17, అక్టోబర్ 2020, శనివారం

సభా పర్వము -5

 సభా పర్వము -5

దుర్యోధనుని అసూయ


ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ , దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు దృపదుని సాగనంపారు. నకులుడు శల్యుని, సుబలుని సాగనంపాడు. సహదేవుడు ద్రోణ, కృప అశ్వత్థామ లను సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు.

మయసభా విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డారు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు.

హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి ” సుయోధనా నీకు ఏమైంది? ” అని అడిగాడు. దుర్యోధనుడు ” మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్ట వంతుడు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజు కు అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐశ్వైర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా ? ” అని దు॰ఖించాడు. శకుని ” సుయోధనా ! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను ” అన్నాడు.

దుర్యోధనుడు శకునినితో దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చింతించాడు. ” నాయనా సుయోధనా ! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు ? ” అని అడిగాడు. ” తండ్రీ ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోలచడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు. ధర్మరాజుకు సాత్యకి ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను ” అన్నాడు. శకుని దుర్యోధనునితో ” ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలుయని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో ధర్మరాజు ని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను ” అన్నాడు. సుయోధనుడు సంతోషించి ” తండ్రీ ! ఇందుకు మీరు అంగీకరించండి ” అన్నాడు.

ధృతరాష్ట్రుడు ” విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ” అని అన్నాడు. దుర్యోధనుడు ” తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను మీరు విదురుడు సంతోషంగా ఉండండి ” అన్నాడు. జూదం తగదని సంశయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు ” ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి ” అన్నాడు.

ధృతరాష్ట్రుడు ” విదురా ! నీవు అనవసరంగా అనుమాన పడవద్దు. మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా ” అన్నాడు. ధృతరాష్ట్రుడు ” దుర్యోధనా ! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి ” అన్నాడు. దుర్యోధనుడు ” మహారాజా ! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు ” అన్నాడు.

వెంటనే శకుని ” సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగా పాండవులను జయించడం ఎవరి తరం కాదు ” అన్నాడు. దృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. ” మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు.నేను అతని మాట మీరను జూదం వదిలి ఎప్పటిలా ఉండు ” అని దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు ” తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకుని తో జూదం ఆడ్టానికి అనుమతి ఇవ్వండి ” అన్నాడు.

కామెంట్‌లు లేవు: