15, అక్టోబర్ 2020, గురువారం

మహాత్మ్యము

 శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము


✍️ గోపాలుని మధుసూదన రావు 


 శ్రీనివాస పద్మావతీ కల్యాణము 


కరవీరపురమునుండియు 

సరగున యట జేరినట్టి సాక్షాత్ లక్ష్మీ 

వరునిగ తన పతి నుండగ

కరముగ సంతోషమొందె కడుమోదమునన్. 187


అంతట తనచేతులతొ 

కాంతుని మఱితీర్చిదిద్దె కమనీయముగన్ 

కాంతగు పద్మకు వరునిగ 

శాంతముతొ పెండ్లి సేయ సంతోషముతోన్ 188


వైశాఖ శుక్ల దశమిన 

వ్యాసాదిగ సకలమునులు వాసవ ముఖ్యుల్ 

యీశాన బ్రహ్మదేవులు 

శ్రీ శ్రీనివాస పద్మకు జేసిరి పెండ్లిన్ 189


అప్పుగ దెచ్చిన పైకము 

గొప్పగ తా ఖర్చుజేసి గోవిందుడిలన్ 

వొప్పులకుప్పను పద్మను 

మెప్పుగ తా పెండ్లియాడె మెచ్చగ భక్తుల్ 190



లోకాల నేలు శ్రీపతి 

శ్రీకాంతను వీడి భువికి చేరినమీదన్ 

యాకాశరాజు దుహితగు 

భూకాంతను పెండ్లి యాడె భువిపులకింపన్. 191


చిలుకలకొలికగు పద్మకు 

నలినాక్షుడు దివ్యుడైన నారాయణుతో 

కలిప్రజ పరవశమొందగ 

కలిగెను కళ్యాణక్రతువు కమనీయముగన్. 192


సురులును మునులను బొగడగ 

హర బ్రాహ్మలు సతులతోడ యభినందించన్ 

కరముగ పెండిలి యాడిరి 

పరమాత్ముడు శ్రీనివాస పద్మావతులున్ 193 


శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరస్వామిగా 

      తిరుమల యందు నుండుట 


పరమాత్ముడు శ్రీపద్మను 

సురనర సంఘంబు బొగడ సురుచిర లీలన్ 

పరిణయ మాడియు తదుపరి 

తిరుమలలో నుండదలచె శ్రీమంతముగన్. 194


శ్రీతొండమాను దంతట 

యాతత మగు భక్తితోడ యాలయ మొకటిన్ 

శ్రీతిరుమల కొండలపై 

భూతితొ నిర్మింపజేసె భువి పులకింపన్. 195


హరి లీలగ సిరి పద్మల 

నురమున ధరియించి మిగుల నూర్జితశక్తిన్ 

తిరుమల యందున వెలసెను 

యరయగ నర్చావతార యాకృతినందున్ 196


అంతట శ్రీపద్మావతి 

కాంతుడు శ్రీ శ్రీనివాసు కడ శలవొందీ 

పొంతల తిరుచానూరున 

కాంతులు చిందంగ వెలసె కమనీయముగన్. 197


కరవీరపురము వెళ్ళియు 

వరలక్ష్మిగ వెలసి లక్ష్మి వందిత యయ్యెన్ 

హరిప్రియయగు యా లచ్చిమి 

వరముల పెక్కొసగి భక్తవరులను గాచెన్. 198 


హరిపై యలిగిన శ్రీరమ 

కరవీరపురమునందున కమలాసనియై 

వరముల బ్రోచుచు జనులను 

వరలక్ష్మిగ పేరుగాంచి వసుధలొ వెల్గెన్ 199


ప్రత్యక్షదైవ మనుచును 

సత్యముగల దేవుడనుచు సకల జనాళీ 

నిత్యము గొల్చుచునుండగ 

యత్యంత వైభవంబున హరి మల వెలసెన్. 200


కలియుగమున యిలమీదను 

వెలసెను సర్వేశ్వరుండు వేంకటపతియై 

పలువెతల బ్రతుకు ప్రజలకు 

సలలిత మోక్షంబునిచ్చు సంకల్పమునన్ 201


తిరుమలపై శ్రీనాథుడు 

తిరుచానూరందు పద్మ స్థిరముగ వెలసీ 

వరముగ యిహపరసుఖముల 

కరుణతొ సమకూర్చుచుండె కలియుగప్రజకున్. 202


పరమాత్ముడైన విష్ణువు 

తిరుమలపై వేంకటేశు తీరున వెలయన్ 

పరమేష్ఠి దేవదేవుని 

పరతత్త్వము నిట్లు నుడివె బ్రహ్మాన్దమునన్. 203


“ శంకరవినుతుడు శ్రీహరి 

సంకటములు బాపనెంచి సర్వావళికిన్ 

వేంకట యచలము మీదను 

పొంకముగా వెలసెనేడు భువి పులకించన్ 204



ఇలపై తిరుమల నగమున 

వెలసియు శ్రీవేంకటేశు విఖ్యాతాఖ్యన్ 

పలురూపుడైన విష్ణువు 

కలియుగ యంతంబువఱకు కాచును జనులన్ 205



ఇల శ్రీనివాసు డిటులను 

కలియుగ యంతంబు వఱకు కామిత ప్రభువై 

పలు ముడుపులు గైకొనుచును 

పలు కోర్కెల దీర్చుచుండి పాలించు ప్రజన్ 206


కలియుగ భక్తుల బ్రోవగ 

యిలపై నారాయణుండు వెలసెను మలపై 

తొలివేలుపైన నతనికి 

పలుమ్రోక్కులు దీర్చి ప్రజలు బడతురు సుఖముల్ “. 207



పలురూపుడైన విష్ణువు 

యిలపై శ్రీవేంకటేశ విఖ్యాతాఖ్యన్ 

వెలసిన కతమున తిరుమల 

కలియుగవైకుంఠ మయ్యె కమనీయముగన్. 208


శ్రీవేంకటనగ మిలలో 

భూవైకుంఠంబు వలెను భూతితొ నొప్పన్ 

శ్రీవేంకటేశు డిచటను 

శ్రీవైభవమొప్ప వెలసె శ్రీగతులీయన్ 209


మంగళమో మహిమాన్విత !

మంగళమో వేంకటేశ ! మంగళరూపా ! 

మంగళమో యిలవేలుపు ! 

మంగళమో దేవ దేవ ! మముదయగనుమా ! 210


                    ---- ----. ----


‘ గోపాలుడు ‘ వేంకటపతి 

‘ నా ‘ పాలిట దైవమనుచు నయముగ నమ్మీ 

గోపాలుని మధుసూదన 

యీ పావనకథను వ్రాసె నిహపరములకై. 211


ఓంకార స్వరూపుండును 

సంకటములు బాపునట్టి సర్వేశుడు శ్రీ 

వేంకటగిరి యిలవేల్పుకు 

యంకితమును జేసె తనదు యాత్మలొ రచనన్ 212


                 ---- శుభమ్ . మంగళమ్ మహత్ ----

కామెంట్‌లు లేవు: