12, అక్టోబర్ 2020, సోమవారం

గీతా మకరందము

 -గీతా మకరందము

  దైవాసురసంపద్విభాగయోగము 

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ షోడశోఽధ్యాయః 

పదునాఱవ అధ్యాయము 

దైవాసురసంపద్విభాగయోగః

దైవాసురసంపద్విభాగయోగము 


శ్రీ భగవానువాచ :-


అభయం సత్త్వ సంశుద్ధిః

జ్ఞానయోగ వ్యవస్థితిః | 

దానం దమశ్చ యజ్ఞశ్చ 

స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ || 


అహింసా సత్యమక్రోధః

త్యాగశ్శాన్తిరపైశునమ్ | 

దయా భూతేష్వలోలత్వం* 

మార్దవం హ్రీరచాపలమ్ ||  


తేజః క్షమా ధృతిశ్శౌచం

అద్రోహో నాతిమానితా | 

భవన్తి సమ్పదం దైవీం

అభిజాతస్య భారత ||   


తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా! (1) భయములేకుండుట (2) అంతఃకరణశుద్ధి (3) జ్ఞానయోగమునందుండుట (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) (వేదశాస్త్రాదుల) అధ్యయనము (8) తపస్సు (9) ఋజుత్వము (కపటము లేకుండుట) (10) ఏ ప్రాణికిన్ని బాధగలుగజేయకుండుట (అహింస) (11) సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక, నిజముపలుకుట (సత్యము) (12) కోపము లేకుండుట (13) త్యాగబుద్ధిగలిగియుండుట (14) శాంతస్వభావము (15) కొండెములు చెప్పకుండుట (16) ప్రాణులందు దయగలిగియుండుట (17) విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందాసక్తి లేకుండుట, వానిచే చలింపకుండుటయు (18) మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) (19) (ధర్మవిరుద్ధకార్యములందు) సిగ్గు (20) చంచల స్వభావము లేకుండుట (21) ప్రతిభ (లేక, బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (కష్టసహిష్ణుత) (23) ధైర్యము (24) బాహ్యాభ్యంతర శుచిత్వము (25) ఎవనికిని ద్రోహముచేయకుండుట, ద్రోహచింతనము లేకుండుట (26) స్వాతిశయములేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను ఈ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నవి. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).


వ్యాఖ్య:- గీతా గ్రంథమున 'సాధన’కు విశేషప్రాముఖ్యత నొసంగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో, అత్తఱి పారమార్థికలక్ష్యము చేరువనేయుండును. కావున అట్టి చిత్తశుద్ధిపరికరము లనేకములు గీతయం దొసంగబడినవి. ఈ అధ్యాయప్రారంభమునగల దైవీసంపద్వివరణము వానిలో చేరినదే అయియున్నది. ఇఱువదియాఱు సుగుణములను భగవాను డిచట తెలియజేసిరి. వానినన్నింటిని ముముక్షువు - విద్యార్థి పాఠములను వలె - క్షుణ్ణముగ నభ్యసించి హృదయమును పరిశుద్ధ మొనర్చుకొనినచో ఇక మోక్షలక్ష్యము సన్నిహితమైనట్లే యగును. కావున సాధకు లీసద్గుణరాశిని ప్రయత్నపూర్వకముగ నవలంబించి కడు జాగరూకతతో వానిని కాపాడుకొనుచుండవలెను.

సంపద యనగా ధనము, ఐశ్వర్యము. దైవసంపదయనగా దైవధనము. శ్రీకృష్ణపరమాత్మ దైవధనము నిపుడు లోకులముందు వెదజల్లుచు " ఓ జీవులారా! నశ్వర ప్రాపంచికధనములతో క్రీడించుచు, వానియందే అమూల్యకాలమంతయు వినియోగించుచు దుఃఖపరంపరలను, జన్మపరంపరలను బొందకుడు! ఇవిగో తీసికొనుడు దైవసంపద్రాసులను, పారమార్థిక రత్నచయములను - అని వచించుచున్నారు. ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు, వజ్రవైఢూర్యాదులు ఏపాటి విలువగలవి? కావున వివేకవంతు లీ దైవసంపదను శీఘ్రముగ హస్తగతమొనర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మసాయుజ్యము నొందెదరుగాక!


“అభయమ్" - శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు అనేక సుగుణములను చెప్పదలంచిన వారై మొట్టమొదట "సుగుణరాట్”అనదగు, "సుగుణసింహ” మనదగు “అభయము"ను పేర్కొనెను.ఇది గమనింపదగినవిషయమైయున్నది. ఏలయనిన, ఎన్నియో ఇతర సుగుణములుండ ఈ "భయరాహిత్యము”నే తొలుదొల్త చెప్పనేల? దీనికి కారణములు కలవు - (1) అన్ని దుర్గుణములకును భయమే పునాది: భయమునుండియే తక్కిన అవగుణములన్నియు నంకురించును. కావున విజ్ఞులద్దానిని మొట్టమొదట పారద్రోలినచో, అనగా నిర్భయత్వము నవలంబించినచో ఇక తక్కిన సుగుణము లన్నియు అవలీలగా వచ్చి చేరగలవు. ఇక్కారణమున నయ్యది మొదట చేర్చబడి యుండవచ్చును. మఱియు (2) త్రాడులాగు పందెము (Tug of War) లో మొదటివానిని చివఱివానిని మహాబలశాలులుగ నుండునట్లుచూచి పెట్టుదురు. అట్లే అసురగుణములు గావింపబడుచున్న పందెమున దైవగుణములపక్షమున "అభయం" - అను సుగుణరాజమును ఏరి భగవాను డద్దానిని నాయకునిగ (Captain) జేసి రణరంగమున నిలబెట్టెను. దీనిని బట్టి అది యెంతటి మహత్తర సుగుణమో వ్యక్తము కాగలదు. (3) ‘అభయం వై జనక ప్రాప్తోసి’ - అని ఉపనిషత్తు లా యభయమును సాక్షాత్ బ్రహ్మపదముగనే వర్ణించి చెప్పినవి. కాబట్టి గీతయందు భగవానునిచే నెంతయో ప్రముఖముగ నెంచబడినట్టి ఈ నిర్భయత్వమను గుణరత్నమును సర్వులును లెస్సగ నభ్యసించి దైవసంపత్తిని బాగుగ కూడబెట్టుకొనవలెను.


'సత్త్వసంశుద్ధిః’ - "శుద్ధిః” అని చెప్పక "సంశుద్ధిః” అనిచెప్పుటవలన చిత్తము అత్యంత నిర్మలముగా నుండవలెనని భావము. మనస్సునం దేలాటి ప్రాపంచిక సంకల్పములకు, మలినసంస్కారములకు, పాపములకు చోటీ యరాదు. నిర్మలదర్పణమందే ప్రతిబింబము స్పష్టముగ గోచరించునట్లు నిర్మలచిత్తముననే ఆత్మ చక్కగ స్ఫురించగలదు.


“జ్ఞానయోగ వ్యవస్థితిః” - భగవానుడు గీతలో అనేక యోగములనుగూర్చి బోధించినను, అచటచట జ్ఞానయోగాధిక్యతను వెల్లడించుచునేయున్నారు. (ఆత్మజ్ఞానానుభూతియే అన్నిటియొక్క పరమావధిగనుక). కనుకనే దైవసంపదలో ప్రారంభములోనే దానినిగూర్చిన ప్రస్తావనను లేవనెత్తిరి. ‘సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే' అనునట్లు అన్ని కర్మలు, అన్ని యోగములును తుదకు జ్ఞానమందే పర్యవసించుచున్నవి. కాబట్టి అట్టి జ్ఞానయోగమందు దృఢస్థితిని సంపాదించవలసినదిగా భగవాను డిచట నాదేశించుచున్నారు.


'దానం’ - భూదానము, సంపద్దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము - ఇవియన్నియు దానములలో జేరినవే.


‘దమశ్చ’ - "శమ" మను అంతరేంద్రియనిగ్రహము ‘సత్త్వసంశుద్ధిః’ అను పదము ద్వారా ఇదివఱకే పేర్కొనబడియుండుటవలన ఇచట “దమ" మను బాహ్యేంద్రియ నిగ్రహముమాత్ర మిపుడు చెప్పబడినది. ఇంద్రియనిగ్రహములేనిది పరమార్థరంగమున ఎవరును ముందునకు పోజాలరని ఘంటాపథముగ చెప్పవచ్చును. కనుకనే గీతలో శమ, దమములకు సముచితస్థాన మొసంగబడుచునున్నది.


"యజ్ఞశ్చ” ఇచట యజ్ఞమనగా తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయయజ్ఞము, జ్ఞానయజ్ఞము మున్నగునవిమాత్రమేయని గ్రహించవలెను.

"స్వాధ్యాయః” - గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్ఠము, భారత, భాగవత, రామాయణములు - ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందలి సారమును మననముచేయుట స్వాధ్యాయ మనబడును.


“తపః” - తపస్సనగా తల క్రిందబెట్టి కాళ్లు పైనబెట్టుకొనియుండుట కాదు. గీత 17వ అధ్యాయమున చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. 


"ఆర్జవమ్” - శరీరము, వాక్కు, మనస్సు - అను మూడింటితోను ఏకరీతిగా వర్తించుట - అనగా త్రికరణశుద్ధి గలిగియుండుటయని అర్థము. విషజంతువులగు సర్పాదులు వక్రగతి గలిగియుండును. కావున వక్రస్వభావము గలిగియుండు మానవులున్ను విషజంతువులతో సమానులే యగుదురు.


‘అహింసా’ - శరీరముతో, వాక్కుతో, మనస్సుతో, ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట.


"సత్యం” - (1) శరీరవాఙ్మనంబులతో అసత్యమాడకుండుట.

(2) సత్యవస్తువగు పరమాత్మయందు నిలుకడ గలిగియుండుట.


“అక్రోధః” — క్రోధము చాల చెడ్డగుణము. పరమార్థసాధకునకే కాదు. ప్రతి మానవునికిని అది యెంతయో కీడొనర్చగలదు. అది ఆవహించినపుడు మనుజుడు కల్లు త్రాగినవాని చందమున నుండును. ఆ ‘కైపు’ లో యుక్తా యుక్తములను విస్మరించి యతడు అధఃపతనమునొందును. కాబట్టియే ‘క్రోధాద్భవతి సమ్మోహః …. ప్రణశ్యతి’ - అని దీని ఆగడమును గూర్చి భగవాను డిదివఱకే విపులముగ తెలిపియుండెను. క్రోధము రజోగుణసంబంధమగు దుర్గుణము. కావున అది మనుజుని యావేశించునపుడతని కండ్లెఱ్ఱబడును. దేహమంతయు చెమటబట్టును. తుదకు వికృతరూపుడై, దాదాపు రాక్షసునివలె మారిపోవును. ఇక్కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము (అక్రోధము) ఒక గొప్ప ఆవశ్యకతయైయున్నది. కనుకనే యది దైవసంపదయందు పేర్కొనబడినది.


“త్యాగః” - ‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ - త్యాగమువలననే మోక్షము సిద్ధించును అని ఉపనిషత్తు లుద్ఘోషించుచున్నవి. దృక్స్వరూపమగు ఆత్మను, భగవంతుని అవలంబించి, దృశ్యవస్తువులగు విషయసమూహములయం దాసక్తిని త్యజించుటయే త్యాగము. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్టసంకల్పములను, విషయవ్యామోహమును, కర్మఫలమును త్యజించుటయే వాస్తవమగు త్యాగము. ఇదియే అంతరత్యాగము. బాహ్యత్యాగముకంటె అంతరత్యాగము శ్రేష్ఠమైనది.


"శాంతిః” - చిత్తము శాంతియుతముగ నుండవలెను. కల్లోలసముద్రమువలె నుండరాదు. సంకల్పములచే కొట్టుకొనుచుండరాదు. చిత్తము పరమాత్మయందు లయించినపుడే పూర్ణశాంతి సంభవిం చును. శాంతిలేనివానికి సుఖము యుండదు (అశాంతస్య కుతస్సుఖమ్). భగవదాశ్రయము, దృశ్యవిషయసంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు.


‘అపైశునమ్' - ఇతరులదోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట. పరులగుణములతో మనకు పనియేకాని పరులదోషములతోగాదు. జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటానుకోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరులదోషములను లెక్కింపవలసినపనిలేదు.


“దయా భూతేషు” - ‘సమస్తప్రాణికోట్లయెడల దయగలిగియుండుట’ సాధకునకొక అత్యవసరమైన సుగుణముగనుక దానినిగూర్చి గీతయం దనేకచోట్ల ప్రస్తావించబడెను. బ్రహ్మజ్ఞానమను మందుకు భూతదయయను పథ్యము ఉండియే తీరవలెను. అపుడే ఆ మందు చక్కగ పనిచేయును. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులతోబాటు భూతదయనుగూడ సాధకులు బాగుగ నభ్యసించవలయును.

         'అలోలత్వమ్’- ఇంద్రియలోలత్వము లేకుండుట, విషయచాపల్యము వదలి యుండుట;

ఇంద్రియములయొక్క శక్తియంతయు విషయభోగములందు వ్యర్థమైపోయినచో ఆత్మచింతనాదులం దది సమర్థమైయుండజాలదు. కావున ప్రత్యాహారముచే ఆ యా యింద్రియములను విషయములనుండి మఱలించి, ఆత్మయందు స్థాపించవలెను. మనస్సు చపలత్వము లేకయుండవలెను.


'మార్దవమ్' - మాటయందు, చేష్టయందు కాఠిన్యముచూపక మృదుత్వము గలిగి యుండవలెను. పరుషత్వమును వీడవలెను. ఇది సాత్త్వికగుణసంపన్నుని లక్షణము. 


 “హ్రీః” - (సిగ్గు) - (1) పాపకార్యములు చేయుటయందు సిగ్గు గలిగి యుండవలెను. (అనగా వానిని చేయరాదు).

(2) "నేనింతవఱకు పరమార్థక్షేత్రమున ఏమియున్నతిని బొందితిని?' అని

ప్రశ్నించుకొని, ఉన్నతినిబొందనిచో సిగ్గుపడవలెను.

(3) మహనీయులను, అనుభవజ్ఞులను సాధుమహాత్ములను, భక్తులను గాంచి, తన సాంసారిక అవనతిని తలంచుకొని సిగ్గునొందవలెను. మఱియు వారివలె ఉన్నత పారమార్థిక శిఖరము నధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలెను.


“అచాపలమ్” - చంచలత్వము రజోగుణస్వభావము - అట్టిది లేకుండవలెను. మనస్సును ఆత్మనుండి (దైవమునుండి) చలింపజేయరాదు.


"తేజః” - బ్రహ్మతేజస్సుగలిగి యుండవలెను.


"క్షమా” - ఓర్పు, సహనము; ద్వంద్వములందు నిర్వికారుడై పృథివివలె , ఫలవృక్షమువలె క్షమాశీలుడై యుండవలెను. శుకుడు, యేసుక్రీస్తు మున్నగువారి క్షమాశీలత్వమును, సహనత్వమును అపుడపుడు తలంచుకొనుచుండవలెను.


"ధృతిః” - ధైర్యముగలిగి యుండవలెను. నిజరూపమగు ఆత్మను గూర్చి చింతించుచుండినచో, మఱియు ప్రపంచమిథ్యాత్వమును గూర్చి మననము చేయుచుండినచో మనుజునకు గొప్పధైర్యము చేకూరుచుండగలదు. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగ గంభీరుడై యుండవలెను.

'శౌచమ్' - (1) బాహ్యశౌచము (శరీర, గృహాదులశుద్ధి) (2) అభ్యంతర శౌచము (ఇంద్రియ మనంబుల శుద్ధి, అపవిత్రసంకల్పములు లేకుండుట).


‘అద్రోహః’ - ఎవరికిని ద్రోహము, బాధ కలుగజేయకుండుట, మనస్సునందును ద్రోహచింతన లేకుండుట.


"నాతిమానితాః” - తాను గొప్పపూజ్యుడనని ఎన్నడును విఱ్ఱవీగరాదు. తనను పరులు గౌరవించవలె నను అభిమానమున్ను గలిగియుండరాదు. ఇది సాధకులకు అత్యంతావశ్యకమగు సుగుణము. ఇది లేనికారణమున అనేకుల దంభ అభిమానాదులచే పతనమొందిపోయిరి.

ఆంజనేయునకు గల్గియున్నటువంటి వినయవిధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థమార్గమున సముత్తీర్ణుడుకాగలడు.

ఈ యిరువదియాఱు సుగుణములు దైవసంపత్తియందు జన్మించినవారికి కలుగుచుండును. ఇవిలేనివారు అట్టి దైవసంపదకై యత్నించి అద్దానిని పొందవలెను. మోక్షమున కీ సద్గుణములన్నియు అత్యావశ్యకములు.


ప్రశ్న:- శ్రీకృష్ణభగవానునిచే దైవగుణము లెన్ని పేర్కొనబడెను? అవి యేవి?

ఉత్తరము:- ఇరువదియాఱు. అవి క్రమముగ (1) భయరాహిత్యము (2) చిత్తశుద్ధి (3) జ్ఞానయోగస్థితి (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) శాస్త్రాధ్యయనము (8) (జ్ఞాన) తపస్సు (9) ఋజుత్వము (10) అహింస (11) సత్యము (12) క్రోధరాహిత్యము (13) త్యాగము (14) శాంతి (15) కొండెములు చెప్పకుండుట (16) భూతదయ (17) విషయలోలత్వము లేకుండుట (18) మృదుత్వము (19) సిగ్గు (20) చపలత్వము లేకుండుట (21) ప్రతిభ (బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (23) ధైర్యము (24) శుచిత్వము (25) ద్రోహబుద్ధిలేకుండుట (26) అభిమానరాహిత్యము - ఈ సద్గుణములే దైవీసంపద యనబడును.

~~~~~~~~~~

* ‘భూతేష్వలోలుప్త్వం’ - పాఠాన్తరము.

కామెంట్‌లు లేవు: