రామాయణమ్ 141
.................
కోదండమో అది అసురుల పాలిటి యమదండమో ,
ధనుర్ధారి రాముడిని చూడగానే దండధారి యముడు గుర్తుకు వస్తాడు
.
ఆయన చేతిలోని ఆటబొమ్మ ఆ ధనుస్సు!
ఎప్పుడు బాణము తీస్తున్నాడో,
ఎప్పుడు సంధిస్తున్నాడో,
ఎప్పుడో వదులుతున్నాడో ,
చూసేవారి కన్నులకు అస్సలు అగుపడదు!. మనసైన్యములోని వారు టపటప నేలకూలడమే నాకు కనుపించింది.
.
వడగళ్ళవాన కు పంటచేలు నాశన మైనట్లుగా మనవారు చనిపోవడమే నేను చూశాను.
.
ఒంటరివాడు !పైగా పాదచారి వీడేమిచేయగలడు? అని అనుకుంటే కేవలము ఒకటిన్నర ముహూర్త కాలములో అందరినీ మట్టుబెట్టాడు.
.
ఆడుదానిని చంపటము ఎందుకని నన్ను ఒక్కదానిని మాత్రము వదిలివేశాడు.
.
రాముడికి ఒక తమ్ముడున్నాడు
వాడు వీడి అంతటి వాడు.
అన్న అంటే వానికి సర్వస్వము .
వాడు రాముడికి బయట తిరుగాడే ప్రాణము ,
వాని పేరు లక్ష్మణుడు.
.
రాముడి వెంట అతని భార్య కూడా ఉన్నది .
.
ఆవిడ పేరు సీత ! ఆవిడ సౌందర్యాన్ని ఏమని వర్ణించను!.
ఆమె శరీరము తళుకులీనే బంగారు కొండ
ఆమె శరీరపు సుగంధము సంపెంగ దండ వాసన వస్తున్నది
ఆవిడ ఇందు వదన
,కుందరదన
ఆ అందము ముల్లోకాలలో వెతికినా కాన రాదు .
ఆ చక్క దనాల చుక్క నీ ప్రక్కన లేకపోవడమే నీకు తక్కువ !
.
ఆమె వలపులు నీకు మాత్రమే తగినవనే తలపు నన్ను ఉసిగొల్పగా నీకు కానుకగా ఆ జవ్వనిని ఇవ్వాలని నేను
ప్రయత్నించాను.
.
కానీ నా ప్రయత్నాన్ని క్రూరుడైన లక్ష్మణుడు వమ్ము చేసి నా అవయవములు ఖండించి నన్ను విరూపను చేశాడు..
.
ఆ సుందరిని చూశావా ఇక అంతే సంగతులు,
మన్మధుడి బాణాలు నీ ప్రాణాలు తోడేస్తాయి!
.
లే ! ఇక ఆలస్యము చేయకు నీ కుడి పాదము ఇప్పుడే ఎత్తు !(బయలుదేరు). ఆవిడని ఎత్తుకొనిరా !
అని తొందర చేసింది శూర్పణఖ.
...
రామాయణమ్ 142
......................
శూర్పణఖ చెప్పిన విషయము పూర్తిగా విన్నాడు,మంత్రులందరినీ వెళ్లిపొమ్మన్నాడు.
తాను ఏమి చేయాలో దీర్ఘముగా ఆలోచించి
గుణ దోష విచారణ పూర్తిగా చేసి చేయవలసిన పనిగురించి ఒక అవగాహనకు వచ్చి వాహనశాలకు చేరుకున్నాడు.
.
రధాన్ని సిద్ధము చేయమని సారధికి ఆజ్ఞ ఇచ్చాడు.
.
సారధి అతిశీఘ్రముగా రత్నాలంకార భూషితమైన రధాన్ని సిద్ధము చేశాడు ,దానికి శ్రేష్టమైన గాడిదలు కట్టబడ్డాయి ,వాటి ముఖాలు పిశాచాల ముఖములాగా ఉన్నవి.
.
ఆ రధాన్ని ఎక్కి రావణుడు సముద్ర తీరము వైపుగా వెళ్ళాడు.
.
పది ముఖములు,ఇరువది భుజములు ,పది కంఠములు,పది శిరస్సులతో వైఢూర్యమువంటి
వంటి నిగనిగలతోస్వర్ణాభరణ భూషితుడై ఆకాశమార్గాన ప్రయాణం చేస్తుంటే చూసేవారికి కొంగలతోకూడిన నల్లటి మేఘములాగా కనపడ్డాటట.
.
ఆ తీరమంతా నయన మనోహరముగా ఉన్నది వివిధవృక్షజాతులు,ఎన్నో రకాల పక్షులు ,గంధర్వులు,మునులు ,దేవతలు,అప్సరసలు మొదలగు వారిచేత శోభాయమానముగా ఉన్నది.
.
ఆ సముద్రాన్ని దాటి ఆవలి వైపుకు వెళ్ళాడు రావణుడు అక్కడ సుందరముగా ,పవిత్రముగా ,ఏకాంతముగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు.
.
అక్కడ కృష్ణా జినాన్ని,జటలను,నారచీరను ధరించి ,ఆహారనియమాలు పాటిస్తూ తాపసవృత్తిలో ఉన్న ముని వేష ధారియైన మారీచుని చూశాడు .
.
వచ్చిన రాక్షస రాజుకు యధావిధిగా అతిధి సత్కారాలు గావించాడు మారీచుడు.
అంత త్వరగా మరల తనవద్దకు రావడానికి గల కారణమేమిటి?
అని ప్రశ్నించాడు .
రామాయణం 143
నేను ఆపదలో ఉన్నాను నన్ను గట్టెక్కించు తండ్రీ ,
నాకు కష్టాలు వచ్చినప్పుడు నీవే కదా దిక్కు నాకు ,
వాడెవడో రాముడట ,
జనస్థానములో మునులకు భీతి గొల్పుతూ నిర్భయము గా సంచరించే నా వాళ్ళను పదునాల్గు వేలమందిని ఖర,దూషణ ,త్రిశిరులతో సహా ఒక్కడే హతమార్చాడు. .
.
వాడు తన కోపాన్నంతా తన ధనుస్సుపై ఆవాహన చేసి పాదచారిగా ఉండి వాడి బాణాలు ప్రయోగించి ఒక్కడినీ వదిలిపెట్టకుండా మన వారందరినీ చంపివేసి ఋషులు భయములేకుండా తిరిగేటట్లు చేశాడు ఆ దుర్మార్గుడు .
.
ఆ రాముడు అధర్మవర్తనుడు,కఠినుడు,లుబ్దుడు,చెడ్డవాడు ప్రాణుల కీడు కోరేవాడు ,ఇంద్రియలోలుడు! తండ్రి కోపించి వెళ్ళగొడితే భార్యను తీసుకొని ,తమ్ముడితో కూడి కట్టుబట్టలతో అడవిలో సంచరిస్తున్నాడు. దరిద్రుడు వాడు,
.
మన శూర్పణఖను ఏ కారణము లేకుండా వికృతరూపను చేసినాడు ,దాని ముక్కుచెవులు నిష్కారణము గా కోసివేసినాడు .వాడికి ప్రతీకారము చేయవలె !
.
వాడి భార్య సీతను బలాత్కారముగా వాడినుండి దూరము చేయవలె !
.
ఆ సీతను ఎత్తుకొని రావాలనుకుంటున్నాను అందుకు నీ సహాయము కావలె నాకు అని అడిగాడు రావణుడు మారీచుడిని.
.
నీవు మాయారూపాలు ధరించడములో ప్రవీణుడవు కావున
వెండి చుక్కలతో బంగారు రంగుతో మెరిసిపోయే లేడి రూపాన్ని ధరించు ,వారి ఆశ్రమ పరిసరాలలో సంచరించు ,అందముగా ముచ్చటగొలిపే నిన్ను చూసి సీత మొహములో పడి నిన్ను పట్టి తెమ్మని అన్నదమ్ములను పంపిస్తుంది .
.
వారిని నీవు దూరముగా తీసుకొని వెళ్ళిన తరువాత నేను ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోతాను.
.
భార్య లేని రాముడు మనోవేదనతో కుంగిపోతాడు అప్పుడు చాలా సులువుగా అతనిని నేను కొట్టగలను .
అని తన మనసులోని ప్రణాళిక బయట పెట్టాడు.
.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మారీచుడు !
రాముడి పేరు వినబడగానే
ఆతని ముఖము వాడిపోయింది ,
భయముతో గజగజ వణికి పోయాడు.
ముఖములో కళతప్పి చనిపోయినవాడిలాగా అయిపోయాడు.
ఎండిపోయిన పెదవులను నాకుతూ దీనముగా ప్రాణం లేని చూపు చూశాడు రావణుని.
.
రావణా నీకు ఎవరు చెప్పారు రాముడి జోలికి వెళ్ళమని ! నీ గూఢచార వ్యవస్థ సక్రమముగా పనిచేస్తున్నదా?
లేదు ,పని చేయడము లేదు !
అందుకే నీవు సద్గుణాలప్రోవు ,వీరాధివీరుడు అయిన రాముని గూర్చి అనరాని మాటలంటున్నావు.........
.
రామాయణమ్ 144
........
రావణా ముల్లోకాలలో ఉన్న రాక్షసులకు ఎదో కీడు మూడేటట్లే ఉన్నది .సీత నీ చావుకోసమే పుట్టినట్లున్నది,ఆవిడ మూలాన నాకు కూడా మరణము సంభవించ వచ్చునేమో!
.
హాయిగా ,స్వేచ్చగా ,నిరంకుశముగా ఇప్పటిదాకా రాజ్యపాలన చేస్తున్నావు ,రాక్షసుల సుఖ సంతోషాలు,లంకాపట్టణము నీ యీ చర్య వలన నశిస్తాయేమో అని అనుమానముగా ఉన్నది.
.
నీవు అనుకున్నట్లుగా కౌసల్యా నందనుడు దుష్టుడు,దురాత్ముడు ,కఠినుడు,అపండితుడు,ఇంద్రియలోలుడు కాదు.
.
ఆయన తన తండ్రిని కైకేయి మోసము చేయటము చూసి తండ్రిని సత్యవాదిని చేయటము కోసము తన అంత తానుగా అరణ్యానికి వచ్చాడు.ఆయన సకల భూత మనోహరుడు.
.
రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ
.
రాముడుమూర్తీభవించినధర్మము ,సత్పురుషుడు ,
సత్యమైన పరాక్రమము కలవాడు ,
దేవతలకు దేవేంద్రుడు వలెనె సర్వలోకములకు ప్రభువు.
.
సీతమ్మ రాముడి రక్షణలో ఉన్నది సూర్యుడినుండి ఆయన కాంతిని ఎవరైనా అపహరించగలరా?
.
రాముడు ప్రజ్వరిల్లుతున్న నిప్పు ,ఆయన బాణాలు ఎగసే అగ్నికణాలు.
తెలిసి,తెలిసి ఆ మంటలలో దూకి బూడిద కాకు.
.
సీత రాముడికి ప్రాణము
,ఆవిడ ఎల్లప్పుడూ ఆయననే అనుసరించే వ్రతము కలది ! ఆవిడ మరొక అగ్నిజ్వాల!
.
వ్యర్ధమయ్యే ఈ పనిలోకి ఎందుకు ప్రవేశిస్తావు. రాముడి తేజస్సు ఇంత అని చెప్పటానికి సాధ్యము కాదు.
.
రాముడు ఏనాడైతే రణరంగములో నిన్ను చూస్తాడో ఆనాడే నీకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి!
రాముడి కన్ను పడనంతవరకే నీ బ్రతుకు. ,
హాయిగా పదికాలాలు రాజ్యము చేయాలని అనుకొంటే ఈ పిచ్చి ఆలోచన మానుకో.
.
వెళ్లి విభీషణాదులతో చర్చించి నీ బలమెంతో,రాముని బలమెంతో సరిగా అంచనా వేసుకొని నీ కేది హితమో ఆ పని చెయ్యి.
.
అని మారీచుడు స్పష్టముగా రావణునికి హిత బోధ చేశాడు.ఇంకా రాముడి పరాక్రమము గురించి తన అనుభవము చెప్పసాగాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి