🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 71*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కాళీమాతను నరేంద్రుడు అంగీకరించడాన్ని శ్రీరామకృష్ణులు ఒక అతి ముఖ్యమైన సంఘటనగా పరిగణించారు. ఎందుకు? కాళీమాత అంటే- శ్మశానం, చుట్టూ కాలుతున్న శవాలు, పిశాచాల భయానక తాండవం, నక్కల ఊళలు, విరబోసుకున్న శిరోజాలు, రక్తం ఓడుతున్న నాలుక, మానవ కపాలాలతో కూర్చబడిన హారం, చేత రక్తం స్రవించే ఖడ్గం, నరకబడిన శిరస్సు, శివుని ఛాతీ మీద నిలబడిన భంగిమ ఇదే ఆమె ఆకారం! జీవితపు మరో ప్రక్క చూపించే ప్రతీకగా విలసిల్లుతున్నదామె.
సుఖం, హాయి, మాధుర్యం, అందం, ఆనందాల కలయిక మాత్రమే జీవితం కాదు. జీవితానికి మరొక వైపు కూడా ఉంది. దుఃఖం, శోకం, చెడు, ఘోరం, ఏడ్పులతో నిండినదది. అది ఎక్కణ్ణుండి వచ్చింది? స్వామి వివేకానంద మాట లోనే దానిని విందాం:
"చెడు ఎందుకున్నది? దేవుడు మంచి చెడులు రెండింటికీ కారకుడని చెప్పడంలోనే ఈ ప్రశ్నకు జవాబు ఉంది..... దేవుడు సర్వదా మంగళస్వరూపుడే అయితే ఈ మంచి చెడులన్నింటికి ఎవరు బాధ్యులు? సైతాన్ అనే పెద్దమనిషి ఒకడున్నాడని క్రైస్తవులు, మహమ్మదీయులు అంటారు. ఇద్దరు (దైవాలు) పని చేస్తున్నారని మీరెలా చెప్పగలరు? ఉన్న దొక్కరే అయివుండాలి....
తాకితే పిల్ల వాని వేళ్లను కాల్చివేసే అగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది. అగ్ని మంచిదనిగాని, చెడుదనిగాని ఎలా చెప్పగలరు? అగ్నిని సృష్టించిన వారిద్దరు వేర్వేరని ఎలా చెప్ప గలరు? అశుభమనే దాన్నంతా సృష్టించిన వారెవరు? దేవుడే. ఇంతకు మించి సమాధానం లేదు! మృత్యువును, జీవనాన్ని, ప్లేగును, అంటువ్యాధులను సమస్త్రాన్ని ఆయనే పంపుతాడు. దేవుడు అలాంటివాడే అయితే అతడు మంగళ కరుడు - అమంగళకరుడు; అతడు సౌందర్యరూపుడు - వికారుడు; అతడు జీవం - మృత్యువు కూడా.
ఇలాంటి దేవుణ్ణి ఉపాసించడం ఎలా?
భీషణస్వరూపుణ్ణి ఆత్మ నిజంగా ఎలా ఉపాసించ నేర్చుకోగలదో మనం తెలుసుకొందాం; అప్పుడా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకు శాంతి ఉందా? ఆందోళనల నుండి మీరు ముక్తులా? ఇలా తిరిగి ముందు భీకరమైన మూర్తిని చూడండి, పైముసుగును తొలగించి ఇప్పుడు దేవుణ్ణి చూడండి. అతడు సగుణుడు. శుభం, అశుభం అంతా అతడే. మరొక రెవ్వరూ లేరు."
ఈ సత్యాన్ని ఆ రోజు నరేంద్రుడు కనుగొన్నాడు. జీవితం గురించిన అతడి దృక్పథాన్ని, భగవంతుని గురించిన అతడి దృక్పథాన్ని ఈ సత్యం పరిపూర్ణం గావించింది. కాలాంతరంలో జగద్గురువుగా విరాజిల్లనున్న ఆతడి దృష్టి పరిపూర్ణతని సంతరించుకొంది. అందుకే శ్రీరామకృష్ణులు అంతగా సంతోషించారు. తమ కార్యం పూర్తయిందనే భావన బహుశా ఆయన మనస్సులో మెరసివుండ
వచ్చు. "శ్రీరామకృష్ణ పరమహంస నన్ను కాళీమాతకు అప్పగించారు. దీన్లో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ తరువాత ఆయన రెండు సంవత్సరాలే జీవించారు.
ఆ రెండు సంవత్సరాలూ కూడా శారీరక రుగ్మతతో ఎంతో బాధపడుతూ గడిపారు. ఈ సంఘటనానంతరం ఆరు నెలలు కూడా ఆయన పూర్ణ ఆరోగ్యంతో జీవించలేదు" అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.
ఈ విధంగా దుఃఖమనే ఒక తరంగం ఉవ్వెత్తున లేచి నరేంద్రుణ్ణి పరిపూర్ణవ్యక్తిగా తీర్చిదిద్దింది; జీవితాన్ని యథాతథంగా స్వీకరించేటట్లు చేసింది.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి