15, అక్టోబర్ 2020, గురువారం

నవరాత్రులలో శివుడు.

 నవరాత్రులలో శివుడు..తాండవం చేస్తాడట..!!💐💐💐


'రాత్రము అనే మాట 'రేపు' ను సూచిస్తుంది. ఉత్తరభారతంలో వాడే పదం. 

సాధారణంగా పగటిపూట పురుష దేవతలకు, 

రాత్రి పూట స్త్రీ దేవతలకు పూజలు జరుపుతారు. 

కానీ, నవరాత్రుల సమయంలో రెండు పూటలా జరిపే పూజలు పరాశక్తి అమ్మవారికే చెందుతాయి. 


నవరాత్రులలో పరమశివుడు తాండవనృత్యం చేస్తాడనే విషయం ,అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. 

 అమావాస్య, పౌర్ణమి తిధులకు ముందు వచ్చే త్రయోదశి నాడు సాయం సమయంలో నాలుగు గంటల తర్వాత .ప్రదోషకాలంలో కైలాసనాధుడు లాస్యతాండవం చేస్తాడని పురాణాలు చెపుతాయి.


ప్రపంచమంతటికి జలప్రళయం సంభవించేప్పుడు శివుడు 'ప్రళయతాండవం ' చేస్తాడని , ఆ తాండవాన్ని జగదంబిక మాత్రమే వీక్షించగలదని పురాణాలు వివరిస్తున్నాయి. 

ఈ విషయాన్ని 'లలితా సహస్ర నామాలలో' ' మహాప్రళయ సాక్షిణి' అనే నామం స్పష్టం చేస్తోంది.


పరమశివుడు యీ నవరాత్రులలో నవ విధములైన తాండవ భంగిమలు ప్రదర్శించి కాలి వ్రేళ్ళతో అద్భుతమైన రంగవల్లులను తీర్చి దిద్దుతాడని, 

తన తాండవంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గను రంగవల్లుల ద్వారా రూపొందించి నవదుర్గలను వెలయింపజేస్తాడని , 

అలా వెలసిన నవ దుర్గలనే శరన్నవరాత్రులు లో మనం దర్శనం చేసుకుంటామని ప్రతీతి.


ఆ నవ దుర్గలే -

1. శైలపుత్రి : మొదటి రోజు అధిదేవత. 

శివుడు తన కుడికాలును నేలపై ఆన్చి ఎడమకాలును పైకెత్తి చేసే తాండవమే 'ఆనంద తాండవం'. 

ఈ భంగిమలో తీర్చిదిద్దిన రంగవల్లి  

'ఋషిమండల రంగవల్లీ ' 

దీని నుండే ' అక్షరములు జన్మించాయి.


2. కూష్మాండాదేవి : రెండవరోజు సాయంసంధ్యలో పరమేశ్వరుడు చేసే తాండవసమయంలో ఎడమకాలి వ్రేలితో దిద్దిన రంగవల్లి 'సప్తప్రకాశిని'. 

ఇందునుండే, కూష్మాండాదేవి ఉద్భవించింది.


3.బ్రహ్మచారిణి : మూడవ రోజు తాండవంలో ఎడమకాలు పెద్దవ్రేలితో తీర్చి దిద్దిన రంగవల్లి 'అష్టవసు రంగవల్లి. 

దీని నుండి 'బ్రహ్మచారిణి' ఆవిర్భవించింది.


4. చంద్రఘంటాదేవి : నాలగవరోజు తాండవం ఊర్ధ్వతాండవం. 

ఈ తాంతవంలో మహేశ్వరుడు ఒక కాలును నేలపై ఆన్చి తన మరియొక కాలును తన భుజములకు ఆన్చియుంచుతాడు. 

'తిరువేలంగాడు' క్షేత్రంలో శివుడు కాళికాదేవిని యీతాండవంతోనే ఓడించాడని స్థలపురాణాలు చెపుతాయి. 

శివుడు దిద్దిన 'ప్రణవనాద' రంగవల్లి నుండి 'చంద్రఘంటాదేవి' ఉద్భవించింది.


5. స్కందమాత :దేవ దానవులు అమృతం కోసం జరిపిన మధనంలో వచ్చిన కాలకూట విషాన్ని పరమశివుడు తన గొంతులో దాచుకొని 'నీలకంఠుడు' అయ్యాడు.

ఆ సందర్భంగా చేసిన తాండవమే 'భుజంగతాండవం' . అప్పుడు దిద్దిన రంగవల్లి నుండి 'స్కందమాత' ఆవిర్భవించింది.


6. 'కాత్యాయనీ దేవి' : శివభక్తుడైన పతంజలిముని మృదంగం వాయింప శివుడు తగిన విధంగా నాట్యం చేసి తన భక్తునికి ఆనందం కలిగించాడు. 

అందుకే యీ తాండవాన్ని 'మునితాండవం' అంటారు. శివుడు తన మూడవనేత్రం ద్వారా తీర్చిన రంగవల్లినుండే 'కాత్యాయనీ దేవి' ఉద్భ్యవించింది.


7. 'కాళరాత్రి' : గజ రూపంలో వచ్చిన దానవుని పరమశివుడు సంహారం చేసి ఆ గజ చర్మాన్ని ధరించి , కరములలో ఆయుధములు ధరించి చేసిన తాండవమే భూత తాండవం.

ఈ తాండవంలో దిద్దిన రంగవల్లి నుండి 'కాళరాత్రి' దేవి జన్మించింది.


8. "మహాగౌరీదేవి" : దండకారణ్యాలలోని మునులను అసురుల బారినుండి కాపాడిన సందర్భంగా మహేశుడు చేసిన తాండవం ' శుధ్ధ తాండవం' . 

అప్పుడు తీర్చిదిద్దిన రంగవల్లినుండి 'మహాగౌరీ' ఉద్భవించింది.


9. 'సిధ్ధిధాత్రీదేవి' : నవరాత్రులలో ఆఖరి రోజున సిధ్ధిధాత్రీదేవి ఆరాధన. 

నవరసములతో అత్యంత మనోహరంగా శివుడు చేసిన శృంగార తాండవం. 

ఈ నవరస తాండవ రంగవల్లినుండి 'సిధ్ధిధాత్రీదేవి' ఆవిర్భవించింది. 

ఈ నవరాత్రి ఆరాధన గురించి పరశురాముడు శ్రీరామునికి వివరించగా శ్రీరాముడు యీ నవరాత్రి మహోత్సవాలను భక్తితో జరిపి పరమేశ్వరుని అనుగ్రహం పొందినట్లుగా , 

ఆయనకు సర్వకార్యసిధ్ధి జరిగినట్లుగా పురాణాలు విశదీకరిస్తున్నాయి. 


అందువలన‌, ఈ నవరాత్రులలో విధివిధానాలు పాటించి నవదుర్గా స్వరూపిణియైన ఆది పరాశక్తి దేవిని పూజించడం ఎంతో శుభదాయకం.ఓం నమః శివాయ..!!

కామెంట్‌లు లేవు: