15, అక్టోబర్ 2020, గురువారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదకొండవ శ్లోక భాష్యం - మొదటి భాగం


చతుర్భి శ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి

ప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః!

త్రయశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ

త్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!!


(తల్లీ! నాలుగు శివకోణములు. తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతుల తోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పదమము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము నలబదిమూడు త్రికోణములతో అలరారుచున్నది.)


ఈ శ్లోకములో ఆచార్యులవారు శ్రీచక్రమును వర్ణిస్తున్నారు. శ్రీచక్రమునకు శ్రీయంత్రమని కూడా పేరున్నది. శ్రీవిద్యా పూజ అన్న ప్రస్తావన వచ్చినపుడు శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించిన తరువాత చేసేదా ఈ పూజ? అన్న ప్రశ్న పుడుతుంది. అవును.


ప్రతి దేవతకు తనదైన యంత్రమున్నది. కానీ శివపూజ చేసేవారో, విష్ణువు ఆరాధన చేసేవారో సాధారణంగా యంత్రం పెట్టుకొని పూజచేయరు. అటువంటి యంత్రము దేవాలయాల్లో విగ్రహానికి క్రింద భూమిలో ప్రతిష్ఠించబడుతుంది. కొన్నిచోట్ల బయటకు కనిపించే విధంగానే ఉండవచ్చు. కానీ గృహపూజలలో యంత్రాలు పెట్టుకోవడం అరుదు. చాలామంది పంచాయతన పూజచేస్తారు. శివునికి ప్రతీకగా బాణ లింగాన్ని, విష్ణువునకు సాలగ్రామాన్ని పూజిస్తారు. ఇక్కడ అంబికకు ప్రతీకగా స్వర్ణరేఖ శిల పూజింపబడుతుంది. ఇది సహజశిల. కానీ చాలామంది ఈ శిలకు బదులుగా శ్రీచక్రానికి పూజచేస్తున్నారు. అలాగే గణపతికి, సూర్యునికి కూడా సహజ సిద్ధంగా లభించే శిలలు ప్రతీకలుగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యుని పూజించేవారు ఆయన ఆయుధాన్ని ప్రతీకగా ఉంచుకొంటారు. అంబికకు మాత్రమే శ్రీచక్రపూజ జరుగుతొంది.


ఏ దేవతకు సంబంధించిన తంత్రాన్ని పరిశిలించినా ఆ దేవతకు యంత్రంతో పాటు ఒక మంత్రం చెప్పబడి ఉన్నది. ఒక విధివిధానంలో అమరించబడిన శబ్దాలు చెప్పబడిన ప్రత్యేకమైన పద్ధతిలో ఉచ్చరించి దానిలో సిద్ధిపొందితే ఆ మంత్రాధిష్ఠాన దేవత నేరుకునేరుగా ప్రత్యక్షమవుతుంది. అటువంటి శబ్దములు అమరింపు ఆ దేవత మంత్రంగా చెప్పబడుతోంది. ఒక దేవత కరచరణాద్యవయవముల వలెనే ఆ దేవతనుద్దేశించిన శబ్దముల సంపుటి ఆ దేవత రూపాన్ని ఏర్పరుస్తుంది. దీనిని శబ్ద రూపము లేక మంత్ర రూపము అంటారు. దీనితోబాటు ఆ దేవతకు యంత్ర రూపం కూడా ఉంటుంది. రేఖలో, త్రికోణములో, వృత్తములో యంత్రంలోని ప్రతి భాగము తనదైన అర్థాన్నే కాక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. పరమాత్మ ఆయా ప్రత్యేకమైన దేవతగా అవతరించడాన్ని గ్రహించడానికి ఆయా యంత్రములు ఉద్దేశించబడినవి.


ఇక మంత్రములు మానసికంగా జపించడానికే కాక ఆ దేవతా పూజలో అంజలులు అర్పించడం నుంచి ఆ దేవతను ప్రత్యక్షం చేసుకోవడం వరకు ఉపయోగిస్తాయి. ఆ దేవత మంత్రాక్షరములు ఆ దేవతా యంత్రంపై చెక్కబడతాయి. మామూలుగా విగ్రహానికి చేసినట్లే ఆ యంత్రానికి సకలోపచారాలతోనూ పూజలు జరుగుతాయి. ప్రతి దేవతామూర్తిలో వసించే శక్తి ఈ యంత్రరూపంలో కూడా ఉండటమే దీనికి కారణం. నిజానికి యంత్రం ఆ దేవతా మూర్తి ఒక్కటే కాదు. పరివార దేవతలు, నివాసముతో కూడి ఉన్న దేవతామూర్తి.


అంబిక వివిధ రూపాలకు వివిధ యంత్రాలున్నాయి. కానీ ఆయా రూపాలలో దర్శనమిచ్చే అంబికను కూడా శ్రీచక్రంతోనే అర్చించడం మనం చూస్తున్నాం. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణం చేసే త్రోవలో దుర్గాదేవి ఉన్నది. దుర్గా యంత్రం ప్రత్యేకంగా ఉన్నా అక్కడ శ్రీచక్రమే ప్రతిష్ఠించబడి ఉన్నది. శృంగేరీ శరదాంబాలయంలో కూడా పూజ శ్రీచక్రానికే! అంబిక వివిధ రూపాలలోని యంత్రాలలో శ్రీచక్రము ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది.


రేఖలు, ఆ రేఖలతో రూపించబడిన త్రికోణములు, చతురస్రములు, వృత్తములు ఇవి చక్రములోని భాగములు. యంత్రము ఒక కేంద్ర బిందువును కలిగి ఉంటుంది. వీటితో నిర్మించబడిన పటములకు దేవతాశక్తిని ఆకర్షించగల కొలతకందని శక్తి ఉంటుంది. అవి దుష్టశక్తులను అణచివేయగలవు – దైవీశక్తులను ఆకర్షించగలవు.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: