15, అక్టోబర్ 2020, గురువారం

సభా పర్వము – 3

 సభా పర్వము – 3

జరాసంధుని వృత్తాంతం

ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయయాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు ” ధర్మరాజా నీ తండ్రి కోరిక తీర్చడం నీకర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులు ఔతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం ” అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్ధుడు అని శ్రీకృష్ణుని తీసుకు వచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్తానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిని సత్కరించాడు.


శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో ” ధర్మనందనా ! నీ నిర్ణయం ప్రశంశనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇల అనే రెండు వంశాలు మిగిలాయి. అవి రెండే సహజ వంశాలు. మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ రెండు వంశాలు నూటొక్క వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ, వంశాల వలన మరో పదునాలుగు వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలనన్నింటిని జరాసంధుడు జయించాడు. ఛేది భూపాలుడు శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధి పతి. హంసఢింబకులు అనే మహా బలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. ఛేది రాజులలో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజులు పౌండ్రక వాసుదేవుడు జరాసంధుని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణదేశాల రాజులు పురుజితుడు, కరూశుడు, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు జరాసంధుని కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున పద్దెనిమిది మంది రాజవంశాలు భయంతో జరాసధుని కొలుస్తున్నారు. నేను వధించిన కంశుని భార్య జరాసంధుని కూమార్తె. అందు వలన జరాసంధుడు నా పై పగబూని ఉన్నాడు. ధర్మరాజా! ఆ హంస ఢింబకులు జరాసంధుడు మూడు లోకాలను జయించగలరు. ఒకసారి హంసఢింబకులతో మధురమీద దండెత్తారు. ఒక ఉపాయంతో హంసఢింబకులను చంపాము. ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము జరాసంధునితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము. మనం ముందు జరాసంధుని వధించాలి. అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది. నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు ” అని శ్రీకృష్ణుడు అన్నాడు.


అప్పుడు భీముడు ధర్మరాజు తో ” అన్నయ్యా ప్రయత్నంతో అన్ని విజయములు సమకూడుతాయి శ్రీకృష్ణుని దయ అర్జునిని సహాయం నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను ” అన్నాడు. అర్జునుడు ” అన్నయ్యా రాజులందరిని జయిస్తాము. రాజసూయం నిర్వహిస్తాము. లేకపోతే రాజసూయం, మయసభ, గాండీవం ఎందుకు ” అని అన్నాడు . భీమార్జునుల మాటలు విని శ్రీ కృష్ణుడు సంతోషించాడు. ధర్మరాజు ” కృష్ణా !అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు ? ” అన్నాడు. శ్రీకృష్ణుడు ” ధర్మనందనా ! మగధరాజైన బృహధ్రధుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు. వారికి సంతానం కలుగలేదు. అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి ఛండకౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు. వారి సేవలకు ఛండకౌశికుడు సంతోషించి వారిని చూసి ” ఏమి వరం కావాలి కోరుకో ” అన్నాడు. అందుకు బృహద్రదుడు ” మహాత్మా నాకు పుత్రసంతానం ప్రసాదించండి ” అని కోరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడమీద పడింది. మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రదునికి ఇచ్చాడు. ఈ పండుని తిన్న వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంతో ఆ పండును ఇద్దరు భార్యలకు కోసి ఇచ్చాడు. ఇద్దరు గర్భం ధరించి ప్రసవించారు. ఇరువురికి నిలువుగా సగం చీలిన శరీరంతో రెండు శిశువులు జన్మించారు. ఆ శిశుఖండాలను చూసి భార్యలిరువురు భయపడ్డారు. బృహధ్రధునికి చూపించటానికి సిగ్గుపడి పరిచారికలకు ఇచ్చి బయట పారేయించారు. వారు వాటిని నాలుగుదారుల కూడలిలో పారవేసారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకుని రెండు ముక్కలను పట్టుకుని చూడగా ఆశ్చర్యంగా రెండూ కలిసి ఒక బాలుని రూపంగా మారింది. ఆ బాలుని ఏడుపు విని అంతఃపురం లోని స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి రాక్షసి పారి పోయింది. ఇంలో అక్కడికి వచ్చిన బృహధ్రధుడు బాలుని చూసి సంతోషించాడు. ఇది గమనించిన రాక్షసి బృహధ్రధుని వద్దకు వచ్చి ” మహారాజా ! నేను జర అనే రాక్షసిని. ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి . ఇతడు వజ్రశరీరం కలవాడు. ఇతనిని స్వీకరింపుము ” అని చెప్పింది. బృహధ్రధుడు జరతో ” నీ దయ వలన నా వంశం ఉద్దరింప బడింది. కనుక ఈ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేస్తాను. నీవు నాపాలిట పుణ్య దేవతవు ” అన్నాడు. ఒకసారి ఛండకౌశికుడు బృహధ్రధుని వద్దకు వచ్చాడు . బృహధ్రధుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుని చూపించాడు. ఛండకౌశికుడు బృహధ్రధునితో ” వీడు పరాక్రమవంతుడౌతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు, ఇతనిని చంప లేవు. ఇతడు రాజులందరిని జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు ” అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాడ్యుడు అయ్యాడు. బృహధ్రధుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా ! భీమసేనుడు ఒకడే జరాసంధుని చంపగల సమర్ధుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు ” అన్నాడు. ” కృష్ణా ! నీ అండ ఉండగా మాకు పొంద లేనిది ఏమున్నది. ఇక జరాసంధుడు మరణించినట్లే . నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే ” అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపాడు.

శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం ససమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉన్నది. దానిపై మూడు ఢక్కలు ఉన్నవి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆఢక్కలను చూపి ” భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి ” అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు.శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు.



స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడుభీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు.

వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని ” మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? ” అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు ” మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం ” అన్నారు. జరాసంధుడు ” నేను ఎవరికి అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను ” అన్నాడు. ” ఓ జరాసంధా ! ధర్మరాజుఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా ? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా ? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా ? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించ కలరు ” అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుడు కోపించి ” పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలి పెడతాను.


సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి ” అన్నాడు.శ్రీకృష్ణుడు ” ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు ” అని అన్నాడు. జరాసంధుడు ” నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను ” అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడుజరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. శ్రీకృష్ణుడు ” భీమా ! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం అతడిని సంహరించు ” అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజు కు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడుద్వారకకు చేరుకున్నాడు.

కామెంట్‌లు లేవు: