12, అక్టోబర్ 2020, సోమవారం

చిన్న వెండి చెంబు.

 చిన్న వెండి చెంబు..


"స్వామివారి అభిషేకానికి అన్ని వస్తువులూ సమకూరాయా?" అంటూ మా అర్చకస్వాములు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు..


ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ద్వారాలు అర్చకస్వాములు తెరుస్తారు..ఆ తరువాత స్వామివారి సమాధి మందిరం శుభ్రం చేసుకుంటారు..స్వామివారి ఉత్సవ విగ్రహం ప్రక్కనే పళ్లెం లో ఉన్న గణపతికి ప్రధమ పూజ చేసి..అక్కడే ఉన్న శివలింగానికి ఏక రుద్రం తో అభిషేకము నిర్వహిస్తారు..ఆ తరువాత స్వామివారి పాదుకులను తలపై పెట్టుకొని..మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేసి..ఆ పాదుకులను యథా స్థానానికి చేర్చి..ఆ తరువాత స్వామివారి సమాధికి అభిషేకము నిర్వహిస్తారు..అభిషేకము నిర్వహించే క్రమం లో స్వామివారి సమాధి ని పాలతో కూడా అభిషేకించడం ఆనవాయితీ గా వస్తున్న ఆచారం..అభిషేకానికి ఉపయోగించే పాల కొరకు ఇత్తడి తో చేసిన చిన్న చెంబును ఉపయోగిస్తున్నారు..


రెండువారాల క్రితం ఆదివారం ఉదయం స్వామివారి సమాధి అభిషేకము కొరకు అర్చకస్వాములు సమాయత్తంగా ఉన్న సమయంలో.."స్వామివారి అభిషేకానికి ఉపయోగించే పాల చెంబు వెండి తో తయారు చేయించి పెడదాము..ఈ ఇత్తడి చెంబు బాగా పాతదై పోయింది..అలాగే నీళ్ల బిందె , సమాధిని అభిషేకించిన నీటిని నిల్వచేసే ఇత్తడి పళ్ళెము..అన్నింటినీ వెండివి సమకూర్చుకుందాము.." అని అన్నాను.."అలాగే నయ్యా..మాకూ ఆ ఆలోచన వచ్చింది.. కానీ..మీతో చెప్పుకోవడానికి సందేహించాము..ముందుగా ఈ పాల చెంబు మారుద్దాము.." అన్నారు..అలాగే అని ఆ తరువాత కార్యక్రమాల లో మునిగిపోయాము..


ఆరోజు మధ్యాహ్నం తరువాత..మళ్లీ పాల చెంబు గురించి మనసులో మెదిలింది..నిజానికి స్వామివారి వద్దకు వచ్చే భక్తులలో ఎవరిని అడిగినా తీసుకొచ్చి ఇస్తారు..ఎందుకనో నేను ఎవ్వరినీ అడగలేదు..లోలోపల రెండు మూడు సార్లు అనుకున్నాను..ఆరోజు సాయంత్రం మా దంపతులము స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చిన తరువాత..మళ్లీ ఆ పాల చెంబు గుర్తుకు వచ్చింది.."వచ్చేవారం మన దగ్గర అర్చకుడిగా ఉన్న రామబ్రహ్మాచారి కి చెపుదాము..ఆ తరువాతి వారానికి అతను తయారు చేయించి తీసుకొస్తాడు.." అని మా ఆవిడ నాతో చెప్పింది..నిజమే..రామబ్రహ్మాచారి స్వర్ణకారుడు కనుక..తయారు చేయించి తెస్తాడు..అని నేనూ సమాధాన పడ్డాను.


మొన్న శనివారం సాయంత్రం స్వామివారి పల్లకీసేవ ఏర్పాట్లలో వున్నాము..దూరప్రాంతం నుంచి వచ్చిన కొందరు భక్తుల తో మాట్లాడుతూ వున్నాను..వాళ్ళందరి వెనకాల ఒక యువకుడు, అతని భార్యా, తల్లిదండ్రులు నిలబడి వున్నారు..అతను నాకు తెలుసు..హైదరాబాద్ లో మేస్త్రీ గా ఇళ్ళు కట్టే పనిలో ఉంటాడు..ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వస్తూవుంటాడు..నాతో ఏదో మాట్లాడాలని నిలబడి ఉన్నాడు..అతని పేరు మందయ్య.. గుడ్లూరు మండలం తెట్టు గ్రామ నివాసి.


అతనిని దగ్గరకు రమ్మన్నాను.."అయ్యగారూ..మీతో ఒక విషయం చెప్పుకోవాలి.." అన్నాడు..అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.."పోయిన వారం స్వామి నాకు కలలో కనబడ్డాడయ్యా..సత్యప్రమాణం గా చెపుతున్నానయ్యా..స్వామి కల్లో కనబడి.."వెండి చెంబు " తీసుకొని నా దగ్గరకు రా..అని చెప్పాడయ్యా..ఆ తరువాత మెలుకువ వచ్చింది.. స్వామి స్వయంగా చెప్పిన తరువాత ఆలస్యం చేయకూడదని..నిన్న బజారు కెళ్ళి చిన్న వెండి చెంబు కొన్నాను.. మా దంపతులము స్వామికి ముడుపు కట్టుకున్నామయ్యా..అందులో లెక్కబెడితే పదిహేడువేలు ఉన్నాయి..బజారు కెళ్ళి చెంబు ఖరీదు విచారిస్తే..సరిగ్గా పదిహేడు వేలు అన్నారయ్యా..ఒక్క పైసా కూడా ఎక్కువ తక్కువ కాలేదు..స్వామి ముడుపు స్వామికి చెల్లించినట్లు అయింది..ఈ చెంబు స్వామివారికి ఇద్దామని అనుకోని..వెంటనే బయలుదేరి వచ్చాము.." అంటూ..సంచీ లోంచి..వెండి చెంబు ను తీసి..నా ముందు బల్ల మీద పెట్టాడు..సరిగ్గా మేము అనుకుంటున్న పరిమాణం లోనే ఉంది..


ఆ వెండి చెంబు కోసం మేము మరో వారం పాటు ఆగుదామని అనుకున్నాము..కానీ..స్వామివారు ఆగలేదు..ఆ చిన్న వెండి చెంబు ఇంకొక ధనవంతుడైన భక్తుడి చేత తెప్పించడమో..లేదా..మేమే తయారు చేయించడమో పెద్ద విషయం కాదు..కానీ..తననే త్రికరణ శుద్ధిగా నమ్మిన ఒక భక్తుడికి..స్వామివారే స్వయంగా అవకాశం కల్పించారు..అతను తనకోసం ఎత్తిపెట్టిన ధనం లోనుంచే తనకు కావాల్సిన వస్తువు తీసుకున్నారు..


 ఆ ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి వద్ద అభిషేకము కొరకు ఈ వెండి చెంబు లోని పాలతో చేసాము..మందయ్య భక్తిగా స్వామివారికి తన తలనీలాలు సమర్పించి..భార్యా పిల్లలతో కలిసి పొంగలి నైవేద్యం గా పెట్టుకొని..స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నాడు.."నువ్వు తెచ్చిన చెంబుతోనే ఈరోజు పాలు స్వామివారి కి అభిషేకము చేసాము.." అని మా అర్చకస్వాములు అతనికి చెప్పారు..


ఒక చిన్న వెండి చెంబు మాకు పెద్ద పాఠాన్ని నేర్పింది..స్వామివారి సేవ చేయడం వరకే మావంతు..అది కూడా ప్రతిక్షణం "నేను కర్తను కాను.." అనే స్పృహ తోనే చేయాలి..ఏమాత్రం అహంకరించినా..తగిన పాఠాన్ని స్వామివారు సున్నితంగా నేర్పుతారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: