15, అక్టోబర్ 2020, గురువారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


111 - విరాటపర్వం.


సుధేష్ణాదేవి చెబుతున్న పలుకులు కీచకునికి రుచించడం లేదు. కామపీడితుడైన వానికి, కాలం సమీపించినప్పుడు, మృష్టాన్న భోజనం రుచిస్తుందా ? అందుకే, ఆమె పలుకులు, అసందర్భ సంభాషణలుగా, తోచాయి.


అదే జరిగింది. ' అక్కా ! సుధేష్ణా ! లెక్కకు మిక్కిలి గంధర్వులను ఒక్కపిడికిలి గ్రుద్దుతో చంపగల సమర్థుడను. ' అయిదుగురు గంధర్వులు వున్నారేమో, అని లేని గంధర్వులను ఊహించుకుని, అప్సరస లాంటి స్త్రీ పొందును వదులుకుంటానా ? అంత మందమతి లాగా కనబడుతున్నానా నేను ? నీవు వారి సంగతి మరచిపో, సైరంధ్రిని నా వద్దకు పంపే కార్యాచరణ చూడు. ' అని అన్నాడు కీచకుడు.


ఇక సుధేష్ణ విసిగిపోయి, ' మృత్యుకోరలలోనికి వెళ్తున్న నిన్ను ఆప శక్యంకాదు. మన వంశనాశనం యీరీతిగా జరుగపోతున్నది. కానీ, ఆ దుష్కృత్యం నాద్వారా జరుగు తున్నది. నీకు చెప్పగలసమర్ధత నాలో లేనందుకు నన్ను నేను తూలనాడుకొనే పరిస్థితి వచ్చింది. సరే నాప్రయత్నంగా నేను మాలినిని నీవద్దకు పంపుతాను. నీవు, నాకొరకై మధురపదార్ధాలు,మత్తెక్కించే మద్యం తయారు చేయించు, బహిరంగంగా. అవి తీసుకువచ్చే నెపంతో ఆమెను నీవద్దకు పంపుతాను. ఆపై దైవేచ్ఛ. ' అన్నది సుధేష్ణా దేవి, కనుల నీరుకారుతుండగా.


కీచకుని ఆనందానికి తిరుగులేదు. వెంటనే తనసౌధానికివెళ్లి, రకరకాల వంటకాలు, మద్యము తయారు చేయించి సిద్ధంగావుంచి తన అక్కగారికి కబురుపెట్టాడు. సైరంధ్రిని పంపమని తొందరపెట్టాడు.


సుధేష్ణ నిస్సహాయ పరిస్థితులలో, సైరంధ్రిని పిలిచి, తనకు కీచకుని యింటినుండి మద్యము, మధుర పదార్ధాలు తెమ్మని పురమాయించింది. అయితే, ద్రౌపది అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన నియమాలను, సుధేష్ణ వుల్లంఘిస్తున్నదని సూటిగా చెప్పింది, ద్రౌపది. . తనను కామించినవాని గృహానికి పంపడం న్యాయం కాదని వాపోయింది. నేను సైరంధ్రిని కానీ, నీ తమ్మునికి దాసీనికాదని, తిరగబడింది. సుధేష్ణ సైరంధ్రి చేతులు పట్టుకుని, ' నేను నిస్సహాయురాలను. ఈ రాజ్యము నా తమ్ముని భుజబలంవలన రక్షించబడుతున్నది. మహారాజుకు కూడా అతనిని యెదిరించే ధైర్యములేదు. కాబట్టి మా క్షేమంకోరి నీవు వెళ్ళిరా ! నీ భర్తలు నిన్ను తప్పక కాపాడుతారు, అంత అవసరంవస్తే. ' అనిచెప్పి కీచకుని వాటికకు ద్రౌపదిని యెట్టకేలకు పంపింది.


ద్రౌపది భయపడుతూ గుండె అదురుతుండగా, కీచకుని భవనం లోనికి ప్రవేశిస్తూ, దైవ సహాయం కోరుతూ, సూర్యభగవానుని స్తుతించింది. తన పాతివ్రత్యదీక్ష సాక్షిగా యీ ఆపద గట్టెక్కించమని కోరుకున్నది. సూర్యదేవుడు కూడా ఆమెవున్న పరిస్థితికి చలించి, ఆమెకు తోడుగా, అదృశ్యరూపంలో, ఒకరాక్షసుని నియమించాడు. ఆ రాక్షసుడు ద్రౌపది వెంట నీడలా వెన్నంటివున్నాడు.


ద్రౌపది కోసమే యెదురుచూస్తున్న,కీచకుడు, ఆమెరాకను గమనించి, ఒక్క వుదుటున లేచి, ఆమెకు స్వాగతం చెబుతూ, ఆమె రాకతో తనకు ఆ రోజు సుదినమైందని, తనను అంగీకరించమని ప్రాధేయపడ్డాడు. దగ్గరలో కుప్పలుగా పోసిన అమూల్య రత్న బంగారుఆభరాలు ఆమెకుచూపించి, ఆమె రాకకొరకై అవిఅన్నీ యెదురు చూస్తున్నాయనీ, వాటిని ధరించి, ఆభరణాలకు వన్నెతెచ్చి, తనను ఆనందింప జేయమనీ, మళ్ళీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఆగలేకవచ్చి ఆమె కుడిచేతిని పట్టుకున్నాడు.


ద్రౌపది కీచకుని చేతిని విదిలించుకుని, ' నీచుడా ! నీచావు నాకళ్ళముందే జరిగేటట్లు అగుగాక ! ' అని తన పళ్ళు పటపటా కొరికింది. కీచకుడు ఆమెమాటలకు మరీ రెచ్చి పోయాడు. ఆమెను బాహువులలో బంధించాలనుకున్నాడు. ఆమె దొరకకపోయే టప్పటికి, ఆమె పమిటచెంగు పట్టుకున్నాడు.


ఎటూతోచక భయవిహ్వలయై, ద్రౌపది, ధర్మరాజు వున్న విరాటుని కొలువులోనికి ప్రవేశించింది. ఆమెను పరిగెత్తిస్తూ, కీచకుడు కూడా కొలువులోనికి ప్రవేశించాడు. ఆమెవెంట వేటగానివలే పరుగెత్తి ఆమె శిరోజాలను పట్టుకొని ఆమెను యీడ్చాడు . ధర్మరాజు మిగిలిన వారందరూ చూస్తుండగా, ద్రౌపదిని కాలితో ఆమె ముఖంపై తన్నాడు. ఆదెబ్బకు ద్రౌపది ముఖానికి గాయమై రక్తంకారింది. ఆమెను యింకా పరాభవించబోతుండగా, సూర్యుని చేత పంపబడిన రాక్షసుడు, కీచకుని అమాంతంగా దూరంగా విసిరివేశాడు. ఏం జరిగిందో అర్ధంకాక కీచకుడు ఒక్కక్షణం నిర్ఘాంతపోయి తననుతాను చూసుకున్నాడు.


కీచకుని దుష్ట ప్రవర్తనకు సభికులు దిగ్భ్రాంతిచెందారు. కొందరు కీచకుని ప్రవర్తనను ఖండించారు. కొందరు యేమి మాట్లాడితే యేమిప్రమాదమో అని మౌనంగా వుండి, భయంగా చూస్తున్నారు. సభలోవున్న ధర్మరాజు, భీమసేనుడు, కోపంతో వణికిపోయారు. భీముడు కీచకుని వెంటనే మట్టుపెట్టాలని, ప్రక్కనేవున్న ఒకవృక్షం వైపు తదేకంగా చూడసాగాడు. అది గ్రహించి ధర్మరాజు, 'వల్లవా ! ఆ చెట్టుపై అంత తీక్షణం గా యెందుకు దృష్టిపెట్టావు ? నీకు వంటచెరకు కావాలంటే, వేరే యెక్కడైనా అరణ్యంలో చెట్లు తెచ్చుకో ! పదిమందికీ నీడనిచ్చే, ఫలాలు యిచ్చే యీచెట్టును, నీవెందుకు పాడు చెయ్యాలనుకుంటున్నావు ? ' అని సంయమనం పాటించమని భీమునితో చెప్పినట్లు చెప్పాడు.


ధర్మరాజు ఆంతర్యం గ్రహించిన భీముడు, ఆవేశాన్ని తగ్గించుకుని నెమ్మదించాడు. కానీ, ద్రౌపది మాత్రం ధర్మరాజు మాటలకు రోషంగాచూస్తూ, దుఃఖించింది. విరాటరాజుతో, ' రాజా ! మీ యెదుటే, కీచకుడు నా జుట్టులాగాడు. కాలితోతన్నాడు. ఈ నీచునినుండి నాకు రక్షణకలిపించి, నన్ను ఆదుకోండి. నా భర్తలు యిదంతా చూస్తూనే వుండివుంటారు. కానీ యెందుకో, మౌనంగావున్నారు. నపుంసకులవలె ప్రవర్తిస్తున్నారు. మీరు కూడా ధర్మాన్ని యెదిరించలేక అశక్తులై వున్నారు. ఈ సభలో ధర్మచింతన లేదు. ఈసభ వల్లకాటితో సమానం. సభలోని సభికులు నోరెత్తలేదంటే, వీరూ అధర్మాన్ని కోరుకుంటున్నవారే ' అని తూర్పారబట్టింది.


కీచకుడు అధర్మపరుడని తెలిసినా, విరాటరాజు అతనిని దండించే పరిస్థితిలో లేడు . అది తెలిసే కీచకుడు నిండుసభలో అంత నీచానికి ఒడిగట్టాడు. ఒకప్పుడు కౌరవసభలో, ధృతరాష్ట్రుడు, అశక్తుడని తెలిసే, దుర్యోధనాదులు పెచ్చుమీరి, ద్రౌపదిని అవమానించారు. అదే చరిత్ర యిక్కడా పునరావృతమైనది. సభలు వేరైనా బాధితురాలు ద్రౌపదే ! ప్రభువులు బలహీనులయితే అబలలకు రక్షణుండదనే మాట, ముమ్మాటికీ సత్యమని రెండుసభలూ నిరూపించాయి.


విరాటరాజు మేకపోతు గాంభీర్యంతో, ' సైరంధ్రీ ! మీ యిద్దరిమధ్య జరిగిన వివాదం సభలో యెవరికీ తెలియదు. కీచకునికి ఆగ్రహం తెప్పించేంత పని నీవు యేమిచేశావో కూడా మాకెవ్వరికీ తెలియదు. ఇట్టి పరిస్థితులలో నీవివాదంలో యెవరుమాత్రం జోక్యంచేసుకోగలరు చెప్పు ? ' అని ఆమెతో అనునయంగా అంటూ కీచకునికి కోపం రాకుండా చూసుకున్నాడు.


ఇలా కాదని, తాడో పేడో తేల్చుకునే ఉద్దేశ్యంతో ద్రౌపది, ధర్మరాజు వైపు తిరిగి సంభాషించబోయింది. అయితే, ధర్మరాజు ఆమెకు ఆ అవకాశం యివ్వకుండా 

' సైరంధ్రీ ! నీ భర్తలు అయిదుగురు వీరాధివీరులు, శూరాధిశూరులు అంటున్నావు కదా ! నీవిక్కడ ఉండవలసిన పనిలేదు. వెంటనే సుదేష్ణాదేవి మందిరానికి వెళ్ళు. నీ భర్తలు నిన్ను రక్షించడానికి యెందుకురాలేదు. బహుశా, యిది తగినచోటు, సమయం కాదనుకున్నారేమో ! స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు. యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారులు రక్షిస్తారు. ఆమె అబల అనికాదు. అది ఆమె హక్కుగా పరిగణించాలి. స్త్రీ ప్రత్యేకంగా స్వతంత్రంగా వ్యవహరించి, తన సుకుమారతను పోగొట్టుకోవలసిన అవసరంలేదు. ఆమెరక్షణ ఆయా జీవనదశలలో మగవారి దగ్గరనుండి హక్కుగా పొందాలి. యాచించవలసిన అవసరం లేదు.'


' మాలినీ ! కులస్త్రీకి వ్రతాలు, వుపవాసాలు అక్కరలేదు. పతిసేవలోనే అన్నిపుణ్యాలు సంప్రాప్తిస్తాయి. నీకు ఓర్పే, ఓదార్పు. ఓపికబట్టు. క్షమాగుణం సత్య , ధర్మ గుణాలను ఆవిష్కరిస్తుంది. ఈ సమస్యా పరిష్కారం కాలమే సూచిస్తుంది. ఇంకా ఒకమాసమే మిగిలివున్నదేమో, కాలసమాప్తికి. నీ భర్తలు చూస్తూనే వుండివుంటారు. అదను చూసుకుని నీ రక్షణకు వస్తారేమో. ' అని నర్మగర్భంగా, చెప్పాడు.


ధర్మరాజు మాటలకు,ఇంకా రోషం కలిగింది ద్రౌపదికి. కంకుభట్టుని సంబోధిస్తూ, తన మనసులోని ఆక్రోశం వెళ్ళగ్రక్కసాగింది.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: