*కష్టే ఫలే సుఖి*
సుగంధి పుష్పం తన సుగంధ పరిమళాలను పరులకు పంచి వారిని పరవశింప చేస్తుంది. అలాగే మంచివారు ఎప్పుడూ కూడా తమ మంచితనాన్ని పరులకు పంచి వారిని కూడా మంచివారిగా తీర్చి దిద్దుతారు.
అతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాకు చెందిన ఒక మారుమూల ప్రాంతంలోని ఒక పేద కుటుంబానికి చెందిన వాడు కతిరేశన్. అతడికి చిన్నతనం నుండి బాగా చదువుకోవాలనే కోరిక బలంగా ఉన్నా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాల సమస్యలు ఉండడం వల్ల అతడి చదువు తొమ్మిదవ తరగతికే పరిమితమై అంతటితో చదువు ఆపేయ వలసి వచ్చింది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సదుద్దేశంతో కష్టపడి ఏదో ఒకవిధంగా 1979 లో ఆర్మీలో చేరగలిగాడు. అక్కడ కతిరేశన్ వాహనాలను నడిపించే డ్రైవర్ గా పని చేస్తుండేవాడు.
అలా ఇరవై సంవత్సరాల పైనే అనుభవం ఉన్న కతిరేశన్ ను 2002 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అతడిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లోని DRDL ఆఫీసుకు బదిలీ చేసింది. అక్కడ ఆ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీస్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు పని చేస్తుండేవారు. ఆయన కారుకు డ్రైవర్ గా వి. కతిరేశన్ ను నియమించారు ప్రభుత్వం వారు. ఒకసారి కలాం గారు కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో కతిరేశన్ తో మాట్లాడు తున్నప్పుడు, మాటల మధ్యలో అతను కూడా కలాంగారి లాగా తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాకు చెందినవాడేనని తెలిసింది.
ఒక రోజు కలాం గారు కారులో ఆఫీసుకు వెళుతూ డ్రైవర్ కతిరేశన్ తో నీవు ఎంతదాకా చదువుకొన్నావు? అని అడిగారు. ఆర్థిక ఇబ్బందులతో డబ్బులులేక, నా చదువును 9 వ తరగతికే ఆపేశానండి. ఆ తరువాత 1979 లో ఆర్మీ లో చేరాను. అక్కడ డ్రైవర్ గా పనిచేస్తుంటే ఇపుడు ఇక్కడికి బదిలీ చేసారు, అన్నాడు అతను. అవునా అయితే ఆ మిగిలిన చదువును నీవు ఇప్పుడు చదవడానికి ప్రయత్నించు అన్నారు కలాం గారు. ఉలిక్కిపడిన కతిరేశన్ సార్ నాకు ఇంగ్లీషు అంటే చాలా భయం సార్, నేను ఫెయిల్ అయ్యింది కూడా అందులోనే సార్ అన్నాడు.
సరిగ్గా ఆ సమయానికే డబ్బులు కూడా లేకుండా అయిపోయింది. అంతటితో నా చదువు ఆగిపోయింది అని అనగానే, చూడు కతిరేశన్ నీ చదువు ఆగిపోయింది నీ పేదరికం వల్ల కానేకాదు, అది కేవలం నీ భయం అనే బలహీనత వల్లనే, మనసుంటే మార్గం ఉంటుంది, ధైర్యంతో ప్రయత్నించు తప్పకుండా విజయం సాధిస్తావు అన్నారు కలాం గారు. ఆ మాటలకు ఆ రాత్రి కతిరేశన్ కు నిద్ర పట్టలేదు. మరుసటిరోజు కలాం గారు ఆఫీస్ ముందు కారు దిగుతూ ''నీవు వెళ్ళి పరీక్షకు డబ్బు కట్టిరా '' అని పంపారు. కాదనలేక అలానే చేసాడు కతిరేశన్. ప్రతిరోజూ సాయంత్రం ఆఫీసు పని అయ్యాక కలాం గారు కతిరేశన్ కు ఇంగ్లీషు ట్యూషన్ చెప్పించారు.
కతిరేశన్ కూడా పట్టుదలతో చదువుకొని పరీక్ష రాసి ఈసారి ఇంగ్లీషులో పాస్ అయ్యాడు. అతడి భుజం తట్టి చూడు ''నీవు ఇంతటితో ఆపరాదు, మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయాలి '' అన్నారు కలాం గారు. తనకు అత్యంత కష్టమైన ఇంగ్లీషులోనే పాస్ అయ్యక చాలా ధైర్యం వచ్చింది కతిరేశన్కి. మెట్రిక్యులేషన్, డిగ్రీ కూడా పూర్తీ చేసాడు [దూరవిద్య ద్వారా ] ఇంతలో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యి, డిల్లీకి వెళ్ళిపోయినా, ఆయన తన కారు డ్రైవర్ ను మరచిపోలేదు. ఆ మహానుభావుడు అక్కడి నుండే కతిరేశన్ ముందు ముందు ఏమేమి చేయాలో సలహాలు ఇచ్చేవారు కలాం గారు. ఒకసారి కతిరేశన్ తనను కలవడానికి వచ్చినపుడు కలాం గారు అతనికీ Polygars of Tirunalveli అనే పుస్తకం ఇచ్చి, దీన్ని నీవు పూర్తిగా చదువు, ముందు ముందు నీకు పనికొస్తుంది, అన్నారు.
డిగ్రీ పూర్తి చేసిన తరువాత MA లో చేరి హిస్టరీ ని స్పెషలైజేషన్ గా తీసుకొన్నాడు కతిరేశన్. కలాం గారి సూచన మేరకు PhD కూడా చేయాలనుకొని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తిరునల్వేలి పాయగార్ ల మీద, ఆనాటి జమిందారి వ్యవస్థ మీద పరిశోధన చేయాలనుకొన్నాడు అతను. ఆసక్తికరమైన విషయ మేమంటే ఒకప్పుడు కలాం గారు తనకిచ్చిన పుస్తకం సరిగా ఆ విషయం మీదనే ఉంది. దాంతో విజయ వంతంగా PhD కూడా పూర్తీ చేసాడు. డ్రైవర్ ఉద్యోగం నుండి స్వచ్చంద పదవీ విరమణ [ VRS] తీసుకుని, ప్రస్తుతం తమిళనాడు లోని గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ [ Arthur ] లో కతిరేశన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.
చూశారా మిత్రులారా ! అయస్కాంతము, ఇనుము అనే ఈ రెండు కూడా లోహాలే కానీ వేటి గుణం వాటిదే. అయస్కాంతం దగ్గరికి ఇనుము వచ్చినా, ఇనుము దగ్గరికి అయస్కాంతం చేరినా, ఆ ఇనుప ముక్క అయస్కాంతంగా మారి దాని విలువ పెరుగుతుంది. కానీ అయస్కాంతం మాత్రం ఇనుముగా మారదు. అదేవిధంగా అయస్కాంతం వంటి అబ్దుల్ కలాం గారు ఇనుము వంటి కతిరేశన్ ను అయస్కాంతంగా మార్చి ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిగా మలిచి ఈ సమాజానికి అందించారు ఈరోజు కలాం గారి 87వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కథనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి