**దశిక రాము**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**
తొమ్మిది, పది శ్లోకాల ఉపోద్ఘాతం - మూడవ భాగం
సర్ జాన్ వుడ్రాఫ్ మహాశయుడు కిండలినీ యోగం పై *ది సర్పెంట్ పవర్* అనే పుస్తకం వ్రాశారు. ఏం జరిగింది ? సాధన ఏమీలేని, సాధన చేయాలనే అభిప్రాయం కూడా లేని పెద్దలు మూలాధారం, సహస్రారం అంటూ పుస్తకాలు వ్రాయడం మొదలు పెట్టారు. ఈ యోగాన్ని కరతలామలకం చేసికొన్నామనుకొంటున్న పెద్దలు ఏకంగా పెద్ద ఎత్తున శిక్షణా శిబిరాలనే ఏర్పాటు చేస్తున్నారు. సాధన చేసే వారెంతమందో, తుదివరకూ నిలబడే వారెంతమందో కానీ ఈ రోజుల్లో అందరూ కుండలినీ శక్తి గురించి మాట్లాదేవారే!
అయితే ఒకరకంగా మనం వుడ్రాఫ్ కు కృతజ్ఞులముగా ఉండాలి. పాశ్చాత్యులు మన యోగ రహస్యాలన్నీ కల్పనలని ప్రచారం చేసేవారు. చిలకపలుకులు వల్లించే మన పెద్దలు దానికి తాళం వేసేవారు. ఈయన వ్రాయడం వల్ల అటువంటి వారి దృక్పథంలో మార్పురావడమేకాక,ఎవరైనా ధీరులంటూ ఉంటే ఇటువంటి యోగమొకటున్నదనే విషయం తెలిసి దానికై ప్రయత్నించే అవకాశం కల్గించింది.
మంత్రయోగం విషయంలో కూడా కుండలినీ యోగమంత కాకపోయినా జాగ్రత్త అవసరం. నాడీ ప్రకంపనల ద్వారా మంత్ర ప్రయోగం కూడా కుండలినీ యోగపు ఫలితాలనిస్తుంది. సవ్యమైన గురూపదేశం లేని మంత్రములు ఎఱుకవలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇంట్లో వైరింగ్ అంతా చేయించి పంకాలు, దీపాలు అమర్చినా విద్యుత్ కేంద్రానికి తీగలద్వారా జోడించకపోతే ప్రయోజనమేమీ ఉండదు. మంత్రనాదం విద్యుత్ వంటిది. నేరుగా ముట్టుకొంటే ప్రమాదం. గురువనే తీగ ద్వారా గురుబోధన అనే బల్బులోనికి ప్రవేశపెట్టినప్పుడే కాంతి వస్తుంది.
తీగలద్వారా ప్రవహించే శక్తి మనకు కనబడదు. దాని మూలం కూడా మన మెరుగం. అలాగే మంత్రం కూడా గుప్తమైనది. మంత్ర శస్త్రం గోప్యమైనది. అలాగని మంత్రయోగము, కుండలినీ యోగములు అనుసరణీయమైన మార్గములు కావని, నే చెబుతున్నానని అపోహపడవద్దు. అద్వైత సిద్ధికి ఇది నిశ్చయంగా దగ్గర దారి. లేకుంటే మహామునులెందరో, అంతెందుకు భగవత్పాదుల వారే తమ గ్రంథాలలో ఈ యోగాన్ని పదేపదే ఎందుకు స్పృశిస్తారు. ఈ మార్గాలపైన ఆసక్తిగల సాహసులు ఉంటే వారికి నేనీయవలసిన సలహా ఒకటున్నది.
ఈనాటికీ ఈ యోగంలో నిష్ణాతులైన అనేకమంది మహానుభావులున్నారు. వారికి మనపై అవ్యాజమైన అనుగ్రహం తప్పితే వేరొక ఆశలేదు. వారు సాధనలో శిష్యుని ఒక్కొక్క మెట్టుగా పైకి తీసుకొని వెళ్ళదగిన సద్గురువులు. వారిని ఆశ్రయించంది. మీ అంతట మీరుగా పుస్తకాలు చదివి సాధన చేయవద్దు. యోగులమని పేర్లు పెట్టుకొని డంభంగా తిరిగేవారిని చూసి మోసపోవద్దు. ఎంతో జాగరూకత అవసరం.
కానీ మరొక్కసారి నేను మీకు భక్తి జ్ఞాన మార్గాలలో కలగని ఆత్యంతికమైన అనుభూతి ఈ మార్గంలో క్రొత్తది ఏదీ లేదని గుర్తు చేస్తున్నాను. తుదికి అన్ని మార్గాలూ అక్కడ లయమవవలసిందే! అయినా మీమీ అభిరుచుని బట్టి ఈ మార్గంపైకి మక్కువ కలిగిందంటే సద్గురువును ఆశ్రయించండి. అటువంటి సద్గురువు లభించాలని భక్తితో అంబికను ప్రార్థించండి. ఆమె అనుగ్రహంతోనే సద్గురువు సంప్రాప్తమవుతాడు.
*కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే! గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!!* (మూకపంచసతి)
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి