🌺 *ఓం నమో నారాయణాయ* 🌺
*37. ఇను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత మగు హృషీకేశు సన్నిధి నావిధమునఁ గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.*
*భావము:-* ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! చండామార్కుల వారూ! అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడు విధంగా, దైవ నిర్ణయానుసారం, నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతోంది, ఇంకే విషయంలోనూ నా మనసు నిలవటం లేదు.
*38. మందార మకరంద మాధుర్యమునఁ దేలు; మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ సనునె తరంగిణులకు లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక; మరుగునే సాంద్ర నీహారములకు నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపానవి మత్త చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు? వినుతగుణశీల! మాటలు వేయు నేల?"*
భావము:- సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచుతెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”
(ఈ పద్య రత్నం అమూలకం; సహజ కవి స్వకీయం; అంటే మూల వ్యాస భాగవతంలో లేనిది; పోతన స్వంత కృతి మరియు పరమ భాగవతులు ప్రహ్లాదుని, పోతన కవీంద్రుని మనోభావాల్ని, నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో, బమ్మెర వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగులకు అందించారు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి