**దశిక రాము**
శ్రీమద్భాగవతము
****
తృతీయ స్కంధం -37
ప్రకృతి పురుష వివేకంబు
జనులచే స్తుతింపబడేదానా! సత్త్వరజస్తమో గుణాలతో నిండి, ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడ పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖ మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతుడై, తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్త్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది....సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి...చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.అందుచేత మోక్షంపై ఆసక్తి కలవాడు అఖండమైన భక్తియోగాన్ని అవలంబించాలి. విషయసుఖాలమీద విరక్తుడు కావాలి. యమం నియమం మొదలైన యోగమార్గాలను అభ్యసించి మనస్సును వశపరచుకొని...చలించని శ్రద్ధాశక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా...జీవేశ్వరుల యథార్థస్వరూపం (త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడనీ, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడనీ) తెలుసుకొనడంవల్ల బుద్ధి అంతర్ముఖ మౌతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కన్పించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమాన మవుతుంది. అందువల్ల ప్రధానకారణమైన మూలప్రకృతికి ఆధారమూ, సమస్త సృష్టినీ దృష్టివలె ప్రకాశింప చేసేదీ, విశ్వంలోని సమస్త కార్యకారణాలకూ మూలభూతమూ, పరిపూర్ణమూ, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. అమ్మా! విను. ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా..జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా
అన్నది.పుణ్యాత్మా! పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడు పరస్పర సంబంధం ఉంది కదా! అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచి పెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్త్వజ్ఞానంవల్ల సంసారభయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా! భక్తజన శరణ్యా! పరమపురుషా! దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు. నన్ను రక్షించు.”
దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. “సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు” అని చెప్పి (ఇంకా ఇలా అన్నాడు). అమ్మా! విను. ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్నీ, అనర్థాన్నీ ఆచరించలేదు. ఓ ఉత్తమనారీ! మానవుడు నిద్రపోతున్నపుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు. అదే విధంగా ఆత్మనాథుడూ, కర్మసాక్షీ అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు”అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు..పుణ్యాత్మురాలా! ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదవల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహా లన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియై చేరుకొంటాడు.ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు” అని చెప్పి “ఇక యోగలక్షణాల విధానాలను వివరిస్తాను. విను’” అని భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు. బుద్ధిమంతులై ఏ యోగమార్గంవల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసికొని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటారో ఆ యోగధర్మాలను చెప్తాను విను. అది ఎలాగంటే తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంతప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పక పోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంధాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువకాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసనవిజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాలనుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. ఇవే కాకుండా ఇతర వ్రతాలను, దానాలను ఆచరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడుమార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింకచర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకొని, తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకొన్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపీత్తశ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానంవల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి