10, అక్టోబర్ 2020, శనివారం

తాటంకయుగళీభూతతపనోడుపమండలా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 23 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘తాటంకయుగళీభూతతపనోడుపమండలా’  


ఇది చాలా పవిత్రమైన నామములలో ఒకటి. పవిత్రము కాని నామము ఉండదు. సౌభాగ్యము కటాక్షించడము చేత ఈ నామము శక్తి మిక్కుటముగా ఉంటుంది. అంక అనగా గుర్తు. తాటంక అనగా సౌభాగ్యసూచకముగా చెవిలో తాటాకు గుర్తుగా పెట్టబడినది. ఈమె సౌభాగ్యవతి అనగా ఐదవతనమును కలిగి ఉన్నది. రెండింటిని ఐదవతనమునకు చాలా పవిత్రముగా చెపుతారు. ఒకటి తాళి, రెండు తాటంకము. ఆడపిల్లలకీ, మగపిల్లవాడికీ చెవులు కుట్టిస్తారు. చెవులు ఓంకార సూచనతో ఉంటాయి. ఒక వయసు వచ్చేసరికి చెవి తమ్మెను సూర్యకిరణములకు అడ్డుపెట్టి చూస్తే వెనక నుంచి రంధ్రము కనపడుతుందని అంటారు. ఆ రంధ్రము దగ్గర రంధ్రము చెయ్యాలని సనాతన ధర్మము చెపుతున్నది. అందుకని చెవులు కుట్టిస్తారు అనగా దానికి ఒక కన్నము చేస్తే అందులోనుంచి గాలి బయటికి వెళ్ళాలి. అలా వెళితే ‘మ్’ అన్న పూర్ణత్వము వచ్చి ఓమ్ అవుతుంది. అకార, ఉకార, మకారములు పక్కన ఉన్న నాదము కలిస్తే అది ప్రణవము అవుతుంది. అలా ప్రణవము అయితే తప్ప దానికి ఉపదేశము పొందడానికి అర్హత ఉండదు. 

ఆడపిల్ల వివాహసమయములో గౌరీపూజ చేసి వెళ్ళి పెళ్లి పీటల మీదకి వెళ్ళి కూర్చుంటుంది. పెళ్ళికొడుకు ఆమె మెడలో తాళి కట్టాక ఆడపిల్ల చెవికి తాటాకును తగిలించాలి.  లేదా ఒక కొత్త తాటాకుముక్క ఆమె చెవి కన్నములోనికి దూర్చాలి అన్నారు. అమ్మవారి చెవులు కూడా  తాటాకు చేత గుర్తు పెట్టబడిన చెవులు. అనగా ఆమె చెవులు సౌభాగ్య సూచనలు. అమ్మవారిది తరగని సౌభాగ్యము. పరమశివుడు ఎప్పుడూ సంతోషముగా ఉండగలుగుతున్నాడు, ఆయనను కాలము గ్రసింపలేదు అంటే అమ్మవారు చెవికి పెట్టుకున్న ఆభరణము యొక్క గొప్పతనము. తాళ శబ్దము మీద స్త్రీ మెడలో తాళి, చెవిలో ఉండే తాటంకము ప్రధానమైనవి. తాటాకుకి ఇంత గొప్పతనము ఎందుకు అనగా తాటి ఆకు సౌభాగ్య చిహ్నము. మామూలు తాటాకుకే అంత శక్తి ఉంటే ఆ ఆభరణములు ధరించిన అమ్మవారి చెవులు ఎంతో శక్తివంతమైనవి కనకనే వాటిగురించి విన్నా, మానసికముగా చూసినా ఉత్తర క్షణములో సౌభాగ్యములు నిలబడతాయి. దశమి, శుక్రవారము సాయంత్రము వింటే మరింత పవిత్రము. ఆవిడ తాటంకములు పెట్టుకున్నప్పుడు తపన – ఉడుప – యుగళీభూత. ఒక చెవికి సూర్యుని, ఒక చెవికి చంద్రుని పెట్టుకున్నది. 


చెవిని అంత ప్రధానముగా తీసుకుని అక్కడ తాటాకు పెట్టి అంత సౌభాగ్యస్థానమని నిర్ణయించడానికి కారణము ఉన్నది. మామూలుగా చెవికి పెట్టుకునే ఆభరణములో సర్వమంగళా దేవిని ఉపాసన చేసిన స్త్రీ సౌభాగ్యములో ఏ విధమైన ప్రమాదము ఉండదని చెపుతున్నప్పుడు సూర్య చంద్రులే తాటంకములుగా ఉన్న తల్లి సౌభాగ్యమునకు హద్దు ఉండదు. కాలగతిలో లోకములు అన్నీ పడిపోతున్నాయి. సూర్య చంద్రులు ఆవిడకు ఆభరణములయి ఉన్నారు. ఆవిడ నిత్యసౌభాగ్యవతి. నిత్యమంగళ, సర్వమంగళ. 


దేవతలలో బ్రహ్మాదులు కూడా వృద్ధాప్యము రాకూడదు, రోగములు రాకూడదని కోరుకుని పాలసముద్రమును మధించారు. అమృతము వస్తుంది దానిని త్రాగాలని అనుకున్నారు. ఆ సమయములో ఏది వచ్చినా దేవతలో, రాక్షసులో ఎవరో ఒకరు పుచ్చుకున్నారు. అమృతం వచ్చిన తరవాత అందరూ పుచ్చుకున్నారు. ఎవరూ పుచ్చుకోకుండా వదలి వేసినది హాలాహలము. అది పుట్టినప్పుడు మహావిష్ణువు, బ్రహ్మగారు అక్కడే ఉన్నారు. అది పుట్టగానే అందరూ శివుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు. ‘ఈశ్వరా! అమృతము కోసము పాలసముద్రము మధించాము. హాలాహలము వచ్చింది లోకములను కాల్చేస్తున్నది. ప్రాణికోటి నాశనమయిపోతున్నది. దానిని మీరు పుచ్చుకుంటారేమో అని వచ్చామన్నారు. శివుడు ఆ హాలాహలమును తాను పుచ్చుకుంటానని పార్వతికి నచ్చ చెప్పాడు. నీ అన్నగారు శ్రీమహావిష్ణువు లోకములను కాపాడాలి. అవి పాడైపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు. నేను పుచ్చుకుని లోకములను కాపాడతానని అన్నాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. ఆయన హాలాహలమునకు ఎదురు వెళ్ళి పట్టుకుని చేతితో నలిపి చిన్న ముద్దగాచేసి చక్కగా నోట్లో పెట్టుకుని ఉదరములోని లోకములు నాశనము అవుతాయని కడుపులోకి వెళ్ళనియ్యకుండా కంఠములో పెట్టుకుని నీలకంఠుడు అయ్యాడు.


సౌందర్యలహరిలో శంకరులు – ‘అమ్మా! నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుడు కాలగతిలో వెళ్ళిపోయాడు. అమృతము త్రాగిన బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఒక్కక్క యుగములో ఒక్కక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నారు. అందరి పుర్రెలు దండలా కట్టి శివుడు మెడలో ధరించాడు. శివుడు మాత్రం అలాగే ఉన్నాడు జుట్టుకూడా తెల్లబడలేదు అంటే అది నీ చెవి తాటంకముల మహిమ’ అన్నారు. ఎంతో గొప్పదైన ఈ నామమును లలితాసహస్రనామ స్తోత్రములో ప్రతిరోజూ అనుసంధానము చేసినా సౌభాగ్యస్థానము రక్షింపబడుతుంది. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: