10, అక్టోబర్ 2020, శనివారం

మహాభారతం 107 -విరాట పర్వము 1

 **దశిక రాము**


**


అజ్ఞాతవాసం


పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాత వాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా ! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నము గా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా ! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టు కొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరువాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాత వాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణు లందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.


పాండవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించు కొనుట

ధర్మరాజు తమ్ములను చూసి " మనం అయిదుగురం ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా! మనకు యమ ధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా ! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురు దేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం " అన్నాడు. ధర్మరాజు " నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు " అన్నాడు.

 

అర్జునా " నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జ్యూద ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును జ్యూదముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు భీమసేనుని చూసి " భీమసేనా ! బకాసుర, కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా. వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా. అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికి వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు అర్జునుని చూసి " అర్జునా ! నీ సంగతి ఏమిటి నీవు ఎలాంటి కొలువు చేస్తావు " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వసి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాత వాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాపవిమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం కలదు. నేను అంతఃపురకాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంత॰పుఅరంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను " అని అన్నాడు. 


తరువాత నకులుని చూసి " ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు ఇతడు తన నిజ రూపమును ఎటుల దాచగలడు. ఒరులను ఎలా సేవించ గలడు " అన్నాడు. నకులుడు " అన్నయ్యా ! నాకు అశ్వ శిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వ శిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. ధామగ్రంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి " సహదేవుని వైపు చూసాడు. సహదేవుడు " అన్నయ్యా ! నాకు పశు పోషణలో అనుభవం ఉంది. తంత్రీ పాలుడనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వం ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని చూసి " సుకుమారీ ! ఇంత వరకు పనులు చేయించు కున్నది కాని ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్తచిత్త ఏ పని చేయగలదు " అని మనసులో బాధపడ్డాడు. అది గ్రహించిన ద్రౌపది " నేను సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను. విరాటరాజు భార్య సుధేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరంధ్రీ వ్రతం సాగిస్తాను " అన్నది. అందరికి అన్ని పనులు కుదిరాయి. మనం అందరం అజ్ఞాత వాసాన్ని నిరపాయంగా గడుపుదాం. ధౌమ్యుల వారు అగ్ని హోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి " అని ధర్మరాజు ఆదేశించాడు.


రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు


ధౌమ్యుడు పాండవులను చూసి " ధర్మరాజా ! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది. రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకో కూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించ కూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగి పోకూడదు. అలాగే అవమానిస్తే కుంగి పోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగ కూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది. కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది " అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: