పోతన తలపులో...80
శుకమహర్షి, భాగవత పురాణ విశేషం గురించి,
శ్రీ హరి గొప్పతనం గురించీ పరీక్షిత్తుకు వివరించిన విషయాలు..
ద్వైపాయనుఁడు నాదు తండ్రి, ద్వాపరవేళ-
బ్రహ్మసమ్మితమైన భాగవతముఁ
బఠనంబు జేయించె; బ్రహ్మతత్పరుఁడనై-
యుత్తమ శ్లోకలీలోత్సవమున
నాకృష్ట చిత్తుండనై పఠించితి; నీవు-
హరి పాద భక్తుఁడ వగుటఁ జేసి
యెఱిఁగింతు వినవయ్య; యీ భాగవతమున-
విష్ణుసేవాబుద్ధి విస్తరిల్లు;
మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు;
భవభయంబు లెల్లఁ బాసిపోవు;
యోగిసంఘమునకు నుత్తమవ్రతములు
వాసుదేవనామవర్ణనములు.
నా తండ్రి వ్యాసభగవానుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్నచిత్తుడనై భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడంవల్ల దీనిని పఠించాను. నీవు శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవతతత్త్వం తెలియపరుస్తాను. మహారాజా! వినవయ్యా! భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాల మవుతుంది. మోక్షం కాంక్షించువాడికి ముక్తి లభిస్తుంది. జన్మ, మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవ నామ సంకీర్తనలే యోగిసత్తములకు ఉత్తమ వ్రతాలు.
****
హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవనేర్చునె? వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
***
విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమత మవుతుండే అవివేకి ముక్తి కెలా పోగలడు. వాడు సంసారబంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఓ రాజా! ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు. అది ముక్తిని ప్రసాదిస్తుంది.
***
"హరిమయము విశ్వ మంతయు,
హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన; వింటే.
**
కురు కులపావనుడ వైన రాజా! విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు విశ్వమయుడు. ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు.
***
బహు వర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా
క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమోఘోల్లస
న్మహనీయోజ్వల బుద్ధియై భువననిర్మాణప్రభావంబుతో
విహరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై.
***
పరీక్షిత్తు మహారాజా! పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు. అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్రచిత్తంతో నారాయణుని ప్రార్థించాడు. మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణి కోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణదక్షుడై విహరించాడు.
***
హరిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై, చిక్కి వా
సరముల్ ద్రోసెడువాఁడు; కింకరగదాసంతాడితోరస్కుఁడై
ధరణీశోత్తమ! దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వై
తరణీవహ్నిశిఖాపరంపరలచే దగ్ధుండు గాకుండునే?
ఓ రాజశ్రేష్ఠుడా! శ్రీహరిని చింతింపక మదోన్మత్త చిత్తుడై భోగలాలసుడై రోజులు గడిపేవాడికి యమభటుల గదలచేత వక్షస్థలం మొత్తించుకోవడం తప్పవు. అతడు నరకద్వారం వద్ద వైతరిణీ నదిలోని భయంకర జ్వలన జ్వాలల్లో పడి మలమల మాడిపోతాడు.
🏵️పోతన పద్యం🏵️
🏵️పరమాత్మ తత్వ ఆవిష్కరణం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి