Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 30 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా’
అమ్మవారిని కేశాది పర్యంతము వర్ణన చేస్తున్నారు. ఆ క్రమములో ఇప్పుడు గడ్డం దగ్గరకు వచ్చిన వశిన్యాది దేవతలు ఒక చిత్రమైన ప్రస్తావన చేసారు. కపోలముల గురించి, కిరీటము గురించి, ఫాలభాగము గురించి మాట్లాడవలసి వస్తే ఒక ఉపమానమును వెయ్యాలన్న ప్రయత్నము చేసి ఏదో ప్రయత్నము చేసాము కానీ అవి నీ కాంతి చేత, ద్యుతి చేత తిరస్కరించబడ్డాయి అన్నారు. గడ్డం దగ్గరకు వచ్చేసరికి వెయ్యలేదు. ‘అనాకలితసాదృశ్య’ అంటూ ఉపమానము వెయ్యడానికి వీలుకాని రీతిలోప్రకాశించే చక్కనైన చుబుకసౌందర్యము ఉన్న తల్లీ నీకు నమస్కారము అన్నారు.
పార్వతీదేవి సతీదేవిగా ఉన్నది. పరమశివుడు ఎప్పుడూ పరమశివుడుగానే ఉన్నాడు. ఆయన తెలుపు ఆవిడ ఎరుపు. ఆయన విభూతి ఆవిడ కుంకుమ. లోకమంతా పార్వతీ పరమేశ్వర స్వరూపమే అయి ఉంటుంది. సుఖము దుఃఖము క్రీనీడలు కానీ భగవంతుని మీద పెట్టిన మనసుకి హాయిగా ఇంక జన్మ ఎత్తవలసిన అవసరము లేని స్థితిని మేనకా హిమవంతులు పొందారు. మనసుని ఇటు పెట్టుకుంటే కొన్ని కోట్ల జన్మలు. అటు పెట్టుకుంటే అంతటి వైభవము. ఈ వైభవానికి గుర్తు మరల మరల పట్టుకునే గడ్డమే. అందరు అమ్మవారిని గెడ్డము పట్టుకుని బ్రతిమిలాడ లేరు. దక్షుడు కూతురిని కన్నాడు కానీ నిలపెట్టుకోలేక పోయాడు. మనసు అహంకారమునందు పెట్టాడు తల పోగొట్టుకుని గొర్రె తల పెట్టుకున్నాడు.
మేనకాదేవి తన మనసును అమ్మవారియందు పెట్టి ఉంచుకున్నది. శివపురాణములో మేనకా హిమవంతులకు మోక్షము ఇవ్వలేదు. అలా ఇస్తే తపస్సు చేసుకునేందుకు అక్కడ పర్వతము ఉండదు. అందుకని యుగాంతము వరకు వారు పార్వతీదేవి వద్దకు వెళ్ళి వస్తు ఉంటారు. వెళ్ళినప్పుడు చుబుకము పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటారు. మిగిలిన వాళ్లకు తల్లి అయినా మేనక దగ్గర ఆవిడ పిల్లయే. మేనక జగన్మాతకి మాత అయింది. ఎప్పుడైనా ఆ చనువు చూపిస్తే అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నదని చెప్పారు. అమ్మవారి అనుగ్రహము ఉన్నవారు ఎక్కడ ఉన్నా ఈ నామము గురించి తెలుసుకుని వినడము జరుగుతుంది. వారికి అమ్మవారి అనుగ్రహము ఉన్నదని అర్థము చేసుకోవాలి. అమ్మవారి గడ్డమునకు వాక్కులతో పోలిక చెప్పడము కుదరదు. అది ఈశ్వరానుగ్రహమునకు నిర్ణయము కాబట్టి ‘అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా’
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి