ఆదిపర్వము – 47
ఖాండవ వన దహనం
ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో ” బావా ! ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా ” అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు ” అయ్యా ! బాగా ఆకలి వేస్తుంది. తమరు భోజనం పెట్టగలరా ? ” అడిగాడు. అందుకు వారు ” విప్రోత్తమా !మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము ” అన్నారు. అగ్ని దేవుడు నిజస్వరూపం చూపి ” కృష్ణార్జునులారా ! నేను అగ్ని దేవుడిని. నేను ఖాండవ వనాన్ని దహించాలి. అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను ” అని అన్నాడు. అర్జునుడు అగ్ని దేవునితో ” అయ్యా నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది” అని అడిగాడు
అందుకు అగ్ని దేవుడు అర్జునునితో ” శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్ర యాగం చేయ సంకల్పించాడు. అంత దీర్గ కాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా నేను నూరు సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్ర యాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి ” అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు ” శ్వేతకీ! యజ్ఞాలు చేయవలసిన భాధ్యత బ్రాహ్మణులది. అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో యజ్ఞం చేసి అగ్ని దేవుని తృప్తిపరచుము ” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.
ఆ ప్రకారం శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్ర యాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మ దేవుడు చెప్పాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను ” అన్నాడు. అర్జునుడూ ” అగ్నిదేవా ! నీకు నెను సహాయము చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా ! నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు ” అన్నాడు.
అగ్ని దేవుడు ” అర్జునా ! నీకు ఆ చి౦త వలదు . నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను ” అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అగ్నిదేవుడు ” వరుణదేవా ! నీకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునినికి ఇచ్చి, చక్రాన్ని, గధని శ్రీ కృష్ణునికి ఇవ్వు” అన్నాడు. వరుణుడు గాండీవమనే ధనస్సును, అక్షయ తుణీరాన్ని, కపిద్వజంతో కూడిన రధాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గధను శ్రీ కృష్ణునికి ఇచ్చాడు. ఆ అయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవ వన్నాన్ని దహించడం మొదలు పెట్టాడు.
కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వన రక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాడవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన ఆశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహినీ మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి ” దేవేంద్రా! వీరు నరనారాయణులు వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు” అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు.
నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అర్జునిని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, మంద పాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు ” మహాత్మా ! మంద పాలుడు ఎవరు. వారు ఎలా తప్పించుకున్నారు ” అని అడిగాడు. పూర్వం మంద పాలుడనే మహా ముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేక పోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా ఖాండవ వనంలో ఉన్నాడు.
అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు మంద పాలుడు తన
కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్ధించాడు. అందుకు అగ్ని దేవుడు అంగీకరించాడు. మంద పాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు ” తండ్రీ ! కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి. ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా ” మంద పాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరి పోయింది. శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్ధించాయి. అది విన్న అగ్ని దేవుడు వారు మంద పాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదలి వేసాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మంద పాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్ని దేవుడు నిర్విఘ్నంగా ఖాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్ర ప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేసాడు.
ఇంతటితో ఆదిపర్వము పూర్తయింది. (ఆదిపర్వము 8 ఆశ్వాసాలు)
కృష్ణార్పణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి