12, అక్టోబర్ 2020, సోమవారం

రాజేంద్ర చోళుడు1

 మన మహారాజులు - 8

(రాజేంద్ర చోళుడు1)


చోళవంశంలో రాజరాజచోళుని తరువాత అంతటి శక్తిమంతుడు మొదటి రాజేంద్ర చోళుడు. రాజరాజచోళుడు మరియు తిరుభువనదేవియార్ దంపతులకు జన్మించాడు రాజేంద్రచోళుడు. మేనత్త ముత్తవ్వ సెంబియన్ మహాదేవి మేనత్త కుందవై పెంపకంలో బాల్యమంతా పాలైరాయిలో గడిపాడు. 1012లో తండ్రి పాలనలో రాజప్రతినిధిగా నియమింపబడ్డాడు.


ఆ తరువాత 1014లో అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి రాజరాజచోళుడు సంపాదించి పెట్టిన సామ్రాజ్యాన్ని పరిరక్షిస్తూ చక్కగా పాలిస్తూనే మరింత విస్తరించాడీయన. తండ్రి శ్రీలంకలోని సగభాగాన్ని జయించగా ఈయన పూర్తి శ్రీలంకంను జయించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి మలేషియా, అప్పుడు బౌద్ధ రాజ్యాలుగా ఉన్న థాయ్ లాండ్, కాంబోడియా, అలాగే సింగపూర్ మొదలైన చాలా రాజ్యాలను జయించి తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. రాజేంద్ర చోళుని వల్లనే సింగపూరు నేడు తమిళ దేశంగా చలామణీలో ఉన్నదని భావించవచ్చు.


తండ్రి వలెనే ఇతని నావికా సైన్యం మహా శక్తిమంతం. భరతఖండంలో బెంగాల్ బీహార్ కళింగ దేశాలను కూడా జయించి గంగానది దాటి వెళ్ళి మరీ అక్కడి రాజులను జయించాడు. దానికి గుర్తుగా గంగై కొండ బిరుదును పొందాడు. తన పేరుతోనే గంగై కొం చోళ పురం నగరాన్ని నిర్మించి తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయం లాగానే మరొక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాడు. ఈయన పాలనలో చోళసామ్రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది.


ఈయన చేసిన పనులలో అతిగొప్పది అంటే దేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించడం. పదహారు మైళ్ళ పొడవూ నాలుగు మైళ్ళ వెడల్పూ కలిగిన పెద్ద సరస్సును ఈయన రైతులకై నిర్మించాడు. ఇది మానవ నిర్మితమైన అతిపెద్ద సరస్సు.


ఈయన మరణానంతరం చోళసామ్రాజ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. గొప్పవారైన భారతీయ రాజుల్లో ఈయన కూడా ఒకడని చెప్పడం అతిశయోక్తి కాదు.

కామెంట్‌లు లేవు: