*గులాబీ కోరిక*
✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు
బుల్లి తేనెటీగకు సొంతంగా ఎగిరి ప్రపంచం చూడాలని ఆశ పుట్టింది. పువ్వుల మకరందం సంపాదించి తేనె కూడబెట్టాలని కోరిక కలగడంతో వాళ్ళ అమ్మను ఒప్పించి గూడు నుండి ఎగిరింది.
దానికి ఒక చోట వికసించిన ఎర్రని గులాబీ కనబడగానే అక్కడ వాలాలని చూసింది. పువ్వేమో వెంటనే ముడుచుకు పోయింది. “ ఓ తేనెటీగా… ! మకరందం తేలిగ్గా తాగేద్దామని వచ్చావా? నాకేం కావాలో ఇచ్చేసి నీక్కావాల్సింది తీసుకో” అంది.
గులాబీకి ఏమివ్వాలా? అని తేనెటీగ ఆలోచిస్తోంది. ఇంతలో పొదల ప్రక్కన కుందేలు కనిపించింది. “గులాబీకి ఏమిస్తే నచ్చుతుంది?” అని దాన్ని అడిగింది.
“ఏమోనమ్మా. నాకేం తెలుసు. నేను దుంపలు ఏరుకోవాలి” అనేసి వెళ్ళిపోయింది.
అక్కడ నుంచి ఎగురుతూ వెళ్తుంటే గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది. ‘గులాబీకి ఏమివ్వాలని’ అని దాన్నీ అడిగింది. ‘నాకేం తెలుసు గులాబీకి ఏం కావాలో? నాకు గడ్డి మేయడం, పాలివ్వడమే తెలుసు” అని చెప్పింది ఆవు.
ఈ సమాధానంతో తేనెటీగ నిరాశ చెందింది. అలా కాస్త ముందుకు వెళితే దానికి నెమలి కనిపించింది. . “నెమలీ! గులాబీకి ఏమివ్వాలో నీకైనా తెలుసా?” అని అడిగింది.
“”ఏమో తెలియదు. కావాలంటే ఈ నెమలీక తీసుకెళ్ళి ఇచ్చి చూడు” అంది నెమలి.
నెమలీకతో వెళ్ళి గులాబీని పిలిచింది తేనెటీగ. “నాక్కావాల్సింది ఇది కాదు” అనేసి మళ్ళీ ముడుచుకుపోయింది గులాబీ.
ఈసారి చిలుక కనబడితే తేనెటీగ దాని సాయం కోరింది. “నా ఎంగిలి అంటే పిల్లలు ఇష్టపడతారు. నేను కొరికిన దోర జామ పండు తీసుకెళ్లి దానికి ఇవ్వు” అంది. తేనెటీగ తెగ సంబరపడి పోతూ.. గులాబీ దగ్గరకు వెళ్లింది. “పువ్వునైన నేను కాయలు తింటానా..? అని గులాబీ కసురుకుంది.
అది ఉసూరుమంటూ నీరసంగా వెళ్ళి ఒక పొద మీద వాలింది. “ఇంత పెద్ద అడవిలో ఎవరూ చెప్పలేరా గులాబీకి ఏమివ్వాలో? మకరందం దొరికే దారే లేదా?” అని గట్టిగా ఏడవసాగింది. ప్రక్కనే ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న మునికి తేనెటీగ మాటలు వినిపించాయి! దగ్గరకు పిలిచి గులాబీకి ఏమివ్వాలో చెప్పాడు.
వెంటనే తేనెటీగ ఒక మైదానంలో ఆడుకుంటున్న ముద్దులొలకబోసే పిల్లల దగ్గరకు వెళ్లింది. వారితో కాసేపు ఆడుకుంది. తరువాత వాళ్ళను గులాబీ మొక్క దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ జామ,బత్తాయి, అరటి పండ్ల చెట్లూ ఉన్నాయి. పిల్లలు కేరింతలు కొడుతూ “ఎంత బాగుందో ఇక్కడ” అని నవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు.
అప్పటికే గులాబీ పువ్వు దగ్గరకు వెళ్ళిన తేనెటీగ “నీకు కావాల్సింది పిల్లల నవ్వులేగా! అటు చూడు” అంది. పిల్లల నవ్వులకు గులాబీ సంతోషంగా వికసించింది. వెంటనే తేనెటీగ పువ్వు మీద వాలి కడుపు నిండా మకరందం త్రాగింది.
పిల్లలేమో తమకు నచ్చిన పండ్లు కోసుకుని వెళ్లారు. కాసేపటికి తేనెటీగ కూడా తన గూటికి చేరుకుంది. వాళ్ళ అమ్మకు ఎన్నో కబుర్లు చెప్పుకొంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి