10, అక్టోబర్ 2020, శనివారం

ఆదిపర్వము – 45

 

సుందోపసుందుల వృత్తాంతం


ఒక రోజు ఇంద్ర ప్రస్థానానికి నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి ” మహర్షీ ! మాపూర్వ జన్మ సుకృతంగా మీ దర్శనభాగ్యం లభించింది ” అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి ” మీకు అన్ని ధర్మాలు తెలుసు. మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ ఐదుగురి భార్య. ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం.


సుందోప సుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించారు. బ్రహ్మ దేవుని వద్ద వారు కామ గమనం, కామ రూపం, మరణమే రాకుడదని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు.


వర బలంతో వారు తాపసికులను, రాజులను వేధించ సాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొర పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు, కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించ వచ్చు కదా అనుకుని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగాడు. విశకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి? అని అడిగింది. బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసుందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చేయమని చెప్పాడు.


తిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కల ముఖం తిప్పటంతో అతడు అప్పటి నుండి చతుర్ముఖుడైనాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక వళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడటంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడైనాడు. తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామ మోహితులై తిలోత్తమ నాది నాది అని చెరి ఒక చేయి పట్టుకుని లాగుతూ నీకు ఎవరు కావాలి అని అడిగారు. తిలోత్తమ వారితో మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పంరం యుద్ధం చేసికొని ఇద్దరూ మరణించారు. కనుక ఎంతటి బలవంతులకూ, ధైర్యవంతులకూ స్త్రీ కారణంగా విరోధం రావచ్చు” అన్నాడు.


నారదుడు మాటలో అంతరార్ధం గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పచుకున్నారు. ద్రౌపది ఒక్కొకరి ఇంట్లో ఒక సంవత్సరం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలం మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని పొరపాటున అలా చేస్తే పన్నెండు నెలల తీర్ధ యాత్ర చేయాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పంద చేసుకున్నట్లు నడచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసినట్లు నడుచు కోసాగారు.


ఒక రోజు ఒక బ్రాహ్మణుని ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునిని వద్దకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆయుధగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధగారంలో ఉన్నాడు. అక్కడకు వెళితే నియమ భంగం ఔతుంది కానీ బ్రాహ్మణుని బాధను నివారించడం తన ధర్మమని భావించి ఆయుధగారానికి వెళ్ళి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు అర్జునుడు తీర్ధయాత్ర చేయాలని నిశ్చయించికున్నాడు. ధర్మరాజు మాత్రం వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమ భంగం జరుగలేదని చెప్పాడు. అర్జునుడు ” అన్నయ్యా !ఏదో సాకుతో ధర్మం తప్పడం భావ్యం కాదు కనుక తీర్ధయాత్ర చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి.


బ్రాహ్మణులతో పౌరాణికులతో అర్జునుడు తీర్ధయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని అన్నగారి ఆదేశంతో తీర్ధయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరడం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జునినితో ” మీ గురించి అంతా నాకు తెలుసు. ఇందు వలన వ్రత భంగం కాదు. నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. అలా జరిగితే ఎన్ని దానధర్మాలు చేసినా ఆ పాపం పోదు ” అన్నది చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుని కన్నది.


తతవాత అర్జునుడు గయ, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపురం నగరానికి వెళ్ళాడు. ఆ దేశపురాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జునినితో ” అర్జునా నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. కానీ మా వంశస్తులకు ఒక వారసుడు మాత్రం జనిస్తాడు. నాకు మాత్రం కుమార్తె జనించింది కనుక రాజ్యానికి వారసుడు లేడు. చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడుగా కావాలి. అందుకు అంగీకరిస్తే ఈ వివాహానికి అంగీకరిస్తాను ” అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బబ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుండి ద్వారకకు బయలుదేరాడు.

కామెంట్‌లు లేవు: