12, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీమద్భాగవతము

 శ్రీమద్భాగవతము చతుర్థ స్కంధం -2


దక్షప్రజాపతివంశవిస్తారము 


బ్రహ్మ కుమారుడైన దక్షప్రజాపతికి స్వాయంభువ మనువు పుత్రిక అయిన ప్రసూతి వల్ల పదహారుమంది కుమార్తెలు కలిగారు. దక్షుడు ఇలా జన్మించిన తన పదహారుమంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్ముని కిచ్చి వివాహం చేసాడు. ఒక కుమార్తెను అగ్నిదేవునికి, ఒక కుమార్తెను పితృదేవతకు, మరొక కుమార్తెను జనన మరణాలు లేని శివునికి ఇచ్చాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శ్రుతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, క్రియ వల్ల యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే ఇద్దరు ఋషులు జన్మించారు. ఆ నరనారాయణులు పుట్టిన సమయంలో...(నరనారాయణులు జన్మించిన సమయంలో) అనుకూల వాయువు చల్లగా, మెల్లగా వీచింది. నాలుగు దిక్కులు ప్రకాశించాయి. అఖిల లోకాలు ఆనందం పొందాయి. ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. సముద్రాలు కలతలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. నదులు వేగంగా ప్రవహించాయి. గంధర్వులు, కిన్నరులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషంతో స్తుతించారు. ప్రపంచమంతా పరమ మంగళోపేతమై భాసించింది. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలు ఆ మహాత్ములైన నరనారాయణుల దగ్గరకు వచ్చి ఇలా స్తుతించారు.

ఆకాశంలో గంధర్వనగరం పెక్కురూపాలను పొందినట్లు ఈ విశ్వం నీ మాయచేత సృష్టింపబడింది. నిన్ను నీవు లోకానికి తెలియజేయడానికి నరనారాయణుల రూపాలతో ధర్ముని ఇంట అవతరించావు. అటువంటి మహాపురుషుడ వయిన నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మలు జరుగకుండా ఉండటానికి సత్త్వగుణంతో నీవే మమ్ము సృజించావు. అటువంటి మమ్ము శ్రీదేవికి నివాసమైన పద్మశోభను పరిహసించే నీ దయాదృష్టులతో మమ్ము చూడు. అని ఈ విధంగా దేవతలు స్తుతింపగా వారిని కరుణాకటాక్ష వీక్షణాలతో చూచి నరనారాయణులు తండ్రి సంతోషింపగా గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు.భూభారాన్ని తగ్గించడానికి ఆ నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురు యదు వంశాలలో సత్త్వగుణ సంపన్నులై జన్మించారు.ఇంకా అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు.


ఈశ్వర దక్షుల విరోధము 


దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశించాడు.“చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి....శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోనివారందరూ లేచి నిలబడ్డారు. వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని...తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో (ఇలా అన్నాడు). దేవతలారా! మునులారా! మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుని చూపించి... 

ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు) (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు 

పెట్టారు. ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను.”అని ఈ విధంగా దక్షుడు నిందించి “శంకరుని శపిస్తాను” అంటూ శాపజలాలను చేతిలో తీసికొని రోషంతో ఇలా అన్నాడు.“ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు. ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై, సముచితాలై పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు “నీవు చేసినది చెడ్డపని” అని అడ్డుకోగా, దక్షుడు ఆగ్రహోదగ్రుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెఱ్ఱవారగా ఇలా అన్నాడు “ఈ దక్షుడు తన మర్త్యశరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేసాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్త్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్త్వాన్ని విస్మరించి పశువుతో సమానమౌతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు, ఈ దక్షుడు తొందరలోనే గొఱ్ఱెతలవాడు అగుగాక” అని ఇంకా...ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక!అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలవల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి, తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పొట్టకోసమే అవలంబిస్తారు. ధనంమీద, దేహంమీద, ఇంద్రియాలమీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు” అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగుమహర్షి తిరిగి ఇలా శపించాడు. ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక!సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మద్యం పూజ్యమగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేసాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా....ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సదస్యులుగా వచ్చి, దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు.

కామెంట్‌లు లేవు: