10, అక్టోబర్ 2020, శనివారం

పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*14. "పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్ మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం బుత్రున్లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?*



భావము:- “నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.




*15. బాలుఁబ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా లోలుఁగృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల శ్రీలుసమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా జాలున దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.*



భావము:- నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.



*16. అనిన నారదుం డిట్లనియె.*



భావము:- అలా అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.

కామెంట్‌లు లేవు: