12, అక్టోబర్ 2020, సోమవారం

తల్లి గొప్పా ?? తండ్రి గొప్పా

 తల్లి గొప్పా ?? తండ్రి గొప్పా ???


ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. 

స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.


దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు.” అని చెప్పడం ప్రారంభించాడు...


పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగలేదు.


*అపుత్రస్య గతిర్నాస్తి*


పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే, అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి, అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.


ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగాస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్షవేసి తన అహాన్ని చల్లార్చుకోవాలి అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.


ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది.


వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.


మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు.


ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పురజనులకు ఎలా ముఖము చూపించగలను? అని విచారించి...


అయినా ఇలా అడవిలో ఉండలేను కదా! అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.


మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి, అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు.


కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.


వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో..

        

"కుమారులారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది. 


స్త్రీగా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్యపాలకులుగా తండ్రిమాట పాటించి, వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు.


ఇది చూసిన ఇంద్రుడు 'నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలి’ అని సంకల్పించి,


ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి..

"రాజకుమారులారా! ఏమిటీ వెర్రి? ఎవరో ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా ? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు? అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.


ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై..


"అమ్మా నీవు ఎవరవు ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు.


అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము, మునిద్వారా కుమారులను కనడము, పూసగ్రుచ్చినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై...


"రాజా! నేను ఇంద్రుడను, నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు, నీ మీద కోపించి, ఈ కష్టాలు నీకు కలిగించాను." అని చెప్పాడు.


దానికి ఆమె "దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా! కనుక నన్ను దయతో రక్షించు." అని వేడుకోగా...


ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో." అన్నాడు.


ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది..


ఇంద్రుడు "అదేమిటి రాజా! మిగిలిన వారు నీ కుమారులు కాదా?" అని అడిగాడు.


భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే.

వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని.

తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది.


ఇంద్రుడు సంతోషంతో "రాజా! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని.


"రాజా! నీకు ఇంకొక వరము ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను" అన్నాడు.


దానికి ఆమె "మహేంద్రా! నా కుమారులను బ్రతికించావు అదే చాలు. స్త్రీగానే ఉంటాను." అంది.


ఇంద్రుడు ఆశ్చర్యంతో "అదేమిటి రాజా! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.


స్త్రీగా ఉన్న భంగస్వనుడు "మహేంద్రా! నేను స్త్రీగా (తల్లిగా) ఉండడములో ఆనంద పడుతున్నాను.

ఈ ప్రకృతిలో తల్లిని మించి ధైవం లేదని ప్రతీక. కనుక పిల్లలకు మొదటి గురువు నేనే. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో (తండ్రి తనములో) కనబడలేదు. కనుక నేను ఇలాగే ఉండిపోతాను." అంది.


దేవేంద్రుడు నవ్వి మాలాంటి దేవతలకు కూడ తల్లి విలువ చక్కగ చెప్పావు. “అలాగే అగుగాక” అని ఆశీర్వదించాడు.


అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం!” అని అడిగాడు.


స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.


ఒకతెకు జగములు వణకున్ అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ము గ్గురాండ్రు కలిసిన సుగుణాకరా పట్టపగలె చుక్కలు రాలున్


ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి.

ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి.

ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి.

అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము...


                  🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

కామెంట్‌లు లేవు: