పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఆ ప్రకారముగ పురుషోత్తముడని పరమాత్మను ఎఱుగువా డాతనిని నిర్మల భక్తితో సేవించునని వచించుచున్నారు-
యో మామేవమసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం
సర్వభావేన భారత ||
తాత్పర్యము:- ఓ అర్జునా! ఎవడు అజ్ఞానము లేనివాడై, ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుగుచున్నాడో, అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో (సర్వవిధముల) నన్ను భజించుచున్నాడు.
వ్యాఖ్య:- భగవంతునిపై భక్తి కుదరవలెననిన, వారెట్టివారో ముందుగ తెలిసి యుండవలెను. ఒక వస్తువుయొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికిని ప్రీతి జనించదు. ఒకవేళ జనించినను అపూర్ణమగు ప్రీతియే జనించును. కావున భగవానునిపై అకుంఠితభక్తి యేర్పడవలెననిన, "వారు శాశ్వతులని, ఆనందస్వరూపులని, క్షరాక్షరముల”కు అతీతులని బాగుగ గ్రహించియుండవలెను. ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పబడినది. "ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగ, క్షరాక్షరాతీతునిగ నెఱుగునో, ఆతడు పూర్ణభావముతో నన్ను భజించును" అని భగవాను డిచట తెలియజేసిరి.
"అసమ్మూఢు" డనగా, దృశ్యవస్తువులు శాశ్వతములను మూఢత్వము (అజ్ఞానము) లేనివాడని, ఆత్మయే శాశ్వతమను జ్ఞానము కలవాడని భావము.
'స సర్వవిత్’ - ప్రపంచములో ఎన్ని భౌతికవిద్యలను సంపాదించినను, ఎంతటి పాండిత్యమును బడసినను, ఎన్ని కళలను సముపార్జించినను మనుజుడు సర్వవేత్త, సర్వజ్ఞుడు కాలేడు.
"యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి'
అనునట్లు దేనిని తెలిసికొనినచో సమస్తము తెలిసికొనబడినదగునో అట్టి పరమాత్మ నెఱుగువాడే ప్రపంచమున సర్వవేత్త, సర్వజ్ఞుడు కాగల్గును. సమస్త బ్రహ్మాండములు, సమస్తవిద్యలు, శాస్త్రములు, కళలు , భగవానుని కుక్షియందే యుండుటవలన, వారి నెఱిగినచో వాని నన్నింటిని ఎఱిగినట్లేయగును. కనుకనే, "స సర్వవిత్" - అట్టివాడు ‘సర్వవేత్త', 'సర్వజ్ఞుడు' అని యిచట చెప్పబడెను.
"సర్వభావేన” -- ఆ ప్రకారము భగవానుని యథార్థస్వరూపము నెఱిగినవాడు వారిపై అచంచల భక్తిభావము గలవాడై, సర్వవిధముల వారినే భజించును, సేవించును, దృశ్యవస్తువులన్నియు నశ్వరములని తెలిసికొనినవాడు సహజముగనే శాశ్వతమగు దృగ్వస్తువైన ఆత్మనొక్కదానినే సేవించుచుండును.
"సర్వభావేన” అని చెప్పుటచే అట్టివాడు పరిపూర్ణమనస్సుతో నాతనిని భజించునని భావము. అట్టి పరిపూర్ణ భావము 'దైవముయొక్క యథార్థతత్త్వము' నెఱుగనిదే కలుగదు. కావున మొట్టమొదట పరమాత్మయొక్క విభవము, వాస్తవస్వరూపము బాగుగ తెలిసికొని యుండవలెను. మరియు ఈ ‘సర్వభావేన' అను పదముచే లోకమున సాధకులు భగవానుని యేప్రకారముగభజించవలెనో ఆ పద్ధతి తెలుపబడినట్లైనది. పూర్ణభక్తితో, అచంచల విశ్వాసముతో సేవింపవలెను. భక్తిని, భావమును విభజించరాదు. ప్రపంచ వస్తువులపై కొంత, దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది "సర్వభావము” తోటి సేవనము కానేరదు. అయితే మొట్టమొదట అట్టి "సర్వభావము” తో గూడిన భజనము సాధ్యపడకపోయినను, అభ్యాసవశమున ఎప్పటికైనను అట్టి పూర్ణభక్తిని (100% భక్తిని), (భగవానుడు తెలిపిన) "సర్వభావము”ను అందఱును పొందియే తీరవలెను.
ప్రశ్న:- భగవానుని పూర్ణమనస్సుతో ఎవరు సేవించెదరు?
ఉత్తరము:- ఎవడు అజ్ఞానరహితుడై (పైన తెలిపిన ప్రకారముగ) భగవానుని క్షరాక్షరపురుషులకంటె అతీతుడగు పురుషోత్తమునిగ నెఱుగునో అట్టివాడు పూర్ణమనస్సుతో నతనిని సేవించును, ధ్యానించును.
ప్రశ్న:- భగవంతుని యేప్రకారముగ భజించవలెను?
ఉత్తరము:- అచంచలభక్తితో, పరిపూర్ణమనస్సుతో భజించవలెను (సర్వభావేన).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి