**దశిక రాము**
ద్రవిడ ప్రబంధ సాహిత్యంలోని భక్తి సామ్రాజ్యంలో ఆళ్వారుల స్థానం ప్రశస్తమైంది. వీరు పన్నెండుమంది. అందుకే పన్నిద్దరు ఆళ్వారులంటారు. వీరిలో మొదటి ముగ్గురు ఆళ్వారులను మొదలాళ్వారులని పిలుస్తారు. వీరు పోయ్ గై ఆళ్వారు, భూతత్తాళ్వారు, ఇంకా పేయాళ్వారులు. వీరందరూ సమకాలీనులు. వీరి జననం కూడా చరిత్రకు అందని విచిత్రంగా ఒకే విధంగా ఉండటం విశేషం. తమిళ ప్రబంధాలు వీరి జనన విశేషాలను తెలియజేస్తాయి. అంతేకానీ చారిత్రక ఆధారాలు మాత్రం స్పష్టంగా లేవు. ఈ తొలి ఆళ్వారులైన పోయ్ గై ఆళ్వారుల జన్మస్థలం కాంచీపురంగానూ, భూదత్తాళ్వారుల జన్మస్థలం మహాబలిపురంగానూ, పేయాళ్వారుల జన్మస్థలం మైలాపురం అనీ పిలవబడే మొన్నటి మద్రాసు, నేటి చెన్నై అన్నమాట.
వీరి జీవనం అంతా సంచార జీవనమే. అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ అలౌకిక ఆనందాన్ని పొందడమే వారి జీవనం. బాహ్యంగానూ, అంతర్లీనంగానూ నిరంతరం భగవంతుని ధ్యానంలోనే ఉండటం వల్లనే వీరు ఆళ్వారులుగా ప్రచారంలోకి వచ్చారు. వీరి జనన విశేషాలు, జన్మస్థల విశేషాలకన్నా వీరు ప్రవచించిన భక్తి మార్గాన్ని అవగతం చేసుకోవడమే ముఖ్యం కనుక వీరి జీవిత వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం.
పోయ్ గై ఆళ్వారులు
ద్వాపరయుగాంతానికి చెందిన ఒక చిన్న సంఘటన. కాంచీపురం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ శివ కంచిలో శివాలయం, విష్ణు కంచిలో వైష్ణవ ఆలయానికి ప్రసిద్ధి. ఈ వైష్ణవ ఆలయానికి దగ్గర్లో ఒక ముద్దబంతి పూలతోట కైంకర్యానికి వినియోగించేందుకు ఉంది. ఆ తోటలోని పూలన్నీ వైష్ణవాలయానికే. ఆ తోట పాలనకు ఒక చిన్న కోనేరు ఉండేది. అదే ఆ తోటకు ఆధారం. నిత్యం ఆ తోటలోని పూవులే వైష్ణవాలయానికి, స్వామివారికి అలంకారం. అది సిద్ధాద్రి నామ సంవత్సరం. శుద్ధ అష్టమి. శ్రవణా నక్షత్రం. ఆ ఉద్యానవనంలో నెలల బాలుని ఆక్రందన ఆ ప్రాంతాన్ని మేల్కొలిపింది. ఆ పరిసరాల్లో బాలుని జననీజనకులు ఎవరూ లేరు. వెతికినా కానరాలేదు. అంత ఆ పసిబాలుని ఆలనాపాలనా అంతా ఆ ప్రాంత వాసులదే అయింది. వారే ఆ బాలుని భగవంతుని అంశగా భావించి సరయోగి, కాసారయోగి అంటూ పిలిచేవారు. పోయ్ వై అంటే సరసు లేక కోనేరు అని అర్ధం. కోనేటి చెంత లభించిన బాలుడు కనుక సరయోగి. వీరినే శ్రీ మహావిష్ణువు పంచాయుధాలలో ఒకటైన పాంచజన్య అవతారంగా వైష్ణవులు భావిస్తారు. ఈ పాంచజన్యమే భక్తి సామ్రాజ్య విస్తరణకు నాంది. భక్తి చైతన్యానికి శంఖారావం.
భూదత్తాళ్వారులు
పోయ్ గై ఆళ్వారులు అవతరించిన మరుసటి రోజున అంటే ధనిష్ఠ నక్షత్రంలో, బండి గురువింద చెట్టు వద్ద మహాబలిపురంలో అవతరించారు భూదత్తాళ్వారులు. భూతం అంటే ఆత్మ. పరిపూర్ణ ఆత్మస్వరూపునిగా అవతరించినందున వీరిని భూదత్తాళ్వారులు అని పిలిచేవారు. వీరినే భూత నాథులని కూడా పిలుస్తారు. వీరి జననీజనకులు కూడా లేరు. అందుకే వీరిని కూడా భగవంతుని ప్రసాదంగా భావించి వీరిని భూతనాథులుగా పిలవసాగారు. వీరి వ్యవహారశైలిని బట్టి వీరి జనన నక్షత్రాన్ని నిర్ణయించారు. ఈ విషయాన్నే తమిళ ప్రబంధాల్లో పేర్కొన్నారు. వీరిని కౌమోదకి అవతారంగా శ్రీవైష్ణవులు కొలుస్తారు.
పేయాళ్వారులు
తొలి ఆళ్వారుల్లో చివరివారు పేయాళ్వారులు. వీరి జన్మ వృత్తాంతం, జననీజనకులు ఏమీ తెలీదు. వీరు భూదత్తాళ్వారులు ఉదయించిన మరుసటి రోజున ఇప్పటి చెన్నై ఆనాటి మైలాపురం జన్మస్థలం. వీరు శతభిష నక్షత్ర జాతకులు. ఈ ముగ్గురూ సమకాలికులు. ఆచారవ్యవహారాల్లో సమానమైన లక్షణాలు ఉండటం వీరి ప్రత్యేకత. వీరు కూడా తమ జీవిత కాలాన్ని పరివ్రాజక జీవనంతో గడిపారు. వీరు మైలాపురంలోని ఎర్ర కలువలు ఉన్న ఒక కోనేటి దాపుల అవతరించారు. ఈ కోనేటినే మణికైవారం అని పిలిచేవారు. అందుకే ఈ పేయాళ్వారులకు మైలాపురాధిపతి అని ఇంకో పేరు కూడా ఉంది. వీరిని శ్రీ మహావిష్ణువు నందకాంశసంభూతులుగా పేర్కొంటారు. వీరు కూడా మొదటి నుండి విష్ణు సంశ్లేష భావంతో పరిసరాలను ఏమాత్రం గమనించక తదేకంగా విష్ణు భక్తిని గానం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఉండేవారు.
ఈ ముగ్గురు ఆళ్వారులకు ఆహార్యంలోనూ, భావంలోనూ, భక్తిలోనూ ఏక సారూప్యం గురించి ఒక విచిత్రమైన కథ ప్రాచుర్యంలో ఉంది.
ఒకరోజు పోయ్ గై ఆళ్వారు తన ఆశ్రమం విడిచి ఊరూరా తిరుగుతూ విష్ణు గానం చేస్తూ తిరుక్కోయిలూరు అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ సూర్యాస్తమయం అయింది. బాగా చీకటి. చుట్టూ నిలవ నీడ లేదు. ఆ ప్రాంతమంతా పంటపొలాలతో నిండి ఉంది. సాయం సమయం.. చీకటి పడింది. అంతలో ఉన్నట్లుండి గాలివాన మొదలైంది. ఈదురుగాలి, చలి, వర్షం. నిలవ నీడ లేదు. దూరంగా పంటపొలాలకు కాపలా కోసం వేసిన మంచే లాంటి తాత్కాలిక చిన్న పాక కనిపించింది. అప్పుడు పోయ్ గై ఆళ్వారులు ఆ పాక ముందుకు చేరుకున్నారు. వర్షానికి ఆ చిన్న పాక కారుతోంది. కానీ అక్కడ చీకటి. వెలుతురు ఏమాత్రం లేదు. భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఆ ఆళ్వారులు చేసేది లేక ఆ పాకలోకి చేరారు. ప్రకృతిలోని ఈ మార్పులన్నీ భగవంతుని ప్రేరణే కదా అనుకుంటూ ఒక్కరికి మాత్రమే స్థలం ఉన్న ఆ పాకలో ముడుచుకుని పడుకున్నారు. పంచభూతాల సృష్టికి కారణభూతమైన భగవంతుని కీర్తిస్తూ సృష్టిని, వృష్టిని, గాలిని సృష్టించిన దేవదేవుడు తనకు తలదాచుకోడానికి ఈమాత్రం జాగాను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పరమానందం పొందుతూ వర్షానికి తడుస్తున్న ఆ పాకలోనే విశ్రమించాడు.
ఇంతలో ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ వచ్చి ''స్వామీ! వర్షంలో బాగా తడిచాను. చలిగా ఉంది. తమరు దయతో అనుగ్రహిస్తే కొంచెం ఈ పాకలోకి వచ్చి వర్షం నుండి రక్షించుకుంటాను'' అని వేడుకున్నాడు. వెంటనే పోయ్ గై ఆళ్వారు ''మిత్రమా, దయచేసి లోనికి విచ్చేయండి.. ఇక్కడ ఒక్కరు సరిగ్గా విశ్రమించవచ్చు. కానీ ఇద్దరం సర్దుకుని కూర్చోవచ్చు'' అంటూ లోనికి ఆహ్వానించాడు. తర్వాత కొంత సమయానికి వర్షం ఇంకా ఎక్కువై గాలి కూడా తోడైంది. అంత చీకటిలో పోయ్ గై ఆళ్వారులు తన పక్కన ఉన్నవారు ఎవరో చీకట్లో గమనించనేలేదు. ఆవిధంగా ఇద్దరూ ఆ పాకలో పక్కపక్కనే కూర్చుని భగవంతుని తలచుకుంటూ చిన్న కునుకు తీశారు.
అంతలో మరో వ్యక్తి ఆ పాకవద్దకు వచ్చి వర్షం ఎక్కువగా ఉందని, తాను ఎక్కువసేపు బయట ఉండలేకపోతున్నానని, తనకు కూడా పాకలో ఆశ్రయం ఇచ్చి రక్షణ కలిపించమణి వేడుకున్నాడు. వెంటనే పాకలోని ఇద్దరూ లేచి నిలబడి ''మిత్రమా! లోనికి రండి. మనం ముగ్గురం ఈ కొద్ది ప్రదేశంలో కూర్చోవడం అయితే కుదరదు. కానీ నిలబడినట్లయితే సర్దుకోవచ్చు. కనుక మీరు కూడా దయచేయండి'' అని లోనికి ఆహ్వానించారు. అలా అక్కడ ముగ్గురూ ఒకరి పక్కన ఒకరు నిలబడి, ఒకరిపై ఒకరు వాలిపోతూ అలసిన తమ దేహాలకు కొద్ది విశ్రాంతిని ఇచ్చి భగవత్ చింతనతో సేదతీరుతున్నారు.
ఇంతలో అక్కడికి మరొక వ్యక్తి వచ్చి తనకు కూడా ఆశ్రయం ఇవ్వమని వర్షం ఎక్కువగా ఉందని వేడుకున్నాడు. కానీ ఆ పాకలో ముగ్గురు నిలబడటానికి మాత్రమే చోటుంది. నాలుగోవ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి ఏమాత్రం చోటు లేదు. కానీ.. ఎలా.. ముగ్గురిలోనూ ఒకటే బాధ. బయట ఉన్న నాలుగోవ్యక్తికి ఆశ్రయం ఇవ్వాలి. అందుకు వారు ఒకరితో ఒకరు పోటీపడి తాము బయటకు వచ్చి, బయటి వ్యక్తికి చోటు ఇవ్వాలని ఆరాటపడుతూ.. ఒకేసారి ముగ్గురూ బయటకు వచ్చేశారు.
వారి నిస్వార్థ చింతనకు ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ''అయ్యా! మీ అమూల్యమైన త్యాగానికి ధన్యుణ్ణి. కానీ, మీ త్యాగం నాకు వద్దు. మీరు ఇబ్బందిపడుతూ చేసే ఈ సహాయంనాకు వద్దు. నేను వేరే నీడ చూసుకుంటాను. దయచేసి మీరు వెనక్కి వెళ్ళి మీమీ స్థానాల్లో ఉండండి'' అని ప్రార్ధించి వేరే నీడ కోసం వెతకసాగాడు.
ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా గాలి, వాన ఆగిపోయింది. అక్కడ తుఫాను ఆనవాళ్ళు అయినా కనపడలేదు. మళ్ళీ వారికి పాకలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సూర్యుడు తన వెలుగురేఖలను ప్రసరిస్తున్నాడు. అప్పుడు వారు నలుగురు ఒకరినొకరు సంతోషంతో చూసుకున్నారు.
అప్పుడు పోయ్ గై ఆళ్వారు భగవంతుడు చూపిన ఈ అద్భుత, ఆశ్చర్య, ఆనంద, సంభ్రమ అతిశయాలకు చకితుడై ''ఓం నమో నారాయణా.. ఏమి ఆశ్చర్యం.. భూమిని ప్రమిదగా చేసి, సాగరం అనే నూనెతో సూర్యుడు అనే వత్తితో ఈ యావత్ ప్రపంచానికి వెలుగును చూపిస్తున్నావు,, సూర్యుని వెలుగురేఖలతో ఈ ప్రపంచం ఎంత హాయిగా వికాసవంతంగా ఉంది.. ఓ నారాయణా! నీవే ద్వాదశ సూర్యుల్లో అసలైన సూర్యుడివి.. నీ ఈ మహిమలకు శరణు శరణు..'' అంటూ గానం చేశాడు.
ఈ పాశురమే తమిళ ప్రబంధంలోకెల్లా ప్రధమం, విశిష్టం. తర్వాత రెండోవారు ''ఓ స్వామీ! ప్రేమ అనే అగ్నితో నా హృదయాన్ని వెన్నలా కరిగించావు. జ్ఞానం అనే జ్యోతిని వెలిగించావు. నాలోని ఆత్మ వికాసానికి కారణమైన నీకు శరణు శరణు'' అని ప్రార్థించాడు. ఇక మూడోవారు ''ఓ పురుషోత్తమా! ఎవరికీ అర్ధం కాని నీ గురించి నాకు సంపూర్ణంగా అర్ధమైంది. నా జీవితానికి సార్ధకత నెరవేరింది. నా జన్మ ధన్యమైంది నారాయణా!'' అంటూ తన్మయత్వంతో పులకించి గానం చేశాడు.
ఈవిధంగా భక్తి పారవశ్యంతో గానం చేస్తున్న ఈ ముగ్గురినీ చూసిన నాల్గవవారు సంభ్రమాశ్చర్యాలతో పెద్దగా అరుస్తూ ''నేను అదృష్టవంతుడిని.. నా ఆశ నెరవేరింది. నన్ను భగవంతుడు అనుగ్రహించాడు. ఇన్నాళ్ళకు నేను కనుకొన్నాను'' అంటూ పరవశించి గానం చేస్తూ నాట్యం చేసాడు.
అప్పుడు ఆ ముగ్గురూ ఆశ్చర్యంతో ''నువ్వు ఏం కనుగొన్నావు? నీ కోరిక ఏది నెరవేరింది? కాస్త వివరంగా చెప్పు'' అని కోరారు. వెంటనే ఆయన ''సోదరులారా! మీ గురించిన అసలు రహస్యం నాకు అవగతమైంది. మీరు ఎవరో నాకు బోధపడింది. మీరు ఎవరో కారు, ఆళ్వారులు. శ్రీమహావిష్ణువు పంచాయుధాలతో పాంచజన్య అంశగా జన్మించిన పోయ్ గై ఆళ్వారులు అని ఒకరిని, కౌమోదకి అంశజులైన భూదత్తాళ్వారులు అని వేరొకరిని, నందకాంశజులైన పేయాళ్వారులు అని మరొకరిని - ముగ్గురినీ వేలుతో చూపిస్తూ ''మీ కోసమే వాడవాడలా తిరుగుతున్నాను.. మిమ్మల్ని కలవడంతో నా జన్మ ధన్యమైంది'' అంటూ ఆనందంతో నాట్యం చేశాడు.
అప్పుడు ముగ్గురూ ఆళ్వారులూ ఒక్కసారిగా అమితానందంతో ''మీ గురించి కూడా మాకు అర్ధమైంది. మీరు కూడా మరెవరో కాదు. సుదర్శనచక్ర అంశతో జన్మించిన మీరే తిరుమలశై ఆళ్వారులు. మిమ్మల్ని కలవడం మాకు కూడా ఆనందంగా ఉంది'' అంటూ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కలయిక భగవదేచ్చ అని, ఒక అద్భుత సమాగమం అని, అందరి అసలు జన్మస్థలం ఒక్కటే అని, అందరూ ఒక్కచోటు నుండి వచ్చినవారిమే అంటూ ఒకరినొకరు అత్యంత ఆత్మీయతతో, ఆనందంతో పలకరించుకున్నారు. వారి మధ్య ఒకరిపై ఒకరికి సోదర వాత్సల్యమే కదా!
అప్పుడు నలుగురు ఆళ్వారులు ఒక్కసారిగా తలలు ఎత్తి ఆకాశం చూస్తూ ''ఓం నమో నారాయణా, ఓ జగజ్జనకా, నీ అనంతమైన కరుణ మా అందరిమీద సమంగా ప్రసరింపచేశావు. మమ్మల్ని ఒక్కచోటుకు చేర్చెందుకే ఇక్కడ ఈ జడివానాను సృష్టించావు.. మా నలుగురినీ ఒక్కచోట చేర్చిన స్థలం ఒక మహా పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందా''లని ఆ దేవదేవుని వేడుకున్నారు. ఆ ప్రదేశమే నేటి తిరుక్కోయిలూరు. ఈ ప్రాంతం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది.
వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి
దయచేసి షేర్ చేయండి
స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ...
కనుక మనం ఆలస్యం చేయక
అందరం " గోవిందా గోవిందా " అని పలికి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి