10, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్.128

 

..

పంచవటీ తట సుస్థిత రాముడు ఆనందముగా కాలము వెళ్ళ దీస్తున్నాడు.

రోజులు,వారాలు గడుస్తున్నాయి, ,

నెలలు మారుతున్నాయి, 

ఋతువులు దొర్లుతున్నాయి.

రాముడికి ఇష్టమైన హేమంతం రానే వచ్చింది .

ప్రకృతి రామణీయకత మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నది.

..

ఒకనాటి రాత్రి గడిచి తెల్లవారింది స్నానానికి గోదావరీ తీరానికి వెళ్ళాడు రాముడు ఆయన వెంట సీత ,చేతిలో కలశముతో లక్ష్మణుడు కూడా వెళ్ళారు.

.

మంచు పడుతూ ఉన్నది శరీరాలు బిరుసేక్కిపోయి వేడి

పుట్టించే అగ్నికోసం వెతుక్కునేకాలమది.నీళ్ళు ముట్టుకుంటే చేతులు జిల్లుమంటున్నాయి.

.

సూర్యుడు ఎక్కువగా దక్షిణ దిక్కునే ఉంటున్నాడు ,ఉత్తరదిక్కు తిలకము లేని స్త్రీ వలె ప్రకాశించటం లేదు.

.

 జనమంతా సూర్యోదయముకోసము ఆయన కిరణ స్పర్స కోసము ఎదురు చూస్తున్నారు.,నీడలు,నీళ్ళు భరించ లేక పోతున్నారు.

.

పడమర దిక్కునుండి చల్లటి గాలులు వీస్తున్నాయి. వరిచేలు బంగారు రంగును సంతరించుకొన్నాయి.

.

ఎండా కాస్త ఎర్రగా కాస్త తెల్లగా ఉన్నది ,పచ్చిక బయళ్ళమీద మంచు బిందువులు పడి సూర్యకాంతికి ప్రతిఫలించి వజ్రాల రాసుల లాగా మెరుస్తున్నాయి.

.

ఏనుగులకు దాహం వేసి నీటి దగ్గరకు వెళ్లి తొండము నీటికి ఆనించి మరల వెనుకకు లాగుకుంటున్నాయి.

పిరికివాడు ఏవిధంగా యుద్ధరంగానికి దూరంగా ఉంటాడో ఆవిధంగా నీటిపక్షులు నదిలోకి వెళ్ళకుండా దూరంగా ఒడ్డునే కాలక్షేపం చేస్తున్నాయి.

.

ప్రకృతి సొగసులు చూస్తూ అడుగులు వేస్తున్నాడు రాముడు.

.

 ఆ సమయములోలక్ష్మణుడికి భరతుడు గుర్తుకు వచ్చాడు.ఇంత తెల్లవారు ఝామున ఈ చలిలో భరతుడు స్నానమెలా చేస్తున్నాడో గదా ! 

అతడు సుకుమారుడు ,సుఖాలకు అలవాటు పడ్డవాడు ,నీవు అడవులకు వచ్చావు నిన్ను అనుసరిస్తూ ఆయన అక్కడ నియమ నిష్టలతో తాపస జీవనం గడుపుతున్నాడు ,

.

మానవులు తండ్రి స్వభావాన్ని అనుకరించరు తల్లి స్వభావాన్ని అనుసరిస్తారు కానీ భరతుని విషయములో అలా జరుగలేదు ,తల్లి స్వభావాన్ని అనుకరించలేదు.

.

అక్కడ భరతుడు ఇక్కడ మనము, ఇందరి కష్టాలకు కారణమైన స్వభావము కైకమ్మకు ఎక్కడనుండి వచ్చినది? ధర్మాత్ముడైన భర్త ,ఋజువర్తనుడు అయిన కొడుకు కలిగిన స్త్రీ అలా ఎందుకు ప్రవర్తించిందో గదా !

.

వింటూ నడుస్తున్న రాముడు తల్లి నింద చెవుల పడేసరికి సహించ లేక పోయాడు, నాయనా లక్ష్మణా! ఎట్టిపరిస్థితిలోను మన మధ్యమాంబను నిందిస్తూ నీవు ఒక్క మాట కూడా మాట్లాడ వద్దు ,భరతుడిగురించి చెప్పు చాలా ఆనందముగా ఉన్నది నాకు అని అన్నాడు.మన నలుగురమూ కలిసి హాయిగా మళ్ళా ఎప్పుడోకదా ఉండేది అని అంటూ నదిని సమీపించాడు.

.

 NB

.

భద్రాచలము వద్ద గోదావరి చాలా అందముగా ఉంటుంది ఒడ్డుమీద రామయ్య గుడి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఒకప్పుడు. చల్లని గాలులు వీస్తూ ఉంటే రామయ్య దర్శనము చేసుకొని గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతతో ! 

కానీ ఇప్పుడేమయ్యింది ! పేపరుమిల్లు మీదనుండి వచ్చే దుర్గంధాన్ని గాలి మోసుకు వచ్చి ముక్కు పుటాలు బద్దలు చేస్తుంది.గోదావరి నీళ్ళు ఆ ఫ్యాక్టరీ వ్యర్ధాలతో కలుషితమయ్యాయి.

.

ఫ్యాక్టరీ కాస్త దూరంగా కట్టి ఉంటే బాగుండేది

.


రామాయణమ్ 129

..............

గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకొని సుఖంగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు .

.

అప్పుడు.

ఒక ముసలి రాక్షస స్త్రీ ,అక్కడకు వచ్చి దగ్గరగా రాముడిని చూసింది .

.

నయనమనోహరంగా కనబడ్డాడు రాముడు దానికి ,విశాలమైన వక్షస్థలం,బలిష్ఠమైన బాహువులు,విచ్చిన తామరపూవుల వంటి కన్నులు ,నల్లకలువ వంటి శరీర ఛాయ ,మన్మధునివంటి సౌందర్యముతో మహేన్ద్రుడిలాగా ఠీవిగా ఉన్నాడు రాముడు.

.

రాముడిని చూడగానే దాని మనస్సును మన్మధబాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి.

.

రాముడి ముఖము చాలా అందముగా ఉన్నది,

దాని ముఖము వికృతము!

.

రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది దానిది బాన పొట్ట .

.

ఆయన నేత్రాలు విశాలము ,

దాని నేత్రాలు వికారము!

.

ఆయనది నల్లని జుట్టు

,దానిది రాగి జుట్టు

.

చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే రూపము ఆయనది,

దానిది భయంకరమైన రూపము.

.

ఆయన కంఠ ధ్వని మధురము ,

దాని పలుకులు కర్ణ కఠోరమైనవి.

.

ఆయన నవయవ్వనుడు

 ఆవిడ వృద్ధురాలు

.

ఆవిడ పేరు శూర్పణఖ ఆవిడ రావణుడి చెల్లెలు! . 

.

రాముడిని సమీపించి రాముడితో ఎవరు నీవు? భార్యా సమేతుడవై,ధనుర్బాణాలు ధరించి ముని వేషముతో ,రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు,నీకు ఏమి పని ఇక్కడ అని పలికింది.

కామెంట్‌లు లేవు: