10, అక్టోబర్ 2020, శనివారం

మనస్సు... స్థితి గతులు.....*


మనస్సు.. శరీరములు.. అభిన్నములు. ఆత్మయే మనస్సు శరీరములను ప్రకాశింపజేస్తూ ఉండటంవల్ల మనస్సు శరీరముల అన్ని చేష్టలు కూడా సఫలములవుతాయి. మనస్సు ఏ వస్తువును వెతుకుతుందో అది తప్పక లభిస్తుంది.

మనస్సు ద్వారానే మనను మనమే పవిత్ర మార్గంలో పెట్టుకోవాలి. మనస్సు దేనికి అనుసంధానమవుతుందో కర్మేంద్రియములు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. మాలిన్యయుక్తమైన మనస్సునే చిత్తమనవచ్చు.


మనస్సు చిత్తములు ఆత్మ యొక్క క్రియా స్వరూపములే. దానికన్నా భిన్నమైనది ఏదీ లేదు. వాసనలు చిత్తము యొక్క అంశ మాత్రమే.

మనస్సు తన వినాశన క్రియను తనలోనే చేసుకొంటుంది. అన్ని దుఃఖముల నుండీ దూరము కావటానికి మూలము మనో నాశనమే. వివేకంతో శోధించటం వలన మనోనాశము అవుతుంది.

మనస్సు ఎంత శక్తిని ధారణ చెయ్యగలదనే విషయాన్ని తేలికగా స్పష్టం చెయ్యవచ్చును.

నీ మనస్సు ఒకవేళ వేరే విషయం మీద లగ్నమై ఉంటే, నీవు తినే పదార్థాల రుచి కూడా నీకు తెలియదు.


మనస్సు అన్యత్ర లగ్నమైతే నీకేమీ కనపడదు, వినపడదు. శరీరం వరకూ నిశ్చేష్టితం అవుతుంది. మనస్సు చిత్తములు రెండూ పరస్పర సాకారులు కనుక రెండూ సమానమైనవి. అయినా మనస్సు ఆ రెంటిలో ఉత్కృష్టమైనది. ఎందుకంటే మనస్సు నుంచే చిత్తము యొక్క క్రియ పుట్టినది, అంతేకాని చిత్తము నుంచి మనస్సు పుట్టలేదు సుఖమును దుఃఖమని భావించటము, దుఃఖమును సుఖమని భావించటము కేవలము మనస్సు యొక్క పని. మనస్సు దర్శించని వస్తువనేది లేదు.

గింజ నుండి వృక్షము, లత, పత్రము, పుష్పములు పుట్టినట్లు మనస్సు నుంచే జగత్తు స్వప్నము, వాసన, చింత, విలాసములు అన్నీ పుడతాయి.


నాట్యశాలలో ఒకే నటుడు నానా ప్రకారములైన వేషాలు ధరించి, నానా రకాల భావాలను ఎట్లా ప్రదర్శిస్తాడో అట్లాగే మన మనస్సు కూడా జాగ్రత్, స్వప్న రూపాలలో పుట్టి, అన్ని సమయాలలోనూ నానా రకాల ఆలోచనలు చేస్తుంది. మనస్సు స్వయంగా నిరాకారం అయినప్పటికీ ఎప్పుడూ తాత్కాలిక సాకారమైనది కావటంవలన జీవుడు ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉంటాడు.


తిలలో తైలము ఉన్నట్లు, మనస్సులో సుఖ దుఃఖములు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు తగ్గటం, అప్పుడప్పుడు పెరగటం జరుగుతుంది.

ఎవరి మనస్సు నిశ్చలము, ఒకే విషయము మీద లగ్నము కాగల శిక్షణను పొందుతుందో,

అదే పరబ్రహ్మ యొక్క ధ్యానం చెయ్యటంలో సమర్థవంతమైనది అవుతుంది.


మనో సంయమనం వలన సంసారిక విలాసాలలో శాంతి లభిస్తుంది. ఉద్వేగ రహితమైతే మనోజనం లభిస్తుంది. మనస్సును జయించిన వారికి త్రిలోక విజయం కూడా తుచ్ఛమైనది గానే అనిపిస్తుంది. మనోజయమంటే తాను తన భావంలో అంటే పూర్ణబ్రహ్మంలో స్థిరంగా ఉండటమని అర్థము. చంచలత్వము మనస్సు యొక్క రూపము, అగ్ని యొక్క ధర్మము ఉష్ణత అయినట్లు, మనస్సు యొక్క ధర్మము చంచలత.


స్పందన లేకుండా వాయువు యొక్క శక్తి అనుభవంలోనికి రానట్లు, చంచలత్వం లేకపోతే మనస్సు యొక్క ఉనికి తెలియబడదు.

చంచలత్వము లేని మనోస్థితియే మోక్షము. మనోనాశమైతే దుఃఖమునకు శాంతి లభిస్తుంది. మనస్సు యొక్క చంచలత్వమును, అవిద్యావాసనలను వాటి వివేచన ద్వారా వదిలిపెడితే మోక్షం లభిస్తుంది.


సత్, అసత్తుల మధ్యనుండేది చిన్మయత్వము. చిన్మయత్వ జడత్వముల మధ్యనున్న అవస్థను మనస్సు అని అంటారని తెలిస్తే జడత యొక్క అభ్యాసం వలన మనస్సు జడముగాను, వివేకము యొక్క అభ్యాసము వలన మనస్సు చైతన్య రూపంగాను మారిపోతాయి. భావనాయుతమైన అస్థిర మనస్సును వివేకయుతమైన మనస్సుతో ఉద్ధరించాలి. రాజు తప్ప మరెవ్వరూ ఇతర రాజును జయించలేనట్లు, మనస్సును మనస్సే తప్ప మరేదీ జయించలేదు.


ఆత్మకు ముక్తి కలగటానికి, మనస్సును జయించటం తప్ప వేరే ఉపాయం లేదు. మనస్సే కర్మఫలమును అనుభవిస్తుంది. మనస్సులోనే అనంతమైన సుఖదుఃఖములు కలుగుతాయి. శరీరంలో ఏమీ కావు. జడ శరీరము సుఖ దుఃఖములను అనుభవించలేదు. మనస్సు కర్త. అందుకే మనస్సును మానవునిగా గుర్తించాలి. మనస్సు యొక్క ఆద్యంతములు నశించిపోయేవే అయితే, దాని మధ్య భాగములను కూడా అసత్ అనే చెప్పాలి. మనస్సు యొక్క ఈ అసత్ రూపం ఎవరికి తెలియదో వారికి దుఃఖానుభవము అనివార్యము అవుతుంది. మనస్సు దేనిని చేస్తుందో అదే అవుతుంది, దేనిని చేయదో అది కానే కాదు.

ఈ విశ్వము మనోవృత్తి స్వరూపము. మనస్సే అన్ని కర్మలకు, అన్ని చేష్టలకు, అన్ని భావాలకు, అన్ని గతులకు బీజము. ఈ మనస్సు పరిత్యజించ గలిగితే, అన్ని కర్మలూ పరిత్యక్తవౌతాయి. అదే అన్ని దుఃఖాలకూ లక్ష్యం అవుతుంది.


అన్ని కర్మలకూ భయహేతువవుతుంది.

పట్టు పురుగు తాను ఉండటానికి గూడు కట్టుకొన్నట్లే మనస్సు కూడా తాను ఉండటానికి ఈ శరీరాన్ని నిర్మించుకొన్నది. పట్టుపురుగు గూడు ఆ పట్టుపురుగు కన్న వేరు కానట్లు మనస్సు శరీరాలలో తేడా లేదు. మనస్సే శరీరమునకు ఉపాదానము. అంతేకాక మనస్సులోనే అన్నీ సంభవిస్తాయి. మనస్సులో పుట్టని శక్తి అనేది ఏదీ లేదు. చిత్‌ ప్రతిబింబ స్వరూపమైన మనస్సే జీవుడై, తానే కల్పించుకొన్న భూత భవిష్యత్ వర్తమాన కాలాత్మకమైన జగత్తు యొక్క నిర్మాణ పరివర్తన వినాశములకు కర్తయై, స్వయం వ్యక్తమవుతుంది. ధాన్యంలో బియ్యం ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా బ్రహ్మలోనే ఉన్నది. ఈ జడ జగత్తును అస్తిత్వము లేదు...

కామెంట్‌లు లేవు: