17, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్.149

 రామాయణమ్.149

.........

లక్ష్మణుడిమాటలకుఅడ్డుతగులుతూ ,రామునితో ...

.

ఆర్యపుత్రా ఎంత చూడ చక్కగా ఉన్నదో చూడు!

 ఈ మృగము బాల సూర్య సమ ప్రభలతో మెరిసిపోతున్నది ,

దానిని చూడగానే నా హృదయము మురిసి పోతున్నది , అయోధ్యలో మన అంతః పురములో ఇది ఉంటె ఎంత బాగుండును అని అనిపిస్తున్నది ,

అత్తగార్లకు ,భరతుడికి ఇది గొప్ప కను విందు కాగలదు .

.

ఒక వేళ సజీవముగా మనము దీనిని పట్టుకోలేక పోతే దీని చర్మమైనా మనకు మిగులుతుంది .

అప్పుడు మెత్తని లేతగడ్డి పరుచుకొని దీని మీద కూర్చుంటే అబ్బ ! ఎంత సుఖముగా ఉంటుందో కదా ! .

ఆర్యపుత్రా దీనిని పట్టి తెమ్ము . 

అని సీత పలుకుతుంటే రాముడు కూడా దాని మీదనుండి దృష్టి మరల్చుకోలేక పోయాడు. 

మణిమయ కాంతులు వెదజల్లే దానికొమ్ములు ,బంగారు వన్నెలతో మెరిసిపోతున్న శరీరము, ఆయన మనస్సును కూడా ఆకర్షించింది .

.

సీత ఇంతగా ప్రేరేపిస్తుంటే లక్ష్మణునితో అంటున్నాడు రాముడు .

.

లక్ష్మణా ,అదుగో చూడు మీ వదిన ఎంతగా ముచ్చట పడుతున్నదో అసలిలాంటి మృగము నందనవనము లోగానీ ,మరి ఏ ఇతర దేవతల ఉద్యాన వనాలలో గానీ ఉండదు, మరి భూలోకములో ఎట్లా ఉంటుంది .

.

అదుగో చూశావా ! అది ఆవులించి నప్పుడు దాని నోటినుండి అగ్నిజ్వాల వలే ప్రకాశిస్తూ నాలుక బయటకు వస్తున్నది .దాని వంటి మీద వెంట్రుకలు చూడు బంగారుచుక్కలచేత రమ్యముగా ఉన్నవి .

.

దాని పొట్ట శంఖము లా ఉన్నది చూడు ,ముట్టే ఇంద్రనీలాలు పొదగబడిన పాత్రలా ఉన్నది ,ఓహ్ దీని సౌందర్యము మనస్సును విపరీతముగా ఆకర్షిస్తున్నది .

.

లక్ష్మణా ఇంత అందమైన మృగము మనకు గొప్ప సంపద కాగలదు ,

.

ఎవడు ముందు వెనుకలు ఆలోచించకుండా ముందుకుపోయి ధన సంపాదన చేయునో ఆ సంపాదనే సంపాదన అదియే ధనమని అర్ధశాస్త్ర నిపుణులు చెపుతారు.

.

ఈ జింక చర్మము మీద నేను, సీత కూర్చోవాలని నా మనస్సు తహతహ లాడుతున్నది .

.

ఒక వేళ నీవు చెప్పినట్లు ఇది మారీచుడే అయిన కానిమ్ము, ఈ రోజుతో వాడిఆయువుమూడినట్లేఅనుకొమ్ము.

అగస్త్యుడి చేతిలో వాతాపి మరణించి నట్లు నాచేతిలో మరణించగలడు.

.

లక్ష్మణా నీవు సావధాన చిత్తుడవై ధనుర్బాణములు ధరించి సీతను కాపాడుతూ ఉండు ,నేను దీనిని వేటాడతాను.

అని పలికి బంగారు ఖడ్గాన్ని నడుముకు కట్టుకొని మూడు వంపులున్న ఒక ధనుస్సు చేతబూని రెండు అమ్ములపొదులు ధరించి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.


రామాయణమ్ 150

..............

కోదండ పాణి బయలుదేరాడు, 

బంగారుపిడిగల ఖడ్గము,ధనుస్సు ధరించి మృగమును చూస్తూ దానిని పట్టుకోవాలని తలపోస్తూ దాని వెంట నడిచాడు .

.

అది తప్పించుకొని చెంగుచెంగున గెంతుతూ దూరముగా కనపడకుండా వెళ్ళిపోయింది ,అరే కనపడలేదే! అని రాముడు అనుకునే లోపు మరలా దగ్గరగా ప్రత్యక్ష మయ్యేది ,దానిని పట్టుకుందామని చూస్తే దొరకకుండా దూరము వెళ్ళేది ,అది ఆ విధముగా రాముడిని ఆశ్రమము నుండి చాలా దూరము తీసుకు వెళ్ళింది .

.

మబ్బులలో దాగుకున్న చంద్రుడు కాసేపు మబ్బులలో ఉండి ,కాసేపు బయటకు వచ్చి ఏ విధముగా దోబూచులాడుతుంటాడో ఆ విధముగా కనపడీకనపడకుండా ,దగ్గరగా కాసేపు దూరముగా కాసేపు ఆటలాడుకుంటూ తీసుకెళ్ళింది.

.

అప్పటికే చాలా దూరము దానివెంట పరుగెత్తిన రాముడు అలసటతో ఒక పచ్చిక బయలుమీదకూర్చున్నాడు .

.

మరల ఆ మృగము అల్లంత దూరములో కొన్ని ఇతర మృగాలలో కలిసి తిరుగుతున్నట్లుగా కనపడింది .

.

అది తన చేతికి అందదు అనే విషయము అప్పటికే ఆయనకు అర్ధమయ్యింది ,ఇక దానిని చంపేయాలని నిశ్చయించుకున్నాడు .

.

బాణాన్ని అమ్ములపోదినుండి బయటకు తీసాడు ,దృఢమైన ధనుస్సుపై ఎక్కుపెట్టాడు ,ఆకర్ణాంతం లాగి వదిలాడు .అది బుసలు కొడుతున్న త్రాచుపాములా రయ్యిన గాలిని చీల్చుకుంటూ వెళ్లి ఆ మృగము శరీరాన్ని భేదించి దాని హృదయాన్ని బద్దలు కొట్టింది .

.

రామబాణము ఎప్పుడైతే దాని శరీరాన్ని తాకిందో అప్పుడే రాక్షస మాయకూడా తొలగిపోయి భయంకరరూపముతో కొండలాగా ఉన్న మారీచుడు బహిర్గతమైనాడు.

.

ఆ బాణపు దెబ్బకు విలవిలలాడుతూ తనకు చివరి క్షణములు దగ్గర పడ్డాయని గ్రహించాడు మారీచుడు

,ఆ సమయములో కూడా వాడు స్వామి భక్తి ప్రదర్శించాడు ,రావణుడి కార్యము నెరవేరాలంటే ఏమి చెయ్యాలో ఆలోచించాడు .ఏమి చేస్తే సీత లక్ష్మణుని ఇక్కడికి పంపుతుంది ?అని బుర్రకు పదును పెట్టాడు .

.

రాముడు ఆపదలో ఉన్నాడన్న భావము ఆవిడ మదిలో కలుగ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే స్వరము మార్చి రాముని గొంతును అనుకరించాడు .

.

అయ్యో సీతా ,అయ్యో లక్ష్మణా ..

.

అని ఆ వనమంతా ప్రతిధ్వనించేటట్లు,గావుకేకలు పెట్టి ప్రాణము వదిలాడు .

.

చూడటానికే భయంకరముగా ఉన్న ఆ కళేబరాన్ని చూసి వాడు మారీచుడు అని గుర్తు పట్టాడు రాముడు .తమ్ముడు చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది ,వాడు అరచిన అరపులు ఎక్కడికి దారితీస్తాయో అని ఒక ఊహ ఆయన మదిలో మెదిలింది .

.

ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచింది .

.

ఎందుకో మరి ! కొన్ని ఆలోచనలు ఆయనలో ఒక దుఃఖాన్నీ ,భయాన్నీ కలుగ చేసాయి.

.

వెంటనే వడిగా, వడివడిగా ఆశ్రమము వైపు పరుగు తీశాడు రాముడు.

కామెంట్‌లు లేవు: