17, అక్టోబర్ 2020, శనివారం

పోత‌న త‌ల‌పులో.....85

 పోత‌న త‌ల‌పులో.....85


విష్ణుమూర్తి త‌త్వం గురించి బ్ర‌హ్మ‌, నార‌దుడికి వివ‌రిస్తున్నాడు....

            ***

మండలములోన భాస్కరుఁ

డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర

హ్మాండములోపల నచ్యుతుఁ

డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్

               ***


తన మండలంలోనే తానుంటూ సూర్యుడు లోకాలకు కాంతి నిస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.

                 **

అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందుఁ నేఁ

బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్

నెట్టన కానరామికి వినిర్మల మైన తదీయ రూపమున్

గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్.

              ***

అటువంటి అనంతశక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని యజ్ఞాని కవసరమైన పదార్థా లేవీ నాకంటికి కనిపించలేదు. అపుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అపుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.


             ***

యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు

యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్

యజ్ఞపురుషుఁగా మానస

యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్.


         ***

యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానస యజ్ఞం చేశాను.

                  **

విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,

విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ

విశ్వములోఁ దా నుండును

విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.

                  **


  విశ్వమే తానైన వాడు; విశ్వమునకు ప్రభువు; విశ్వ మంతయు నిండి ఉండు వాడు; సర్వమును నడిపించు వాడు; విశ్వమున వ్యాపించి యుండువాడు; పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉంటాడు; జగత్తు సమస్తం ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉంటుంది......

అంటూ నార‌దుడికి విష్ణు త‌త్వాన్ని ప్ర‌బోధించాడు బ్ర‌హ్మ‌దేవుడు.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️విష్ణుమ‌యం🏵️

కామెంట్‌లు లేవు: