10, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్.88

 

..

భరతుడిని తీసుకురావటానికి బయలుదేరిన దూతలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నారు. వారు ముందుగా అపరతాల పర్వత దక్షిణభాగం దాటారు . 

.

ఆ తరువాత అపరతాల ,ప్రలంబ పర్వతాల మధ్య ప్రవహించే మాలినీ నది వెంట ఉత్తరంగా ప్రయాణం చేసి మరల పడమరవైపు తిరిగారు. 

.

వారు అలా హస్తినాపురం చేరి అక్కడ గంగ దాటి మరల పడమరగా ప్రయాణం చేసి కురుజాంగల మధ్యదేశము మీదుగా పాంచాలము చేరి అక్కడ నుండి ప్రయాణం చేసి శరదండా నదిని దాటి ఇంకా వేగంగా ప్రయాణం చేశారు.ఆ నదీ తీరం మీదున్న సత్యొపయాచన అనే దివ్యవృక్షానికి ప్రదక్షిణము చేసి కులింగా నది దాటారు. 

.

ఎక్కడా ఆగటంలేదు ,అలసట లక్ష్యపెట్టకుండా అక్కడనుండి అభికాల అనే గ్రామం చేరి అక్కడ ఇక్షుమతీ నదిని దాటి ,అక్కడ నుండి బాహ్లికదేశం మీదుగా సుదామ పర్వతం చేరారు.అక్కడ నుండి ఇంకా వేగంగా ప్రయాణించి నాల్గవ రోజు రాత్రికి కేకెయ రాజధాని గిరివ్రజపురం చేరారు.

.

ఆ రాత్రి నిదురించిన భరతుడికి తెల్లవారుఝామున ఒక పీడకల వచ్చింది .వెంటనే లేచి కూర్చున్న ఆయన మనసులో చాలా దుఃఖించి పరితపించసాగాడు.

.

ఆయన పరితాపము గ్రహించిన స్నేహితులు ఆయనకు రకరకాల కధలు చెపుతూ మనసులో కలిగిన ఆ ఖేదాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఆయన మనస్సెందుకో కుదుటపడటంలేదు. అప్పుడు ఉండబట్టలేక కొందరు మిత్రులు కారణమడిగారు. అందుకు ఆయన తనకు వచ్చిన కల ఎట్లాంటిదో చెప్పాడు.

.

నా తండ్రి మట్టికొట్టుకుపోయిన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వతశిఖరము మీదనుండి ఆవుపేడ తో నిండిన గోతిలో పడిపోయినట్లు అందులోనే మునిగితేలుతూ మాటిమాటికీ పిచ్చివాని వలే నవ్వుతూ దోసిళ్ళతో నూనె తాగుతున్నట్లగా ఉండి నువ్వులు కలిపిన అన్నం తింటూ మాటిమాటికీ తల వాలుస్తూ నూనెలో మునిగిపోయినాడు.

.

నా తండ్రి ఎర్రటి మాలలు ధరించినట్లుగా ఎర్రటి గంధము వంటికి పూసుకొన్నట్లుగా గాడిద నెక్కి దక్షిణదిక్కుగా ఒక రాక్షసి లాక్కొని పోతున్నట్లగా కనపడినాడు.

.

ఇంకా సంద్రము ఎండిపోయినట్లు,చంద్రుడు ఆకాశంనుండి రాలి పడిపోయినట్లు,భద్రగజముల దంతములు విరిగిపోయినట్లు,మండే మండే అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు ,భూమి బ్రద్దలైనట్లు భూమి అంతా పొగ ఆవరించి చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డది.

.

ఏమో మా అయిదుగురిలో ఎవరో ఒకరికి మరణము సంభవించవచ్చునేమో ! నా గొంతు ఎండిపోతున్నది ఏదో తెలియని భయం మనస్సును పట్టి పీడిస్తున్నది అని భరతుడు తన స్నేహితులతో పలుకుతూ ఉండగనే అయోధ్య నుండి వచ్చిన దూతలు సభలో ప్రవేశించారు.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: