12, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము

 శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము


✍️ గోపాలుని మధుసూదన రావు 


తనయుడు పలికిన పలుకులు 

విని మనమున వకుళమాత విస్మయమందెన్ 

జనపతి తోడను వియ్యము 

మనకేవిధి గల్గునంచు మానిని దలచెన్. 138 


“నిరుపేద లైన మనమిటు 

తరతమ బేధంబు మఱచి తర్కము లేకన్ 

నరపతుల పొత్తు గోరుట 

నరయంగా నెంచిచూడ నవివేకమగున్ 139 



సిరిగల ప్రభువులు వారలు 

యరయంగా మనముజూడ నతిపేదలమూ 

ఇరువురు కేవిధి జగమున 

జరుగును వియ్యంబు యింక చాలును “ ననియెన్. 140 



తనయుని పరిణయ విషయము 

మనమున నిరతంబు దలచు మగువను వకుళన్ 

కనియును యాశ్రమమందున 

ననియెను శ్రీనారదుండు నామె గతంబున్ 141 


“ద్వాపరయుగమున నీవే 

గోపాలుడు నందుపత్ని కూరిమెశోదౌ 

పాపం బాజన్మంబున 

గోపాలుని పెళ్లి గాంచు కోరిక మిగిలెన్ 142 



కోడలు రాకనె దేహము 

వీడితివానాడు మిగుల విధివశముగనూ 

నేడా కోరిక దీరగ 

చేడియ ! జన్మించితీవు చిద్భాగ్యమునన్. 143 



అత్తరి కర్మ వశంబున 

నత్తవు గాలేకపోయి యడుగగ వరమున్ 

నిత్తరి యీ జన్మంబున 

యత్తవు యయ్యేవు నీవు యని వరమిచ్చెన్ 144 


వకుళా ! నీ భాగ్యంబున 

నకళంకుడు విష్ణుమూర్తి యయ్యెను సుతుగా 

యిక యీ పద్మావతియే 

యకళింకిత కోడలగును యా వరఫలమున్ 145 


ఆ నాటి నీదు కోరిక 

యీనాడీడేరుచుండె యీ విధముగనూ 

యీ నీ పుత్రుడు దెచ్చును 

మీనాక్షిని కోడలిగను మేలన నీవున్ 146 


వెఱవక నేగుము కావున 

నరపతి నీకోర్కె దీర్చు నందన నిచ్చున్ 

జరుగును పెండిలి తప్పక 

సిరిపతి చేకూర్చు సుఖము చింతించకుమీ.” 147 


సదమల హృదయుడు సురముని 

ముదమున నీరీతి బలుక ముదితాంతరయై 

సుదతా వకుళా దేవీ 

కదలగ ధరణీశు కడకు కాంక్షించె మదిన్. 148

కామెంట్‌లు లేవు: