12, అక్టోబర్ 2020, సోమవారం

*అద్వైత వేదాంత పరిచయం

 **అద్వైత వేదాంత పరిచయం**


3.1.3 కర్మవ్యవస్థ : మనకి వర్ణవిబేధాలు కర్మని బట్టి కూడా ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి పుట్టుకతో గాని, అతని గుణంతో కాని మనకి సంబంధం లేదు. అతను చేసే కర్మని బట్టి సమాజాన్ని నాలుగు తెగలుగా విభజించారు. మొదటి రకం కర్మ మత: సంబంధమైన కర్మ. అంటే శాస్త్రపఠనం, శాస్త్రబోధ. సమాజాన్ని మత:పరంగా నడిపించటం. ఇది పురోహిత వృత్తి అనవచ్చు. ఈ వృత్తిని బ్రాహ్మణ కర్మ అనీ, ఈ వృత్తిని పాటించేవానిని కర్మ బ్రాహ్మణుడు అనీ అంటారు.

 రెండో వృత్తి రాజకీయం. ఈ వృత్తిలో సంఘసేవకి లేదా దేశసేవకీ అంకితమవుతారు. ఈ సేవకి రాజకీయంలోనో, ప్రభుత్వంలోనో, యంత్రాంగంలోనో, సైనికదళంలోనో ఉంటారు. దేశరక్షణకి సంబంధించిన ఏ వృత్తినన్నా తీసుకోవచ్చు నిజానికి. ఈ వృత్తిని క్షత్రియకర్మ అనీ, అది చేసే వ్యక్తిని కర్మ క్షత్రియుడు అనీ అంటారు.

 మూడో వృత్తి వ్యాపారం. ఇందులోకి వ్యవసాయం, ఉత్పత్తి, అనేక వస్తువుల పంపిణీ కూడా వస్తుంది.ఈ వృత్తిని వైశ్యకర్మ అనీ అది చేసే వ్యక్తిని కర్మ వైశ్యుడు అనీ అంటారు. నాలుగో వృత్తి సేవ చేయటం. ఏదో ఒక ప్రత్యేక వృత్తి అంటూ ఉండదు. కాని అతను కర్మబ్రాహ్మణ, కర్మక్షత్రియ, కర్మవైశ్యులకు సేవ చేస్తాడు. ఇతను నాయకుడు కాదు. తక్కిన ముగ్గురు నాయకులకు ఉద్యోగి. సేవ చేస్తాడు. ఈ వృత్తిని శూద్రకర్మ అనీ, అది చేసే వ్యక్తిని కర్మశూద్రుడు అనీ అంటారు.

 ఇప్పుడు ఒక వ్యక్తి జాతి, గుణ, కర్మలని తీసుకుంటే మూడూ ఒకటే ఉండాలని లేదు. ఒకటే వ్యక్తి, మూడు కోణాల్లో, మూడు విభిన్న తెగలకి చెందినవాడై ఉండవచ్చు. జాతి బ్రాహ్మణుడు అయిన వ్యక్తి గుణ బ్రాహ్మణుడు లేదా కర్మ బ్రాహ్మణుడు అయి ఉండాలన్న నియమం లేదు. అతను బ్రాహ్మణ పుట్టుక పుడితే జాతి బ్రాహ్మణుడు అవుతాడు. ఏ మంత్రి పదవో చేబడితేకర్మక్షత్రియుడవుతాడు. స్వార్థపరుడైతే గుణవైశ్యుడవుతాడు. అలా రకరకాలుగా చూడవచ్చు. జాతిబ్రాహ్మణుడు, గుణబ్రాహ్మణుడు, కర్మబ్రాహ్మణుడు మూడు కలిసిన వాడు చాలా అరుదుగా ఉంటాడు. మూడూ విడిగా ఉండాలన్న నియమం లేదు కాని అలా విడిగా ఉంటాయి.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: