12, అక్టోబర్ 2020, సోమవారం

పక్షితీర్థం

 👆🚩పక్షితీర్థం తమిళనాడు కు చెందిన ఒక పుణ్యక్షేత్రం.🚩

 

🕉️🔔🕉️🔔🕉️🔔


 పక్షితీర్థం చెంగల్పట్టు నందు కలదు. ఇక్కడ గల కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.


కృత యుగములో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇక్కడ వెలసిన కొండపై తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాల న్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించ మన్నాడు. ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షాల చొప్పున ప్రతి రోజూ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు.ఆ తరువాత జన్మమున మోక్షం పొందగలరని చెప్పి అదృశ్యం అయ్యాడు.


అలా శంకరునిచే ఆజ్ఞాపించబడిన పక్షులే కృతయుగంలో పూష విధాతల పేరుగల పక్షులయ్యాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి ఈ కొండపైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతుంది. 


యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం ఈ విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని నేతిని తాగేసి పోతుంటాయి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.


పైన చెప్పుకున్న పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం "పక్షితీర్థం"గా ప్రసిద్ధిగాంచింది. 


ఈ పక్షితీర్థం చెన్నయ్ నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు "తిరుక్కుర కుండ్రం". ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ప్రాంగణంలోపల పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది. 


ఈ ఆలయంలోని స్వామి పేరు "భక్తవత్సలేశ్వరుడు", అమ్మవారి పేరు "త్రిపురసుందరి". ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి తరించాల్సిందే. అదలా ఉంచితే... మహాబలిపురం సందర్శించేవారుగానీ, చెంగల్పట్టు నుంచి నేరుగా వచ్చేవారుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ పక్షితీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది. 


పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. కాగా.. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా స్థానికులు కొలుస్తుంటారు. 


వేదగిరిపైన వేదగిరీశ్వరాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయాన్ని పదిగంటల తరువాత తెరుస్తారు. ఇక్కడి స్వామివారికి, అమ్మవారికి నిత్యపూజలు అయిన తరువాతే అర్చకుడు ప్రసాదాన్ని బిందె నిండా నింపుకుని గుడికి ఆనుకుని ఉండే దడికి అవతల కూర్చుని, పై నుంచి వచ్చే రెండు పక్షులకూ ప్రసాదాన్ని ఇచ్చే దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, భక్తులు దడికి అవతల నిలబడి తదేకంగా చూస్తూంటారు. పక్షులు ప్రసాదాన్ని తిని వెళ్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసిన వారు దేవుడి మహిమవల్లనే ఇలా జరుగుతోందంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు.

🙏🙏🙏🐦🐦🐦

కామెంట్‌లు లేవు: