ్యమిది ! ఇక్ష్వాకుల లో ధర్మము తప్పి నడిచినవారు ఎవరైనా ఉన్నారా! ధర్మాత్ముడైన దశరథుడికి పుట్టినవాడు చేయవలసిన పనేనా ఇది ! దశరధుడి కొడుకు ఇంకొకరి సొత్తును అపహరిస్తాడా?

.

నేను ,ఈ రాజ్యము రాముడిసొత్తు! 

మా లో పెద్దవాడు ,దిలీప,నహుషులతో సమానుడూ అయిన రామునకే ఈ రాజ్యముపై అధికారము ,.వేరెవ్వరికీలేదు!.

.

నా తల్లి చేసిన పాపకార్యము నేనెన్నటికీ అంగీకరించను.

రాముడి ని అనుసరించటమే నాకు తెలిసినది.

.

ఏ కారణము చేతనైనా అన్నగారిని తీసుకొని రానట్లయితే నేనుకూడా లక్ష్మణునిలా అడవిలో ఉండిపోతాను.

.

మార్గములు ఏర్పరచేవారు,రక్షించేవారు,తదితరులంతా నాచేత ముందుగనే పంపబడినారు.

.

అని పలికి సుమంత్రునివైపు తిరిగి , వెంటనే రామునివద్దకు బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని, సైన్యంతో సహా సిద్ధం కావాలని ఆదేశించాడు.

.

భరతుడి ఆజ్ఞవిని సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూన్చిన రధం సిద్ధం చేసి ఉంచాడు.

.

పిమ్మట ప్రాతఃకాలమునందే లేచి శ్రేష్టమైన రధమెక్కి బయలుదేరాడు భరతుడు.ఆయన వెంట అయోధ్యలోని అధికారగణమంతా బయలుదేరింది.చతురంగబలాలు కదిలాయి. అయోధ్య అంతాకదిలింది.

.

అందరి మనసులో ఒకటే లక్ష్యం రాముడిని త్వరగా చూడాలని.

మనసుతో సమానంగా పరిగెత్తాలని కోరిక!.

.

అలా ప్రయాణం చేస్తూ గంగ ఒడ్డుకు చేరుకున్నారంతా!.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: