10, అక్టోబర్ 2020, శనివారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


****


 చతుర్థ స్కంధం -1


చతుర్థ స్కంధము - ముందు మాట

ఓం శ్రీరామ 

చతుర్థ స్కంధంలో భక్తుల భక్తి తత్వాలు వర్ణించబడ్డాయి. అనయంబు శివ యను, నీలగళాపరధి, అభ్రం లిహా దభ్ర, దూర్వాంకురంబుల, ధరను విరులు మున్నగు చక్కటి పద్య రాజాలు ఈ స్కంధలోవే. దక్ష యజ్ఞం, సతీ దేవి దేహ త్యాగం, ధృవోపాఖ్యానం, పృథు చరిత్ర, ప్రచేతసుల విషయం మున్నగునవి బమ్మెర పోతన గారు తేనెలో ముంచిన గంటంతో గీసి గీసి వివరించారు ఈ స్కంధంలో.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


ఉపోద్ఘాతము 


శ్రీమహాలక్ష్మీతేజోరూపి, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక అయిన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటి వాడు; తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.


గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "శుకమహర్షి ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు.


స్వాయంభువువంశవిస్తారము 


రాజా! విను. విదురునితో మైత్రేయ మునీశ్వరుడు మళ్ళీ ఇలా అన్నాడు. “స్వాయంభువ మనువునకు శతరూప అనే భార్యవల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేసాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లటంకోసం స్వాయంభువమనువు పుత్రికా ధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది. ఆ విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతునియందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మి విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వాయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక ఆ అన్నాచెల్లెళ్ళ వివాహం లోకవిరుద్ధం కాలేదు” అని చెప్పి మైత్రేయుడు మళ్ళీ ఇలా అన్నాడు.“బుద్ధిమంతుడవైన విదురా! ఆ దంపతులకు యామ అనే పేర్లుగల దేవతలు మహాబలవంతులైన పుత్రులుగా జన్మించారు.

ఆ పుత్రులు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని పన్నెండుమంది. వీరిని తుషితులు అనికూడా అంటారు. స్వాయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు, యజ్ఞుడు, దేవేంద్రుడు, మనువు కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి పుత్రులు, మనుమలు, మునిమనుమలు అందరితోనూ స్వాయంభువ మన్వంతరం నిండి కొనసాగింది. మనువు తన రెండవ కూతురయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి వారి వంశాన్ని పెంపొందించాడని ఇదివరకే చెప్పాను. మనువు తన మూడవ కూతురైన ప్రసూతి అనే కన్యను బ్రహ్మ కుమారుడైన దక్షప్రజాపతికి ఇచ్చాడు. ఆ దక్షునికి ప్రస్తూతికి పుట్టిన సంతతితో మూడులోకాలు నిండిపోయాయి. కర్దముని పుత్రికలు బ్రహ్మర్షులకు భార్యలయ్యారు. వారివల్ల కలిగిన సంతాన పరంపరను వివరిస్తాను.


కర్థమప్రజాపతి వంశాభివృద్ధి  


గొప్పవాడైన మరీచి మహర్షికి కర్దముని కూతురైన కళ అనే భార్యవల్ల కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. ఆ కశ్యపుని సంతానం లోకాలన్నిటా నిండిపోయింది. మరుజన్మలో విష్ణువుయొక్క పాదప్రక్షాళన జలాలతో గంగగా పుట్టి, దేవకుల్య అనే కుమార్తెను, విరజుడు అనే కుమారుని కన్నది. పుణ్యాత్ముడయిన అత్రిమహాముని తన భార్య అయిన అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో ముగ్గురు కొడుకులను పొందాడు.”అని మైత్రేయుడు చెప్పగా విదురుడు అతన్ని చూచి ఇలా అన్నాడు “మునీంద్రా! జగత్తు పుట్టుటకు, ఉనికికి, వినాశనానికి కారణమైన బ్రహ్మ, విష్ణువు, శివుడు....ఏ కారణంచేత అత్రిమహాముని ఇంట అనసూయకు కుమారులై జన్మించారు?” అనగా మైత్రేయుడు ఆ విదురునితో ఇలా అన్నాడు. పుణ్యాత్మా! విను. విధిప్రేరణతో అత్రిమహర్షి తపస్సు చేయడానికి పూనుకొని, భార్య అయిన అనసూయతో కూడి ఋక్షం అనే కులపర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్వింధ్యానది ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నది. ఆ నదీ ప్రవాహం వల్ల అక్కడి అడవిలోని అశోకవృక్షాలు, మోదుగుచెట్లు ఏపుగా పెరిగి పూలగుత్తులతో నిండి కనువిందు చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో అత్రిమహర్షి జితేంద్రియుడై ప్రాణాలను నియమించి, ఒంటికాలిపై నిలుచుండి, శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాలను జయించి, గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసాడు. అతని శరీరం బాగా కృశించింది.ఇలా మిక్కిలి తీవ్రమైన తపస్సు చేస్తూ తన మనస్సులో...ఏ ప్రభువు ఈ సమస్త లోకాలకు అధీశ్వరుడో అతనిని శరణు కోరుతున్నాను. ఆ ప్రభువు దయతో తనతో సమానమైన సంతానాన్ని నాకు ప్రసాదించుగాక!’ అని భావించుచుండగా...ఆ అత్రిమహాముని శిరస్సునుండి వెలువడిన అగ్నిజ్వాలలచేత మూడులోకాలు కరిగి వేడెక్కగా చూచి అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు తమ యశస్సును గానం చేస్తుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని దగ్గరకు వెళ్ళారు.ఆ విధంగా ఆ మునీంద్రుని ఆశ్రమాన్ని సమీపించే సమయంలో...

సరస్వతీ లక్ష్మీ గౌరీ వల్లభులైన ఆ త్రిమూర్తులను అత్రి మహర్షి చూచాడు. బ్రహ్మ మేలిమి బంగారం వలె పసుపుపచ్చగా ఉన్నాడు. విష్ణువు మేఘంవలె నల్లగా ఉన్నాడు. శివుడు వెన్నెలవలె తెల్లగా ఉన్నాడు. బ్రహ్మ హంసను, హరి గరుత్మంతుని, శివుడు వృషభాన్ని అధిష్ఠించి ఉన్నారు. బ్రహ్మ చేతిలో కమండలువు, విష్ణువు చేతిలో చక్రం, శివుని చేతిలో త్రిశూలం ఉన్నాయి. 

【సూత్రం :- “ఒకదాని తరువాత ఒకటి వరుసగా సమాన సంఖయాకాలయ్యే వాటి యొక్క సముదాయం ఉంటే యథాసంఖ్య (క్రమ) అలంకారం.” బ్రహ్మవిష్ణుమహేశ్వరులను వారి శరీర ఛాయ, వాహనాలు, ఆయుధాలు, భార్యలను క్రమాలంకారంలో చెప్పడంలో యథాసంఖ్య (క్రమ) అలంకారం వెల్లివిరిసింది ఇక్కడ ఆస్వాదించండి.】

ఇంకా కరుణాకటాక్షవీక్షణాలను ప్రసరింపజేసే ముఖాలలో చిరునవ్వులు చిందులాడుతున్న ఆ మహాత్ములను చూచి అత్రి పట్టరాని ఆనందంతో పొంగిపోయి, సాగిలపడి నమస్కరించి, పుష్పాంజలి సమర్పించి, నుదుట చేతులు మోడ్చి, కన్నులకు మిరుమిట్లు గొలిపే ఆ త్రిమూర్తుల తేజస్సును చూడలేక కన్నులు మూసుకొని, వారి పాదాలపైనే తన మనస్సును లగ్నం చేసి మృదువుగా, మధురంగా, గంభీరంగా ఇలా స్తుతించాడు. 

【”అనఘతపోభిరాముఁ డగు” పద్యంలోనుంచి క్రమాలంకారం పొంగి పొర్లిందా అన్న అభాసం స్పురించే “కృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల” పదాల అందం చూసారా?】

“ఓ మహనీయులారా! ప్రతికల్పంలోను మీరు సర్వప్రపంచాన్ని సృజించి, పోషించి, నాశనం చేస్తారు. మాయాస్వరూపులై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేర్లుకల మీ పాదపద్మాలకు నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. చైతన్యవంతా లయిన మానవుల స్వాంతాలకు కూడ మీ తత్త్వం అందదు. మీ ముగ్గురిలో నేను ఒక్కరినే పిలిచాను. మీరు ముగ్గురూ వేంచేశారు. నాకు వింతగా ఉన్నది.అంతేకాక నేను సంతానం కోసం పెక్కువిధాలైన పూజలు చేసి నా మనస్సులో నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడు మాత్రమే” అని అత్రిమహర్షి పలుకగా త్రిమూర్తులు అమృతం వంటి తియ్యనైన మాటలతో ఇలా అన్నారు. అత్రీ! విను. మేము లెక్కకు ముగ్గురం అయినా వాస్తవానికి ఒక్కరమే. మేము ముగ్గురమూ వేరు కాదు. నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. మా ముగ్గురి అంశలతో బుద్ధిమంతులైన ముగ్గురు కుమారులు నీకు జన్మిస్తారు. వారు మంగళమయమైన నీ కీర్తిని మూడులోకాలలో వ్యాపింప జేస్తారు. ఇది జరిగి తీరుతుంది.”అని మునీంద్రుడైన అత్రి తన మనస్సులో కోరుకున్న వరాన్ని అనుగ్రహించి, ఆ మహర్షి చేసిన పూజలకు సంతుష్టులై త్రిమూర్తులు యథేచ్ఛగా వెళ్ళిపోయారు. పుణ్యచరిత్రులైన ఆ దంపతులకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు. ఆ ముగ్గురు పుత్రులు ఉత్తమగుణ సంపన్నులు. మాననీయుడవైన విదురా! విను. అంగిరసుడు అను మునీంద్రునికి భార్యయైన శ్రద్ధయందు సుగుణవతులు, సుందరాంగులు అయిన నలుగురు కుమార్తెలు కలిగారు. సినీవాలి, కుహువు, రాక, అనుమతి అని ఆ నలుగురి పేర్లు. వీరు కాక అంగిరసునికి ఇద్దరు కుమారులు కలిగి, స్వారోచిష మనువు కాలంలో ప్రసిద్ధులయ్యారు. వా రెవరంటే జ్ఞానవంతుడైన ఉచథ్యుడు, బ్రహ్మణ్యుడైన బృహస్పతి. వారిద్దరూ ఎంతో ప్రసిద్ధులు. పులస్త్యునికి హవిర్భుక్కు అనే భార్యవల్ల అగస్త్యుడు, విశ్రవసుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ అగస్త్యుడు జన్మాంతరంలో జఠరాగ్ని రూపంలో ప్రవర్తించాడు. విశ్రవసునికి ఇలబిల అనే భార్యవల్ల కుబేరుడు, కైకసి అనే భార్యవల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. పులహునికి గతి అనే భార్యవల్ల కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. క్రతువుకు క్రియ అనే భార్యవల్ల బ్రహ్మతేజస్సుతో సమానులైన వాలఖిల్యులు అనే మహర్షులు కలిగారు. వారు అరవైవేలమంది. వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులు జన్మించారు. మరొక భార్యవల్ల శక్తి మొదలైన కొడుకులు కలిగారు. అథర్వునికి చిత్తి అనే భార్యవల్ల ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు జన్మించాడు. భృగువునకు ఖ్యాతి అనే భార్యవల్ల ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులూ, భగవద్భక్తురాలైన శ్రీ అనే కుమార్తె జన్మించారు. భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. భార్గవునికి ఉశన అనే భార్యవల్ల కవి జన్మించాడు. ఈ విధంగా కర్దముని కూతుళ్ళ సంతాన వృత్తాంతం నీకు చెప్పాను. ఈ వృత్తాంతం విన్నవారికి వెంటనే పాపాలు తొలగిపోతాయి. ఇక దక్షప్రజాపతి వంశాన్ని వివరిస్తాను. విను.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: