12, అక్టోబర్ 2020, సోమవారం

మహాభారతము ' 108

 మహాభారతము ' 108 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


విరాటపర్వం.


పాండవులు విరాటనగర పొలిమేరలలో ఒక స్మశానం చూసి, అందులో, పెద్దపెద్దచెట్లతో అరణ్యంలాగా భయంకరంగా గోచరిస్తున్న ప్రదేశం కనుగొన్నారు. అక్కడ జమ్మిచెట్టు ఒకటి శాఖోపశాఖలుగా విస్తరించి, చూపరులకు దూరం నుండే భయభ్రాంతులు గొలిపేటట్లు వున్నది. ఇదే అనువైన ప్రదేశంగా భావించి, పాండవులు వారి మహిమాన్వితమైన అస్త్రశస్త్రాలను, ధనుర్బాణాలను,ఆ చెట్టుమీద వుంచవలెనని నిశ్చయించుకున్నారు.  


ఆయుధాలన్నీ జాగ్రత్తగా మూటకట్టి పొడుగుగా మానవాకృతిలోవుంచి, వానిని వర్షపు నీరు చేరకుండా మందమైనబట్టతో చుట్టి, కుదురుగా ఒకపెద్ద చెట్టుకొమ్మపై వుంచారు. ఆ దరిదాపులలోనికి యెవరూవచ్చే అవకాశం లేకుండా, ఒక శవాన్ని అక్కడ వ్రేలాడదీశారు.  


 ఆ తరువాత శుచిర్భూతులై పాండవులందరూ, నగరం లోనికి ప్రవేశించడానికి వుద్యుక్తులవుతుండగా, ధర్మరాజు, నలుగురు సోదరులకూ, జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు అనే సంకేతనామాలు చెప్పి, అజ్ఞాతవాసంలో, వారిని పోల్చుకునే వీలుగా ఆపేర్లను వాడమని చెప్పాడు.  


నగరం లోనికి ప్రవేశించేముందు, అందరూ, దుర్గాదేవి ఆలయం లోనికివెళ్లి, దుర్గాదేవిని స్తుతించారు. రాజ్యభ్రష్టులైనతమకు త్వరలో అజ్ఞాతవాసం పూర్తి, రాజ్యప్రాప్తి, కలిగేటట్లు ఆశీర్వదించమని కోరుకున్నారు. దుర్గాదేవి సాక్షాత్కరించి, ' నా అనుగ్రహం చేత మీరు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయని ', చెప్పి దీవించింది. 


ఆపై వారు, గంగాస్నానం చేసి, నిత్యకర్మలు ఆచరించిన తరువాత, యమధర్మరాజును ప్రార్ధించగా, ఆయన వారికి, వారు కోరుకున్నరూపాలు పొందేటట్లుగా అనుగ్రహించాడు.  


దండకమండలాలతో, బ్రాహ్మణవేషధారి అయి, ధర్మరాజు విరాటరాజు కొలువులో ప్రవేశించాడు. ఆయన స్ఫురద్రూపం విరాటమహారాజును ఆకట్టుకున్నది. మీరెవరని, విరాటుడు అడుగగా, ' రాజా ! నాపేరు కంకుభట్టు. వైయాఘ్రపద గోత్రీకుడను. ఒకప్పుడు ధర్మరాజుగారి కొలువులో ఆయన అనుంగుచెలికానిగా వుండేవాడిని. సరస సంభాషణలతో, నా ద్యూతవిద్యతో, ఆయనకు కాలక్షేపం చేస్తుండేవాడిని. ప్రస్తుతం, సర్వం కోల్పోయి, మీ ఆశ్రయం కోరుకుంటున్నాను. నా సాంగత్యం వలన మీకు శుభం కలుగుతుంది. నన్ను మీకొలువులో వుండనీయండి. ' అని వినయంగా అడిగాడు.


విరాటరాజు వెంటనే సానుకూలంగా స్పందించి, మంత్రులతో, ' అమాత్యులారా ! నేటినుండి, యీ కంకుభట్టు మనకు చాలా కావలసినవాడు. నా మిత్రుడు. నాతో సమానంగా అతనికి గౌరవమర్యాదలు యేర్పాటుచేయండి, ఆయన మనదగ్గర వున్నన్ని రోజులూ.' అనిచెప్పాడు.


మరికొద్దిసేపటికి, యెవరికీ అనుమానం రాకుండా, వేరొక మార్గం నుండి భీమసేనుడు అతి పెద్ద గరిటెను, కూరగాయలకత్తిని చేత బట్టుకుని సభలో ప్రవేశించి, విరాటుని చూపులు ఆకట్టుకున్నాడు. తన మృదు సంభాషణలతో, పాక శాస్త్ర నైపుణ్యాన్ని వివరిస్తూ, మహారాజుకు రుచికరమైన వంటలు చేస్తానని చెప్పాడు. ఆశ్రయం యివ్వమన్నాడు. భీమసేనుని బలిష్టమైన ఆకృతిచూడగానే, విరాటరాజు ముచ్చటచెంది, తమ పాకశాల ముఖ్యునిగా వుండమని ఆదరించాడు. అదేవిధంగా, నకుల సహదేవులు విరాటుని అశ్వశాల, గోశాలలో ఆశ్రయం పొంది, వాటి పాలనలో ముఖ్యులుగా వుండేటట్లు ఆశ్రయం కలిపించుకున్నారు.  


ఇక మిగిలింది,అర్జునుడు, పాంచాలి. పాంచాలి తన అందమైన ముఖాకృతితో, కోమలమైన శరీరంతో, నారచీరలలో నగరవీధులలో తిరుగుతుండగా, సుధేష్ణాదేవి, ఆమెను పిలిపించి, కుశలప్రశ్నలువేసి,' గొప్పింటి స్త్రీలాగా వున్నావు, యేమిటి యీ దురవస్థ నీకు? నీవు దేవకన్యవా ? అప్సరసవా ? ఎవరు నీవు ? ' అని అడిగింది.

' అమ్మా ! నేను మీరనుకుంటున్న యెవరినీకాను. సామాన్య సైరంధ్రీవృత్తిలో వున్నదానను. చక్కగా రాజకాంతలకు జడలువేస్తాను. సువాసనలపూలతో మాలలు కడతాను. ఇంతకుముందు సత్యభామాదేవివద్ద, ద్రౌపదివద్ద పనిచేసిన అనుభవం నాకు వున్నది. నేను వారిచే మాలిని అని పిలువబడేదానను. నాకు మీరు ఆశ్రయమిస్తే మీకు కూడా సైరంధ్రీ సేవలు చేసి, ఆనందింపజేస్తాను. ' అని చెప్పింది, ద్రౌపది.


' కానీ మాలినీ ! నీ అంత అందమైనదానిని నా అంత:పురం లో పెట్టుకొనుట, నాకు ప్రమాదకరం. నీ రూపలావణ్యాలు యెలాంటి జడునికైనా కామవాంఛ కలుగజేయక మానవు. ఆవొక్క విషయంలో నేను భయపడుతున్నాను.' అన్నది సుదేష్ణాదేవి, మనసులో మాట బైటపెడుతూ. 


'అమ్మా ! సుధేష్ణా దేవీ ! ఆవిషయంలో మీరు భయపడవలదు. నాకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా వున్నారు. విధివశాన వారితో నేను కలిసివుండలేని దౌర్భాగ్య స్థితిలో వున్నాను. అయితే, వారు నా యోగక్షేమాలు అహర్నిశలూ కనిబెడుతూనే వుంటారు. నా మీద యెవరైనా చేయివేసే ప్రయత్నం చేస్తే, వారికి నా గంధర్వపతుల చేతిలో మృత్యువు ఖాయం. అదీ కాకుండా, నేను యెవరి యెంగిలిపదార్ధాలు తినను, పాదసేవ చేయను. కాబట్టి అట్టి పనులకు నన్ను వినియోగించకూండా వుంటే, ఈ అంత:పురానికి యేసమస్యా నావల్ల రాదు. దయచేసి ఆశ్రయమివ్వండి.' అని అడిగింది. సరే అని సుదేష్ణాదేవి ద్రౌపదిని తన అంత:పురం లో సైరంధ్రినిగా నియమించుకున్నది.


ఇక అర్జునుడు, తన ఆజానుబాహురూపం లోనే, స్త్రీగా మార్పుచెంది, కళ్ళు చెదిరే అలంకారంతో, వయ్యారి భామలాగా, మందగమనంతో నడుచుకుంటూ విరాటుని కొలువులో ప్రవేశించి, విరాటరాజుకూ, కంకుభట్టుకూ, అమాత్యులకూ, సభికులకూ నృత్యరీతులలో వందనం సమర్పించి అందరినీ ఆకట్టుకున్నాడు.  


విరాటుడు ఆ వచ్చిన ఆకారాన్ని చూసి, ఇంద్రుడే మారువేషంలో వచ్చాడేమో అని విస్మయం చెంది చూస్తూ వుండిపోయాడు. ఆతడు పేడివాడనే సంగతి తెలిసి భరించ లేకపోయాడు. ' మహారాజా ! నాకు స్త్రీలకు సంబంధించిన పనులు చెయ్యడంలో అపూర్వ అనుభవం వున్నది. చిత్ర విచిత్రమైన బొమ్మలు తయారుచేసి రాకుమార్తెలను అలరింపచేస్తాను. నర్తనశాలను శుభ్రంగా చూసుకుంటూ, నాట్యశిక్షణ యిస్తాను. నా వద్దకు నిస్సందేహంగా మీ రాకుమార్తెలను, ఆడవారిని శిక్షణకై పంపవచ్చును. వారితో యెంతో మర్యాదగా ప్రవర్తించి, అనురక్తితో వారికీ నాట్యశాస్త్రం నేర్పుతాను. నన్ను మీ కొలువులో వుంచుకుని, నర్తనశాల బాధ్యతలు నాకు అప్పగించి, నాకు సహాయం చెయ్యండి. ' అని హొయలుబోతూ , వయ్యారం ఒలకబోస్తూ చెప్పాడు. 


ఆ విధంగా విరాటరాజు వద్ద కొలువులో అర్జునుడు బృహన్నల నామంతో చేరి, రాకుమార్తె ఉత్తరకు, మిగిలిన కన్యలకు, నాట్య విద్య బోధిస్తూ, అంత ;పుర కాంతలతో, వారి ముఖ్య స్నేహితురాలుగా కలిసిపోయాడు.  


' జనమేజయా ! ఆ విధంగా పాండవులు విరాటరాజు కొలువులో వ్యూహాత్మకంగా ప్రవేశించి అజ్ఞాతంగా వుంటూ యేక్షణాన యెవరు తమను గుర్తుపడతారో అన్న భీతితో, విరాట నగరంలో యెవరికివారై కాలంవెళ్లదీస్తూ, ఒక సంకేతస్థలంలో నిర్ణీత సమయంలో కలుసుకుంటూ, తమదృష్టికి వచ్చిన విషయాలు పరస్పరం తెలుపుకుంటూ, దీనంగా వున్నారు, ' అని వైశంపాయనుడు చెప్పాడు, ' అని సూతమహర్షి,, శౌనకాది మహామునులకు, నైమిశారణ్యం లో చెప్పాడు.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

కామెంట్‌లు లేవు: