మూర్ఖుడు
🍁🍁🍁🍁
“మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనీ తథా
క్రోధశ్చ దృఢవాదశ్చ పరవాక్యేష్వనాదరః "
“గర్వము, చెడుమాటలు మాట్లాడుట, కోపము, పిడివాదము, ఇతరుల భాషణమునందు అనాదర భావము అను ఐదు మూర్ఖుల లక్షణములు"అని ఈశ్లోకానికి భావం.
“వాడికి తోచదు, ఒకరు చెప్తే వినడు",“ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్ట్దె దొకదారి.." ఇలాంటి మాటలు మూర్ఖులను గూర్చి చెప్పేటప్పుడు వింటూ ఉంటాం. భర్తృహరి“మూర్ఖపద్ధతి " అనే శీర్షికతో అద్భుతమైన శ్లోకాలు వ్రాశాడు.
ఇసుకనుంచి తైలం తీయటం, ఎండమావిలో దాహం తీర్చుకోవటం, కుందేటికొమ్మును సంపాదించటం వంటి అసాధ్యాలను సాధ్యం చేసుకున్నా, మూర్ఖుని మనసు మాత్రం రంజింపరానిదన్నాడు.
అస్థిరమనస్కుడైన మూర్ఖుడు ఒకసారి దుష్టునిగా, మరోసారి సంతుష్టునిగా, మరుక్షణంలో కోపిష్టివానిగా ప్రవర్తిస్తూఉంటాడు.
ఒకవేళ ఎప్పుడైనా అతడు ప్రసన్నుడై కనిపించినా, ఆ ప్రసన్నతకూడా భయం కల్గిస్తుంది.( “అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకరః" ) అంటుందొక సూక్తి.
విజ్ఞ లక్షణమైన వినయం - మూర్ఖునియందు ఏకోశానా ఉండదు. గర్వంతో మిడిసిపడుతూ ఉంటాడు. పలుక రాని మాటలు పలుకుతాడు. కోపస్వభావుడై కలహేచ్ఛ కలిగి ఉంటాడు. తానుపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు తన అభిప్రాయం దోషయుక్తమని తెలిసికూడా పిడివాదనలు చేస్తాడు. వాదనలో విజయాన్నే కాంక్షిస్తాడుగానీ సత్యాన్నీ, సామంజస్యాన్నీ లెక్కచేయడు.
దుర్యోధనుడు –“జానామి ధర్మం నచ మే ప్రవృత్తిః, జానామ్యధర్మం న చ మే నివృత్తిః" ( నాకు ధర్మం తెలుసు కానీ దానిని ఆచరించను. అధర్మమూ నాకు తెలుసు దానిని వదలలేను) అంటాడు.అలాగే రావణుడు “నాతలను రెండుగా విభజించినా, నాస్వభావం మారదు" అంటాడు. ఈ ఇద్దరూహితవు చెప్పినవారి మాటలను అనాదరించారు. తమ మూర్ఖతతో తాము నశించిపోయారు.
“మూర్ఖులు-పిడివాదం చేయటంలో దశముఖులు! ఇతరుల లోపలేశాన్ని చూడటంలో సహస్రాక్షులు! సజ్జన సంపదలను అపహరించటంలో సహస్రబాహులు! " అని అనుభవజ్ఞుల మాట.
🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి