🤔చచ్చిన పెళ్ళాం వచ్చింది😀
ఆ. 'ఓటు' వేయదలచి యొంటిగా నొక్కండు
చేరె 'బూతు' కడకు చీటి తోడ
లిష్టు ననుసరించి యిష్టమౌ వారికి
వేసె 'ఓటు' నతడు విడువ కుండ
ఆ. అంత నాత డడిగె నధికారి నటగాంచి
"వచ్చెనా? యిటకును భార్య" యనుచు,
అంత లిస్టు చూచి యధికారి యనియెను
పావుగంట ముందు వచ్చె నంచు.
ఆ. "పెద్దవాళ్ళు మీరు యిద్దఱు రాకుండ
భార్య నేల ముందు పంపినావు?
పాప మామె వచ్చి బహు శ్రమ కోర్చియున్
ఓటు వేసె నప్పు డొంటరిగను
క. ఇద్దఱు సతతము బ్రతుకున
నొద్దికతో నుండకుండ నొంటరి నుంటన్
పెద్దయ్యా ! యిది న్యాయమె !
పెద్దామెను చూడు మింక ప్రియ మారంగన్ "
క. అధికారి మాట లన్నియు
యెద తాకగ పెద్దమనిషి యేడ్చియు మదిలో
సదమల పత్నిని తలచియు
వ్యధ చెందుచు నిట్టు లనియె నాతని తోడన్
ఆ. "పత్ని నన్ను వీడి పదునైదు యేండ్లయ్యె
కలసి వత్తు మెట్లు కార్యములకు?
ఓటు వేయుటకును నొక్కతే యాయమ
దిగియు వచ్చు చుండు దివము నుండి
ఆ. పత్ని యామె వచ్చు ప్రతి యెన్నికలయందు
ఓటు వేయుటకును నీటు గాను,
ముందుగానె వచ్చు తొందర పడియును
కలియ దామె నన్ను కర్మ మేమొ!
ఆ. ఎదురు చూచు చుందు నెప్పుడు న్నామెకై
వేయికండ్లతోడ విసుగు లేక
యెపుడు వచ్చు నామె యెప్పుడు పోవునో
యెన్ని సార్లు కూడ యెఱుగ నైతి"
ఆ. వేదనమున వ్యక్తి వివరించ నారీతి
వినియు నా యధిపతి విస్తుపోయి
"చచ్చినామె యెట్లు వచ్చెను ఓటేయ ?"
ననియు మదన పడియె మనము నందు.
తే. "చచ్చినామెకు బదులుగా వచ్చి యెవరొ
ఓటు వేయుచు నుండిరి దీటు గాను,
ప్రభుత యుండిన నీరీతి ప్రజల కెట్లు
ఒనరు న్యాయమైనటువంటి ఓటు హక్కు?"
తే. తలచి యారీతి యధికారి త్రపను పొంది
మిన్నగా నెంచి భవితను మిన్నకుండె
"చచ్చి నట్టియు తన పత్ని వచ్చు రీతి''
తలచి నవ్వుచు యింటికి తరలె నరుడు
సమాప్తము
కథానిక రచన
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి