12, అక్టోబర్ 2020, సోమవారం

రామాయణమ్.90

 రామాయణమ్.90

...

భరతుని దగ్గరకు తీసుకొని నాయనా ప్రయాణమై ఎన్ని రోజులైనది ? అలసట ఏమీ కలుగలేదుకదా? అక్కడ అందరూ కుశలమేకదా ? అని ప్రశ్నల వర్షం కురిపించింది కైక.అన్నింటికీ వినయముగా సమాధానము చెప్పి ,అమ్మా ! నా తండ్రిగారు ఎక్కడ? ముందు ఆయనను చూడాలి ,ఆయనకు పాదాభివందనము చేయాలి ! ఎక్కువగా ఆయన నీ గృహములోనే కదా ఉండేది ,నేడేమి ఆయన కానరావటంలేదు..

.

నీ ఇల్లు అంతా శోభావిహీనముగా ఉన్నది ఎందుకు ? అందరి ముఖాలలో దైన్యము కనపడుతున్నది కారణమేమిటి? అని ప్రశ్నించాడు.

.

నాయనా ప్రాణులన్నింటికి ఏది చివరి గతియో నీ తండ్రి ఆగతిని పొందినాడు అని చాలా మామూలుగా ,అతితేలికగా ఏదో ప్రియమైన విషయం పలుకుతున్నట్లుగా పలికింది కైక ! .

.

ఆ వార్త చెవిన పడీ పడటం తోటే అయ్యో చచ్చితినంటూ నేలమీద దబ్బున పడిపోయాడు భరతుడు.మొదలు నరికిన చెట్టులా పడిపోయి తీవ్రమైన వేదనతో దుఃఖిస్తున్న కుమారుడిని లేవ నెత్తింది కైక.

.

అమ్మా! నా అన్న రామునికి పట్టాభిషేకమో మరి ఏ ఇతరమైన యజ్ఞమో చేయుచూ నన్ను రమ్మన్నాడనుకొని ఎంతో సంతోషంతో వచ్చాను.తండ్రికి అంతిమ సంస్కారములు చేసిన రామలక్ష్మణులు ధన్యులు .

.

అమ్మా త్వరగా రామునికి కబురుపంపు నేను వచ్చానని .

.

ఏ కార్యమునైనా అవలీలగా సాధించే ఆ రాముడే నా సోదరుడు,తండ్రి, బంధువు,ఆయనకు నేను దాసుడను .

తండ్రి పాదములు పట్టుకొనడానికి నోచకుంటిని 

ఇక అన్నగారే నా తండ్రి, ఆయన పాదాలు పట్టుకోవాలి ! ఇప్పుడిక ఆయనే నా గతి.

.

అమ్మా చనిపోతూ చనిపోతూ నా తండ్రి ఏమి పలికినాడు? అని అడిగిన భరతుడిని చూసి, సీతాసమేతుడై తిరిగి వచ్చిన రాముని మహాబాహువైన లక్ష్మణుని చూడగలిగిన వారు ధన్యులు అంటూ హా రామా హా సీతా హా లక్ష్మణా అంటూ ప్రాణాలు విడిచాడు నీ తండ్రి అంటూ నిస్సిగ్గుగా పలికింది కైక.

.

ఇది ఇంకొక అప్రియవార్త భరతునకు.

.

 ఎక్కడికెళ్ళాడు రాముడు? ఇపుడిక్కడలేడా ?అని అడిగిన భరతునికి ఏదో ప్రియమైన విషయం చెపుతున్నట్లుగా రాముడు దండకారణ్యమునకు పంపబడినాడు అని అన్నది కైక.

.

రాముడు దేశం నుండి ఎందుకు వెళ్ళ గొట్టబట్టాడు?అధర్మకార్యము ఏమైనా చేశాడా?

ఏ బ్రాహ్మణుని ధనాన్ని అపహరించలేదు కదా?

ఏ వ్యక్తిని అకారణముగా హింసించ లేదు కదా?

పరుల భార్యలపై కోరిక చూపలేదు కదా?

పసిపిల్లలను చంపేవాడిని వెడలకొట్టినట్లు రాముని దండకారణ్యమునకు ఎందుకు పంపినారు? 

.

ఆవేదనతో తల్లిని ప్రశ్నిస్తున్నాడు భరతుడు!

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: