12, అక్టోబర్ 2020, సోమవారం

మోహముద్గరః

 దశిక రాము


మోహముద్గరః (భజగోవిందం)


చిన్నతనం నుండే పిల్లలు చదవటం అలవాటు చేసుకోగలిగేలా ఇంపైన ఫణితిలో ఎంతో సొంపుగా ఉండే శ్లోకాలు ఏ గ్రంధంలో ఉన్నాయి ?

మనదేశంలో సిద్ధాంత ప్రవక్తలైన ఆచార్యులు ముగ్గురు ప్రథమ శ్రేణిలో నిలిచి ఉన్నారు. వారే 1. అద్వైతసిద్ధాంతమును ప్రచారము గావించిన శంకరాచార్యులు, 2. విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము గావించిన రామానుజాచార్యులు. 3. ద్వైత సిద్ధాంతమును ప్రచారము గావించిన మధ్వాచార్యులు. 

శంకరాచార్యులు మహామేధావి, కవి, తత్త్వవేత్త, ప్రచారకులు, వాదనాపటిమగల జ్ఞానస్వరూపులు. ఆయన కేరళ రాష్ట్రంలోని 'కాలడి' అనే గ్రామంలో జన్మించారు. తండ్రి మహాపండితుడైన శివగురుడు. తల్లి ఆర్యాంబ. సంవత్సరం వయస్సులోనే సంస్కారయుక్తంగా మాట్లాడటం, స్వంత భాషను చక్కగా తెలుసుకొనటం; రెండవ ఏట అనేక భాషలను చదువను, వ్రాయను నేర్వటం; మూడవ ఏట కావ్య, నాటక, పురాణ గ్రంథములను స్వయముగా తెలుసుకొనటం ఆశ్చర్యకరవిషయం. ఏకసంథాగ్రాహియై, సకలవిద్యలను తెలుసుకుంటూ, పాఠములు చెప్పేటప్పుడు గురునికే తప్పులుదిద్దెడివాడు. అంత చిన్నవయస్సులోనే పండితులతో శాస్త్రచర్చలు జరుపుతూ అపూర్వ ప్రజ్ఞావిశేషములను చూపెడివాడు. 

 ఏడవఏట సన్యసించాలనే కోరికను వ్యక్తపరచేవాడు. కాని తల్లి అంగీకరించేది కాదు. భర్తను కోల్పోయిన ఆమె పుత్రుని విడుచుటకు అంగీకరించలేదు. చివరకు ఎనిమిదవఏట నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి శంకరుని కాలు పట్టుకున్నది. దానితో శంకరుడు కేకబెట్టినాడు. తల్లి రక్షించమని అటు ఇటు పరుగులు తీస్తూ ఆక్రోశిస్తున్నది. అప్పుడు శంకరుడు అమ్మా! “నీవు సన్యాసము స్వీకరించిన నిన్ను విడిచి పెట్టెద”నను ఒక మాట లోపల నుండి వినవచ్చుచున్నది. కనుక సన్యసించుటకు అంగీకరించమని ప్రాధేయ పడ్డాడు. ఎట్టకేలకు తల్లి అంగీకరించినది. మొసలి పట్టు వీడినది. అంత తల్లిని ఓదార్చి, ఆమెను జ్ఞాతులకప్పగించి సన్యాసాశ్రమ స్వీకారానికై గురుని వెతుకుతూ ప్రయాణమయ్యాడు. అలా వెళ్ళి వెళ్ళి అనేక నదీ, పట్టణ, అరణ్యములను దాటి నర్మదా నదీతీరమున గల గోవిందయతిని ఆశ్రయించాడు. ఆయన వద్ద సన్యాసమును స్వీకరించి అనేక శాస్త్రములను అభ్యసించాడు. గురు శుశ్రూష గావించాడు. గురువు మెచ్చుకొని శంకరుని కాశీపట్టణం వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రములకు భాష్యము వ్రాయమని ఆదేశించాడు. అంతట ఆయన కాశీనగరం చేరాడు. అక్కడ అనేకమంది శిష్యులుగా చేరారు.

 అప్పటి నుండి శంకరాచార్యులవారు భారతదేశమంతటిని కాలినడకన తిరిగి అద్వైత సిద్ధాంతమును ప్రచారం గావించారు. అనేక దేవాలయములు, మఠములు, పీఠములు స్థాపించి విచ్ఛిన్న దశలోనున్న హిందూధర్మాన్ని పునరుద్ధరించారు. 

 ఇరువదిరెండు సంవత్సరముల పాటు నిర్విరామంగా, నిరంతరాయంగా శ్రమించి తన వాక్పటిమతో, అద్భుత మేధాశక్తితో, ఆచరణశీలమైన సిద్ధాంతాలతో అద్వైత మతప్రచారం గావించి తన ముప్పది రెండవఏట హిమాలయములలోని కేదారనాద్ సమీపంలోని తన గుహ నుండి అదృశ్యమయ్యాడు.

 ముప్పదిరెండు సంవత్సరముల ఆయుష్కాలములో ఆయన వ్రాసిన గ్రంథములు లెక్కకు మిక్కిలి. ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు, భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాయటమేగాక అనేక స్తోత్రాలు, పద్య గద్యములు, శ్లోకములు, ప్రకరణ గ్రంథములు ఆయన కలం నుండి జాలువారినవి. 

 మొత్తం 22 సంవత్సరాల కాలములో ఇన్ని కార్యాలు నిర్వర్తించటం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనికాదు. సాక్షాత్తు శంకరుల అవతారంగా కీర్తించబడిన శంకరాచార్యులవారు అవతార పురుషులు గనుకనే సాధ్యమయినది. 

శంకరుల రచనలలో ఈ భజగోవిందం చాలా చిన్నది. అయితే వేదాంతానికి ఇది పునాది. సరళమైన భాషలో, ఇంపైన ఫణితిలో ఈ శ్లోకాలు ఎంతో సొంపుగా ఉంటాయి. చిన్నతనం నుండే ఈ శ్లోకాలను చదవటం అలవాటు చేసుకొంటే క్రమంగా ఇందులోని భావాలు వ్యక్తమై మానవజీవితం సక్రమ మార్గంలో పయనించి, సార్థకమౌతుంది. ఈ శ్లోకాలు మానవునిలోని మోహాన్ని తొలగించి, వైరాగ్యాన్ని కలిగించి జన్మసార్థక్యానికి హేతువులౌతాయి. అందుకే వీటిని 'మోహ ముద్గరము' అంటారు. 

🙏🙏🙏


మోహముద్గరః (భజగోవిందం)


ఒక్క క్షణాన్ని కూడా జారవిడువకూడదని - ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కొరడా దెబ్బగా చరుస్తూ సామాన్య జనులందరికీ నేనెవరు? ఎందుకీలోకంలోకి వచ్చాను? అనే మొదలగు ప్రశ్నలకు సరైన సమాధానలు తెలియజేసే గ్రంధం?

ఒకనాడు శంకరులు తన 14 మంది శిష్యులతో కాశీ వీధులలో తిరుగుతుండగా ఒకచోట ఒక వృద్ధపండితుడు వ్యాకరణసూత్రాన్ని వల్లె వేస్తున్నాడు. ఇంత వృద్ధాప్యంలో కూడా ఈ పండితుడు లౌకిక ప్రయోజనాలను కలిగించే వ్యాకరణసూత్రాలను వల్లె వేస్తున్నాడు. ఇక ఇతడికి జీవితకాలం ఎంతో లేదు. మరి ఆత్మసాక్షాత్కారం గావించుకొని జన్మసార్థకం చేసుకొనుటకు ఇక ఎప్పుడు ప్రయత్నం ప్రారంభిస్తాడు? అని సందేహం కలిగింది. నవ్వు వచ్చింది; జాలి వేసింది. వెంటనే ఆవేశంగా ఈ శ్లోకాలు ఆయన హృదయం నుండి తన్నుకుంటూ బయటకు వచ్చాయి.

  వ్యాకరణసూత్రాలు నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు. ఆత్మసాక్షాత్కారాన్ని ఈ మానవ జన్మలోనే పొందాలి. కనుక భజించు గోవిందుణ్ణి, భజించు గోవించుణ్ణి. ఓ మూఢమతీ! గోవిందుణ్ణే భజించు అని హెచ్చరించాడు. 

 శంకరులు 12 శ్లోకాలను చెప్పారు. మొదటి పల్లవిశ్లోకంతో కలిపి 13 శ్లోకాలు. ఆ వెంటనే 14 మంది శిష్యులు ఉత్సాహంతో తలకొక శ్లోకం చెప్పారు. దానితో మొత్తం 27. ఆ తర్వాత శంకరులు ముగింపుగా 4 శ్లోకాలు చెప్పారు. ఇలా మొత్తం 31 శ్లోకాలతో భజగోవిందగ్రంథం తయారైంది. మొదటి 12 శ్లోకాలను ద్వాదశ మంజరికాస్తోత్రమని, శిష్యుల 14 శ్లోకాలను చతుర్దశ మంజరికా స్తోత్రమని అంటారు. మొత్తం 31 శ్లోకాలను మోహముద్గరము అంటారు.

 ఈ శ్లోకాలన్నీ నిజంగా కేవలం ఆ పండితుని మోహాన్ని తొలగించటానికే కాదు; సామాన్య జనులందరి మోహాన్ని తొలగించటానికి ఉద్దేశించినవే. ఆ పండితుడు ఎలా లౌకిక విద్యల సంపాదనలో మునిగిపొయ్యాడో అలాగే మనం కూడా పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకు లౌకిక వస్తువులు, ధనసంపదలు, భోగాలు మొదలైన వాటి కొరకే జీవితాన్ని వెచ్చిస్తాం. వాటిని నిలుపు కోవటానికే తంటాలు పడుతూ ఉంటాం. అంతేకాని నేనెవరను? ఎందుకీ లోకంలోకి వచ్చిపడ్డాను? ఎందుకీ కష్టాలు - బాధలు అనుభవిస్తున్నాను? ఎప్పుడు నాకీ బాధల నుండి, బంధాల నుండి విముక్తి? అనే ఆలోచన చేసేవారే అరుదు. ప్రయత్నించేవారు ఇంకా అరుదు. దానికి కారణం ఈ ప్రాపంచిక భ్రమలు. ఈ భ్రమలను తొలగించుకొని, జన్మను సార్థకం చేసుకోవాలంటే ఈ మోహముద్గరం మనకు ఉపయోగపడుతుంది. మనకు సరైన మార్గం చూపుతుంది.

 ఈ శ్లోకాలు ఒక్కక్కటి ఒక్కొక్క కొరడా దెబ్బ మన వీపుపై ఛళ్ళున చరిచినట్లు, మన హృదయంలోనికి సూటిగా గ్రుచ్చుకున్నట్లు భావాలుంటాయి. ఎందుకిలా చెప్పారు? తగలబడిపోయే ఇంటిలో నిద్రిస్తున్న ఆఫీసరుగారిని నిద్రలేపి బయటకు రమ్మనటానికి గౌరవ మర్యాదలు, ఫార్మాలిటీస్ చూపటానికి టైము లేదు. తట్టిలేపాలి. కొట్టి లేపాలి. లేదా మోసుకొచ్చి బయట పడేయాలి. ఇక్కడా అంతే.

  మానవజీవితం ఎంత కాలముంటుందో తెలియదు. “నిత్యం సన్నిహితో మృత్యుః” కాలం ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. కనుక ఒక్క క్షణాన్నీ జారవిడువకూడదు. మరి మనమో! హాయిగా నవ్వుకుంటూ - విలాసంగా మన అమూల్యమైన కాలాన్ని అల్పమైన విషయాల కొరకు, అనిత్యమైన భోగాల కొరకు ఖర్చుపెడుతున్నాం. మనకు చీమ కుట్టినట్లైనా లేదు. అందుకే ఈ విసుర్లు, కొరడా దెబ్బలు. ప్రేమతో - దయతో - కసరి, అసహ్యించుకొని, సరైన మార్గంలో పెట్టడమే ఈ శ్లోకాల వెనుక దాగిన ఆవేదన, ఆంతర్యం. 

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: