10, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము

✍️ గోపాలుని మధుసూదన రావు 


   ---ఆకాశరాజు వృత్తాంతము ---


ధర నారాయణవనమును 

పరిపాలనసేయుచుండె ప్రాజ్ఞతతోడన్ 

నరపతి యాకాశరాజు 

సుర భూసుర వర్గమెల్ల స్తుతియింపంగన్. 110 


సతియగు ధరణీదేవితొ 

నతులితమౌ జీవనమున యధిపతినుండన్ 

సుత సుతులును లేనందున 

సతతము వెతనొందుచుండె సంతానముకై. 111 


జనపతి యాకాశరాజు 

మనమందున సంతుగోరి మదనతొ నుండన్ 

ముని నారదు డరుదెంచియు 

ఘన సుతుకామేష్ఠి సేయ కడు బోధించెన్ 112 


ముని పలుకులు విని జనపతి 

మనమందున తోషమొంది మరుక్షణమందే 

కనకపునాగలి తోడను 

ఖననము సేయంగ ధరణి కడగెను మిగులన్ 113 


పుత్తడినాగలి తోడను 

చిత్తములో హరిని దలచి చీల్చగ ధరణిన్ 

నత్తరి నాగలికడ్డుగ 

పుత్తడి మందస మొక్కటి పొడగాంచె నిలన్ 114 


మందసమందున గాంచెను 

సందోహముతోడనొక్క సరసిజనయనన్ 

సుందరపద్మము మధ్యను 

నందంబున గూరుచుండ నాహ్లాదముగన్ 115 


పద్మజఔ యా పాపను 

సద్మమునకు దెచ్చి మిగులసంతోషమునన్ 

పద్మాక్షియైన కతమున 

'పద్మావతి ‘ నామమిచ్చి పరవశమొందెన్ 116 



దినదిన మభివృద్దొన్దుచు 

దినకరతేజంబుతోడ దివిజులు మెచ్చన్ 

ఘనముగ పెరిగిన పద్మను 

కని జనపతి మురిసిపోయె కడుమోదమునన్. 117 



పరిణయ వయసును జేరియు 

మురిపించెడు సుతను గాంచి మోదముతోడన్ 

వరరత్నమునికి దెలుపను 

సురముని శ్రీనారదుడిని చింతించె మదిన్. 118 



ఆకాశరాజు కోర్కెను 

నాకర్ణించియు మౌని యానందముతోన్ 

శ్రీకాంతు డల్లుడౌనని 

నేకాంతమునందుజెప్పె వివరించి తగన్ 119 


మునిపలుకులు విని జనపతి 

మనమున సంతోషమొందె మాటలులేకన్ 

ఘనముని దెలిపిన యల్లుడు 

తనకెప్పుడు గల్గునంచు తతహ నుండెన్ 120 


శ్రీనివాసుడు విహారమునకై వెళ్లి పద్మావతిని గలియుట 


ఒక దినమున సిరివాసుడు 

సఖులందఱగూడి చనియె సాయంవేళన్ 

వికసిత సితకుసుమంబుల 

సకలంబగు నొక్కవనికి సంతోషమునన్. 121 


ఆకాశరాజు పుత్రిక 

శ్రీకళలతొ వెల్గు పద్మ చెలికత్తెలతో 

కోకిల శుక రావంబుల 

కాకరమై నొప్పుచున్న యా వని కొచ్చెన్. 122 


లలనామణి పద్మావతి 

చెలికత్తెలతోడ గూడి చిఱునగవులతో 

పలు యాటల తా మునుగుచు 

నలుపెఱుగక దిరుగసాగె నారామమునన్ 123 


కాంతారంబున దిరిగెడి 

దంతావళ మొకటి తనదు దారిని దప్పీ 

కాంతామణులుండెడి యా 

శాంతారామంబుజేరి శాంతిని చెఱిపెన్. 124 


మదగజమప్పుడు మిక్కిలి 

రొద సేయుచు వచ్చి యటకు రోషముతోడన్ 

పదముల కదనము జేసెను 

పదపదమని భీతితోడ పాఱగ జనముల్ 125

కామెంట్‌లు లేవు: