15, అక్టోబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో.....83

 పోత‌న త‌ల‌పులో.....83


శుక‌యోగీంద్రుల వారి బోధ‌తో ప‌రీక్షిత్తు ప‌ర‌మాత్మ‌పై ప‌రిపూర్ణ‌మైన మ‌న‌స్సు ల‌గ్నం చేసి , సర్వేశ్వరుడు, సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి, పోషించి, సంహరిస్తున్నాడో అలాంటి విషయాల‌న్నీవివ‌రించ‌మ‌ని శుక‌యోగీంద్రుల‌వారిని కోరాడు.

                   **

జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే

భగవంతుండు సరస్వతిం బనుప, నా పద్మాస్య దా నవ్విభున్

మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా

రగుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్

                     **

భగవంతుడు పూర్వం ,జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో, సరస్వతిని పంపంగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి ఆయనను సృష్టి నిపుణుణ్ణి చేసింది. అట్టి ఆ భగవంతుని భజనకు ఉపక్రమిస్తాను అని అంటున్నాడు శుక‌యోగుల‌వారు.

                          **

పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ-

  మున మేనులను పురములు సృజించి;

పురములలోనుండి పురుషభావంబున-

  దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ?

బంచభూతములను పదునొకం డింద్రయ-

  ములఁ బ్రకాశింపించి భూరిమహిమ

షోడశాత్మకుఁడన శోభిల్లు, జీవత్వ-

  నృత్త వినోదంబు నెఱపుచుండు?

                        **

నట్టి భగవంతుఁ, డవ్యయుం, డచ్యుతుండు

మానసోదిత వాక్పుష్ప మాలికలను

మంజు నవరస మకరంద మహిమ లుట్ట

శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.

                    **

తాను పరిపూర్ణుడై ఉండికూడ పృథివ్యాది పంచ మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో; పంచభూతాలను, పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడషశకళాత్మకుడై శోభిల్లుతు ఎవడు జీవత్వ మనే నృత్తవిలాసం ప్రదర్శిస్తుంటాడో; ఆ అవ్యయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు, మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాల నలరించుగాక.


                                        ***

మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ

ధ్యాన మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి, ముక్తులై

లూనత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్, విశంక టా

జ్ఞానతమోనభోమణికి, సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్."

                      **

మానమే ధనముగా గలవారు, మహనీయులు, సమాధినిష్ఠులు, వ్యాసభగవానుని ముఖపద్మధ్యాన మనే తేనె త్రాగుతూ, భయరహితులై, భవబంధ విముక్తులై ప్రకాశిస్తారు. అట్టి ఆ మునిజన మకుటాయమానుడు, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రభానుడు, శిష్ఠులలో ప్రధానుడు అయిన వ్యాసభగవానునికి న‌మ‌స్క‌రిస్తున్నాను.

.అని తండ్రి యైన వ్యాసమహర్షికి ప్రణమిల్లి శుక యోగింద్రుడు పరీక్షిన్మహారాజకి ఇలా చెప్పసాగాడు.

                                            **

"అవిరోధంబున నీవు నన్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా

ధవుచేతన్ విని నారదుం డడిగినం దథ్యంబుగాఁ జెప్పె; మా

నవలోకేశ్వర! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె; సం

శ్రవణీయంబు, మహాద్భుతంబు వినుమా, సందేహవిచ్ఛేదివై.

                             ***

“ఓ మహారాజా! నీ విపుడు నన్నడిగిన విషయాన్నే పూర్వం బహ్మదేవుడు నారాయణునివల్ల విన్నాడు. నారదుడు అడుగగా దానినే ఆయన వివరించాడు. ఆపైన నారదుడు నాకది తెలియజేశాడు. వినదగినది, మహాద్భుతమైనది, సంశయం తొలగించేది అయిన‌ ఆ విషయం నీకు చెపుతాను, విను....అని శుక‌యోగుల‌వారు ప‌రీక్షిత్తుకు ఆ విశేషాలు చెప్పాడు...


నార‌ద మ‌హ‌ర్షుల‌వారు బ్ర‌హ్మ‌దేవుని ఒక‌రోజు ఇలా అడిగాడు.....

                                   ***

"చతురాస్యుండవు; వేల్పు బెద్దవు; జగత్సర్గానుసంధాయి; వీ

శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం

యుతమై, సర్వము నీకరామలకమై యుండుంగదా; భారతీ

సతి యిల్లాలఁట నీకు; నో జనక నా సందేహముం బాపవే.

                                           **

తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. దేవతలలో పెద్దవాడవు. లోకాలకు సృష్టికర్తవు. వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి. శబ్దార్థమయమైన విశ్వమంతా నీకు అరచేతిలోని ఉసిరికాయలా తేటతెల్లమై ఉంటుంది. పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట. ఈ నా సందేహం తీర్చు తండ్రీ!

                                     **

ప్రారంభాది వివేక మెవ్వఁ డొసగుం? బ్రారంభ సంపత్తి కా

ధారం బెయ్యది? యేమి హేతువు? యదర్థం బే స్వరూపంబు? సం

సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడుం

భారం బెన్నఁడు లేదు; నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా!

                ***

ఈ జగత్తును సృష్టించే విజ్ఞానం నీ కెవరు ప్రసాదిస్తున్నారు? దానికి ఆధార మేమిటి? ఈ సృష్టి నిర్మాణానికి హేతు వేమిటి? దీనికి ప్రయోజన మేమిటి? దీని స్వరూప మేమిటి? సాలెపురుగులా ఎడతెగకుండా సృష్టికార్యం సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది. నీ జీవనపద్ధతి అందరికీ లభ్యపడేది కాదయ్యా ...వాణీశ్వ‌రా....అని నార‌దుడు బ్ర‌హ్మ‌దేవుని అడిగాడు.


       🏵️పోత‌న ప‌దం🏵️

🏵️ప‌ర‌మాత్మ లీలావిశేషం🏵️

కామెంట్‌లు లేవు: