17, అక్టోబర్ 2020, శనివారం

గురు చక్రం..

 ఒక సాధకుడు, నిరంతరం గురు మంత్రం , సాధన చేస్తూ ఉంటే...వాడి సూక్ష్మ శరీరంలోని గురు చక్రం...Activate...అయ్యి, ఆ గురు చక్రం నుండి వచ్చే స్పందనలు సాధకుడి ఫ్రీక్వెన్సీకి-గురువు ఫ్రీక్వెన్సీకి Connect చేస్తాయి. అలా జరగడం వలన, సాధకుడి స్థాయికి తగిన గురువు లభిస్తాడు.


   కొంత మందికి , పెద్దగా గురు మంత్ర సాధన లేకుండానే, గురు చక్రం activate అయ్యి ఉంటుంది. అయితే , వారు గత జన్మలోనే వారికి గురుచక్రం...యాక్టివేట్...అయి ఉంటుంది. వారుధన్యులు.


"గురు చక్రము" అనగా "త్రికుటి" లేదా "జ్ఞాన చక్రం. గురువు అంటే జ్ఞానం. "గు" అనగా చీకటి. "రు" అనగా వెలుగు.


||అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ||


గురువు అనేవాడు మనిషి అనే పరిమిత స్థాయిలో ఉండడు. గురువు అనేవాడు "ఒక మహా తత్వం." ఆ మహాతత్వం, మానవాళి శ్రేయస్సు కోసం మానవ శరీరంలో విరాజమానంగా ఉండవచ్చు. ఎవరి నుండైతే జ్ఞానం అఖండంగా, అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తుందో, వాడు గురువే. దక్షిణా మూర్తి స్వరూపమే. అగ్ని ఎలా బంగారాన్ని శుద్ధి చేస్తుందో, అచేతన మనస్సును (Un conscious Mind) పరిశుద్ధం గావిస్తుంది "గురు చక్రం". దానికోసం సాధకుడు "గురవే నమః" అనే మంత్ర జపం చేయాలి. తద్వారా కూడా గురు చక్రం చైతన్య వంతం అవుతుంది.


     ఈ గురు చక్రం "నిర్వాణ చక్రానికి" , సహస్రారానికి మధ్యలో ఉంటుంది. ఇలాంటి ఉప చక్రాలు, తల ఉపరి భాగంలో కొన్ని ఉన్నాయి. ఈ చక్రాలన్నీ జ్ఞాన కేంద్రాలు.


"అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః"


   ఈ గురు చక్రం కపాల నాడులలో ఉన్న చక్రం. దీని దళములు 12. ఈ చక్రము యొక్క దళాలు కుడి నుండి ఎడమ వైపుకు విస్తరించి ఉంటాయి. ఈ చక్రం రంగు "తెలుపు".


   ఈ చక్రం ఉండే స్థానానికి మనం వెళ్ళ గలిగితే, అక్కడ పూర్ణ చంద్రుడి దర్శనం అవుతుంది. (యత్ పిండే తత్ బ్రహ్మాండః).ఈ చంద్రుని మధ్యలో ఒక త్రిభుజం. శోభాయమానమైన మణి కాంతితో ప్రకాశిస్తున్న తెర ఈ చక్రాన్ని ఆవరించి ఉండడం , మనం సాధనలో గమనించ వచ్చు.


    మొత్తంగా మనం సాధనలో, ఈ చక్రాన్ని గమనిస్తే, స్వచ్ఛమైన స్పటిక కాంతితో, రెండు లేదా మూడు నేత్రాలతో, వర-అభయ ముద్రలతో, ధవళ వస్త్రాలంకృతితో, కమలం పై ఆశీనుడైన "గురువు" దృగ్గోచరం అవుతాడు.


   సాధనలో ఆజ్ఞా చక్రంపై ధారణ చేసేటపుడు, మన చైతన్యం ఒక జాజ్వల్యమైన కాంతి ద్వారా వెళ్తుంది. ఇలా ఒక సాధకుడి ప్రయాణం "సహస్రారం" దాకా వెళుతుంది.


     "గురు చక్రం" ఆధ్యాత్మిక రసవిద్యకు కేంద్రం. ఆజ్ఞా చక్రం నుండి సహస్రారానికి వెళ్ళే మార్గంలో, ఇది తప్పని సరిగా దాటాల్సిన వంతెన వంటిదని సత్యదర్శనం చేసిన మహనీయుల అవగాహన.


     ఆత్మకు అనేక సంస్కారాలు అంటడం వలన అది జీవాత్మ అనే పరిణామ క్రమంలోనికి వెళుతుంది. ఈ కర్మల యొక్క పరిణామ క్రమంలో ఈ చక్రాన్ని చైతన్య వంతం చేసుకోవడం ద్వారా, మనం ఉన్నత పరిణామానికి లోనవుతాము.


   ఏ సాధకుడైనా, సాధనలో తన ధారణను "గురు చక్రంపై" ఉంచినట్లయితే, ఈ గురు చక్రం నుండే గురువు స్పందించి, సాధకునకు జ్ఞానాన్ని ఇస్తాడు.

కామెంట్‌లు లేవు: