గోదావరి -- 2
✍️ గోపాలుని మధుసూదన రావు
యతులందఱు యా విధమున
నతి కోపము బూని మునిని నటు వెలివేయన్
మతియందున నతి కుందియు
గతి యేమని తనకటంచు గౌతము డడిగెన్
“పరమేశుని ప్రార్ధించియు
వర మడిగియు గంగ నిటకు వసుధకు జేర్చన్
సురనది గవిపై పారగ
నరయగ యాయావుబ్రతుకు" యని మునులనినన్
యతి గౌతము డటుపిమ్మట
యతులితమగు భక్తితోడ నభవుని గొలువన్
గతియించె పెద్ద కాలము
ప్రతిభతొ పరమేశ్వరుండు ప్రత్యక్ష మయన్
మృడు గాంచిన గౌతమ ఋషి
కడుభక్తితొ ప్రస్తుతించి ఘన నమకమునన్
పుడమిని గవి బ్రతికించగ
నడిగెను గంగమ్మ నొదల నతివినయమునన్
సత్యమెఱిగియు యభవుడు సంతసమున
వదలె నొకపాయ శిర గంగ వసుధ పైకి
అయ్య దానందముగ సాగి యవని జేరి
పారుచును తాక నప్పుడు బ్రతికె గోవు
పావనుండైన గౌతము ప్రార్థనమున
హరు జటాజూటము నుండి యవతరించి
వసుధ గోవుపై పారి గోవారి యయ్యె
ధరణి మనుజుల నోట గోదావరయ్యె
శ్రీ త్రయంబక దివ్య క్షేత్రంబు నందున
బ్రహ్మగిరుల మీద ప్రభవమొంది
పరమ పావనమైన బాసర క్షేత్రాన
శారదా దేవిని సన్నుతించి
భద్రాద్రి ప్రక్కన పరవళ్లు సాగించి
కాకుత్స తిలకుని కాళ్ళుకడిగి
పాపికొండల మధ్య పరుగులు దీసియు
తల్లి పేరంటాళ్ళ తటినితాకి
రాజరాజ నరేంద్రుని రాగములతొ
వేంగిరాజ్యపు ఔన్నత్యవిభవములతొ
సకల సాహిత్య సౌరభ సంపదలతొ
వెలిగె గోదావరీమాత వెలసి భువిని
బ్రహ్మగిరులమీద ప్రభవంబు నొందియు
గలగలా గోదారి కదలి సాగె
శ్రీ త్రయంబకమందు చేరియు నటుమీద
గలగలా గోదారి కదలి సాగె
కందకుర్త రయంగ సంగమ స్థానాన
గలగలా గోదారి కదలి సాగె
వ్యాస సరస్వతి బాసర క్షేత్రాన
గలగలా గోదారి కదలి సాగె
దనుజారి నరసింహు ధర్మపురి కడను
గలగలా గోదారి కదలి సాగె
కాళేశ్వరంబున కలియగ నుపనదుల్
గలగలా గోదారి కదలి సాగె
భద్రాద్రిరఘురాము పాదముల్కడిగియు
గలగలా గోదారి కదలి సాగె
వేంగిరాజ్యంబులో విష్ణువర్ధను చెంత
గలగలా గోదారి కదలి సాగె
కోటికల్మషహారి కోటిఫలి తటిన
గలగలా గోదారి కదలి సాగె
అట్లు గోదారి సాగియు యవనిపైన
సస్యముల పెంచిపండించి సాకిజనుల
విభవ మైనట్టి శ్రీ యంతర్వేది యందు
కడలియందున కలిసెను ఘనముగాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి