: దేవీనవరాత్రులు - బ్రాహ్మీ
అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో ఒకలా మరి కొన్ని దేవాలయాలలో మరొకలా వారివారి ఆగమం ప్రకారం ఈ శరన్నవరాత్రులలో ఆరాధన చేస్తాము. ఏ రూపంలో ఆ తల్లిని కొలిచినప్పటికీ మనందరం కొలిచేది ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆ తల్లినే కదా! ఎవరం ఏ పేరుతో పిలిచినా, కొలిచినా ఆ తల్లినే.
మన శృంగేరి సంస్థానమునకు చెందిన దేవాలయాలలో ఈ రోజు అమ్మవారిని బ్రాహ్మీ రూపంలో కొలుస్తారు. ఆ తల్లి చక్కటి తెల్లని వస్త్రాలు కానీ లేత రంగులో ఉండే వస్త్రాలను ధరించి హంసవాహనంపైన మనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది.
బ్రాహ్మీ అంటేనే మనకు అర్ధం అవుతోంది కదా! ఈ తల్లి కూడా సృష్టికర్త. జీవిని సృష్టించాలన్నా ఈ సంసారం అనే బంధనాలునుండి బయటపడాలన్నా ఈ తల్లియొక్క కృప ఉండాల్సిందే. అసలు భగవంతునివైపు మన మనసు మళ్ళి ఆ తల్లి గురించిగాని ఆ తండ్రి గురించిగాని చింతించాలి అంటే ఆ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. అందుకనే ఆ తల్లి లేత వస్త్రాలు ధరించి నిష్కల్మషమైన తల్లి ప్రేమకు చిహ్నంగా మనము కోరుకున్న ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. మనం ఆ తల్లి గురించి చింత చెయ్యడమే తరువాయి.
ఈవిడ హంసవాహనంపైన కూర్చుని ఉంటుంది. హంస అంటే ఊపిరులకు చిహ్నం. మన ఉచ్చ్వాస నిశ్వాసలను నియంత్రణలో ఉంచుతోంది. పైగా హంస అనగానే పాలను నీళ్లను వేరు చేస్తుంది. అంటే మంచిని చెడును వేరు చేస్తుంది. అలాగే ఈ తల్లి ఆరాధనవల్ల మనకు మంచిచెడుల వ్యత్యాసం తెలిసి ఏది సరిఅయిన మార్గమో నిర్ణయించుకోగలుగుతాము. తల్లీ! నేను నీవాడను అన్న మరుక్షణం మన రక్షణభారం ఆ తల్లి తీసుకుంటుంది.
" జయ జయ శంకర హర హర శంకర"
'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
WhatsApp Number:
8886240088
:
శైలపుత్రీ
ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!
పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!
సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!
నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః
అని తొమ్మిది నవదుర్గ స్వరూపాలు. ఒక్క దుర్గ నవదుర్గలుగా భాసించి తొమ్మిది రూపాలను ధరించింది. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది. అంటే దాని వెనుక ఒక తాత్పర్యం ఉంది. లోకానికి ఆవిడ ఎన్నో విషయాలను ప్రబోధం చేసి ఆవిడ అనుగ్రహాన్ని మన మీద ప్రసరిస్తుంది. అమ్మవారు తీసుకున్న నవదుర్గ స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రీ. శైలపుత్రీ అనగా పర్వతరాజు యొక్క కూతురు. అమ్మవారు వారి ఉపాసనా బలాన్ని బట్టి, వారిలో ఉన్న ఆర్తిని బట్టి ఎంతోమందికి కూతురుగా వచ్చింది. పర్వతరాజు పుత్రిక శైలపుత్రికగా, కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయినిగా, భ్రుగుమహర్షి పుత్రిక భార్గవిగా, జనకమహారాజుగారి పుత్రిక జానకిగా ఇలా ఎంతో మందిని ఆ తల్లి అనుగ్రహించింది. నిజానికి ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఆ తల్లి స్వరూపమే. ముందుగా మనము అసలు ఆ తల్లి శైలపుత్రిగా రావడానికి కారణం తెలుసుకుంటే ఆ శైలపుత్రీ తత్వం, అసలు ఆ అవతారం స్వీకరించడానికి గల కారణం, ఆ అవతారం యొక్క ప్రాముఖ్యత మనకి అవగతం అవుతుంది.
ఆ తల్లి కోరుకున్న మాత్రంచేత ఎందరినో అనుగ్రహించి కూతురుగా వచ్చినా ఆ తల్లి మహా పతివ్రత కాబట్టి భర్తగా ఆ పరమశివుడినే పొందుతుంది. ఈ శైలపుత్రిగా అవతార స్వీకరణ తీసుకోవడానికి ముందు ఆవిడ దక్షుడి కూతురుగా దాక్షాయిణిగా ఉంది. ఆవిడ అనుగ్రహించి కూతురు అయింది. కాబట్టి ఆవిడ దాక్షాయిణిగా ఆ దక్షుడికి కీర్తి ప్రతిష్ఠలను అందించింది. కాని, అది గమనించనటువంటి దక్షుడు అహంకారంతో ఒకానొక బ్రహ్మ సభలో, దక్షుడు ఆ సభలోనికి ప్రవేశించినప్పుడు తనని మామగారిగా గౌరవించి లేచి నిలబడలేదన్న భేషజంతో అల్లుడిమీద కోపంతో నిరీశ్వరయాగాన్ని చేయసంకల్పించాడు. అలా అందరూ తన తండ్రి చేస్తున్న నిరీశ్వర యాగానికి బయలుదేరి వెళుతుంటే ఆ తల్లికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి మహా పతివ్రత. ఆ తల్లి దేన్నైనా భరిస్తుంది కాని, భర్తని అవమానిస్తే సహించలేదు. కాబట్టి తండ్రికి బుద్ధి చెబుతానని పరమశివుని అనుజ్ఞ తీసుకొని దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ ఆ తల్లిని ఆదరించకపోయేసరికి కోపంతో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటూ మిగిలిన వారికందరికీ తన పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ లోకానికంతటికీ తీర్పు చెప్పింది. దాంతోపాటు సందేశాన్ని ఇచ్చింది. 'భవో సహోద్వేషి శివం శివేతరః' శివుడిని నిందించినా, దూషించినా లోకానికి మంగళములు, కళ్యాణాలు కావు. శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పి ఆమె యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది. 'శివా రుద్రస్య భేషజీ". ప్రశాంతంగా ఉన్న పరమశివుని రుద్రుణ్ణి చేస్తుంది. ఈ విషయాన్ని ప్రమధగణాలు పరమశివునికి చెప్పేసరికి ఆయన రుద్రుడై తన జటాజూటంలో ఉన్న ఒక జటను పెరికి నేలమీద కొట్టగానే ఉగ్రరూపంలో ఉన్న వీరభద్రుడు ఉద్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, యాగం మధ్యలో ఆగకూడదు కాబట్టి దక్షునికి మేక తలకాయ పెట్టి యాగాన్ని పూర్తిచేశాడు. మరి ఆ తల్లి సతిగా తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరమశివుడు తనలో తాను రమిస్తూ తపస్సుమధ్యలో ఉన్నాడు. శివపార్వతులకు పుట్టిన బిడ్డడివల్ల కదా తారకాసురవధ జరగాలి. ఇంత జరిగిన తరువాత మళ్ళీ ఆ తల్లి జన్మ ఎత్తడానికి ఒప్పుకుంటుందా? అని దేవతలందరూ బ్రహ్మగారి దగ్గిరకు వెళ్లి వారి బాధను చెప్పుకున్నారు. అప్పుడు ఆయన ఆ తల్లి జన్మించడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆ తల్లే మేనకా హిమవంతులకు వరం ఇచ్చింది, తానే వారి కూతురిగా వస్తానని. ఒకానొక సమయాన ఆవిడ దాక్షాయిణిగా ఉన్నప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో శివునితో కలిసి తిరుగుతూ ఉండగా, ఈ తల్లిని చూసి మేనక అనుకొన్నది, నాకు ఈవిడ కూతురైతే ఎంత బావుండును అని. ఆ తల్లి అప్పుడు మేనకను అనుగ్రహించింది, నేనే మీకు కూతురుగా పుడతాను అని. మరి వాళ్లకి కూతురిగా పుట్టాలంటే మరి మేనకా హిమవంతులు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉండాలి కదా! మేనకాదేవి అష్టమి రోజు పూర్తిగా ఉపవాసము చేసి, నవమిరోజు చాలా నిష్ఠగా సువాసిని పూజ చేసింది. అందుకని మేనకా హిమవంతులకు కూతురిగా రావడానికి అంగీకరించింది. వారి ఇంట ఆడపిల్లగా పుట్టింది. తాను పుట్టడమే కాదు, వారికి ఒక అబ్బాయి మైనాకుడిని కూడా అనుగ్రహించింది.
ఆ తల్లి అనుగ్రహానికి ఎల్లలు లేవు. తమ ఇంట తిరుగుతున్న ఆ ఆడపిల్లని చూచుకొని మేనకా హిమవంతులు ఎంతో మురిసిపోయారు. మరి ఆ తల్లి వివాహం చేసుకోవాలి అంటే ఆ పరమశివుడినే వరిస్తుంది. సతీ వియోగంతో ఉన్న పరమశివుడు హిమవత్పర్వతాలపై తపస్సు చేసుకుంటూ ఉంటే దేవతలందరూ పార్వతీపరమేశ్వరుల వివాహం త్వరగా కావాలి, ఆ తారకాసురుడి బాధ మనకి వదలాలి అని దేవేంద్రుడు, మన్మధుని మన్మధబాణాలు వేయడానికి పరమశివునిపై పంపించాడు. పాపం ఆయన భయపడుతూనే వెళ్ళాడు. ఎప్పుడైతే మన్మధుడు మన్మధబాణం విడిచిపెట్టాడో, వెంటనే పరమశివుడు తన యొక్క మూడవ నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు. కాలి, బూడిద అయిపోయిన మన్మధుని చూసి, భార్య రతీదేవి ఎంతగానో విలపించింది. మన్మధుడు లేకపోయేసరికి సృష్టి లేదు. జగత్తులో ఎక్కడా ఉత్సాహం గాని, సంతోషంగాని లేవు. అప్పుడు ఆ తల్లి మన్మధుని అనంగుడిగా ఉండమని, ఆయన చేతిలో ఉన్న బాణాలను ఆ తల్లి పుచ్చుకుని కాముడ్ని కాల్చిన పరమశివుని ప్రక్కకు శివకామసుందరిగా చేరింది. ఆ తల్లి ఆ పరమశివుణ్ణి గెలుచుకుంది. తన అందచందాలు, రూపలావణ్యాలతో కాదు. అపర్ణ అయి తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తుండగా పరమశివుడే బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేస్తే సహించలేక గెంటించబోతే, అప్పుడు ఆ సుందరస్వరూపుని (పరమశివుని) గాంచింది. ఆ తల్లి ఒక రకంగా ఈ శైలపుత్రీ బాలా స్వరూపంగా ఉన్న కుమారిగా ఉన్న ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. ఆమె ఎప్పుడు ఆయనకు ఇల్లాలు. 'మహామాయా విశ్వమ భ్రమయసి పరబ్రహ్మ మహిషి'.
ఈ రోజు మహా పతివ్రత అయిన శైలపుత్రీ అవతారంతో ఆ తల్లిని అర్చన చేసి మనందరం కూడా ఆ తల్లి యొక్క కృపా కటాక్షవీక్షములకు పాత్రులం అయ్యెదము గాక.
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
8886240088
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి