12, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీ లలితాదేవి



తిరుమెయిచూర్ లో శ్రీ లలితాదేవి అమ్మవారి అన్నవడై సేవ ముందు ఉన్నది నెయ్యి, అందులో అమ్మవారి ప్రతిబింబం కనపడుతుంది గమనించారా ? అలా కనిపిస్తోంది అంటే అమ్మవారి అనుగ్రహము కలిగినట్లే, మనం స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి ఈ సేవ గమనించిన ఇంత స్పష్టంగా దర్శించుకోగలమా ? మనసు ఆనందంతో పరవశిస్తోంది.అంతా అమ్మ దయ కాకుంటే మరేమిటి...


అంతేకాదు ఆ నేతిలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతము భార్య భర్తల మధ్య స్పర్థలు రాకుండా ఉంటాయి అని అమ్మవారి వాక్కుగా చెబుతారు.మరిన్ని విశేషాలు కలిగిన ఈ అద్భుతమైన ఆలయం గురించి పూర్తిగా చదవండి.


అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం, లాలిత సహస్రనామ స్తోత్ర పారాయణకు అత్యంత శ్రేష్ఠమైన ప్రదేశం కూడా ఇదే, జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా పారాయణ చేయాలని ఎంతోమంది భక్తులు తపించిపోతుంటారు, ఇప్పుడు మనకు కూడా అదే కోరిక కలుగుతోంది కదూ ...


*మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం*


పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా జగన్మాత పార్వతీదేవి లలితాంబికగా ఆవిర్భవించిన దివ్యక్షేత్రం తిరుమీయచూర్‌ ఆలయం. ఇది తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలో ఉంది.


*ఉగ్రరూపిణి నుంచి శాంత మూర్తిగా*


పాండాసురుడనే రాక్షసుడు రుషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు. దీంతో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆసీనురాలై లలితాంబిక నామధేయంతో ఆవిర్భవించింది. పాండాసురునితో భీకరంగా పోరుచేసి అతన్ని సంహరించింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. లయకారకుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సుచేసి ప్రశాంతంగా.. అత్యంత దయామయురాలిగా మారింది. అనంతరం వాక్‌దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజచేయమని కోరింది. ఈ సహస్రనామాలనే నేడు లలితాస్తోత్రంగా పిలుస్తున్నాం.


*అభయహస్తంలో అమ్మవారు*


పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు. జగన్మాత శ్రీచక్ర రాజ సింహసనంపై అభయహస్తంతో భక్తులను ఆశీర్వచనాలు అందిస్తోంది. తమిళ మాసమైన చితిరాయ్‌( ఏప్రిల్‌ -మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి. ఆలయ ప్రాశస్త్యం గురించి నయనార్‌.. తిరుజ్ఞాన సంబందనార్‌ తన పద్యాల్లో రాశారు. ఆయుస్సు పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 60, 80వ జన్మదినాలను స్వామి సన్నిధిలో చేయడం ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.


*అన్న ప్రసాదం*


ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతని సోదరుడు అరుణ.. వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనీశ్వరులు పూజలు నిర్వహించారు. ఆయుస్సు కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. భగవంతుడికి నైవేద్యంగా పెట్టే అన్నాన్ని భగవంతుని చరణాల ముందు పెట్టి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తులను చేస్తుందని భక్తుల నమ్మకం. సూర్యున్ని పరమేశ్వరుడు శాపం నుంచి ఇక్కడే విముక్తి చేశాడు.


*శుఖ బ్రహ్మదేవిగా*


జగన్మాత లలితాంబికను సౌందర్యనాయకిగా కొలుస్తారు. ఇక్కడ వెలసిన దుర్గమ్మవారికి ఎనిమిది చేతులుండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు. ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మరిన్ని ఉపాలయాలను చూడవచ్చు.


*లలితా సహస్రనామావళి* 


లలితాంబికకు హయగ్రీవుడు భక్తుడు. లలితా సహస్రనామాల గురించి అగస్త్యునికి వివరిస్తాడు. యావత్‌ విశ్వంలో ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడగగా తిరుమీయచూర్‌ అని హయగ్రీవుడు వెల్లడిస్తాడు. దీంతో అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకొని లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలు జపిస్తాడు. దీంతో సంతోషించిన అమ్మవారు వారి ముందు నవరత్నాలు పొదిగిన హారం ధరించి ప్రత్యక్షమైనట్టు స్థలపురాణం చెబుతోంది. అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి.


*ఇలా చేరుకోవచ్చు*


తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరువరూర్‌కు 25 కి.మీ.దూరంలో ఉంది. సమీప రైల్వేస్టేషన్‌ పేరళంలో దిగి వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుచ్చిరా పల్లి. చెన్నై ఎగ్మూర్ నుంచి కరైకాల్‌ వరకు వెళ్లే రైళ్లు పేరళం స్టేషన్లో ఆగుతాయి.


 *శ్రీ మాత్రే నమః* 👇👇

కామెంట్‌లు లేవు: