చమత్కారం సంస్కారం
దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారు ప్రముఖ సంస్కృత పండితులు. వారొకసారి విజ య వాడ నుండి బందరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏమీ తోచక రైలాగితే పక్కన కూర్చున్న ఆయన్ని స్టేషను పేరేమిటండీ అనడిగారు.
దానికాయన తరిగొప్పుల అని జవాబిచ్చేరు. మళ్ళీ రైలు వెడుతూ ఉంటే, తర్వాతి స్టేషనేమిటని శాస్త్రి గారు అడిగారు. ఇందుపల్లి అని జవాబిచ్చేరాయన. ఇలా పదే పదే అడుగుతూ ఉంటే, మీకు సంస్కృతం వచ్చునాండీ అని ఆ వ్యక్తి అడిగారుట. శాస్త్రి గారు తెల్ల బోయి వచ్చునని తలూపేరుట. అప్పుడాయన ఈ క్రింది శ్లోకం చెప్పారు:
బెరానిఉత ఇందోగు నూకవప్పె చిమా: క్రమాత్
స్టేషన్సు బెజం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయ:
ఆ పెద్ద మనిఫి ఇందులో బెజవాడ నుండి బందరు వెళ్ళే దారిలో ఉన్న స్టేషన్ పేర్ల మొదటి అక్షరాలన్నీ వరుసగా కూర్చి చెప్పాడు.
బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు = గుడివాడ
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపూడి
మ = మచిలీపట్నం (బందరు)
ఈ చమత్కారానికి శాస్త్రి గారు సంతోషించేరు. అయితే, ఆయన చెప్పిన దాంట్లో రెండో పాదంలో నూక్రాస్యాత్ అంటే ఏమిటో మాత్రం శాస్త్రి గారికి అర్ధం కాలేదు. అదే , అడిగారు ఆ పెద్ద మనిషిని.
అదా, మరేం లేదండీ, నూ = నూజెళ్ళలో, క్రా = క్రాసింగు, స్యాత్ = అవుతుంది ! అని చెప్పి, శాస్త్రి గారు ఆశ్చర్యం నుండి తేరుకునే లోపలే ఆ పెద్ద మనిషి రైలాగేక, చక్కా దిగి వెళ్ళి పోయాడుట !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి